Monday, May 20, 2024
Monday, May 20, 2024

రాష్ట్రంలో దెబ్బ తిన్నా… కేంద్రంలో మంత్రి పదవి

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అతికొద్దిమంది నిజాయితీపరుల్లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఒకరు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరవాత 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటికి ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి ఉన్నారు. పెద్దమనిషిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. 1983 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరఫున నిధుల పంపిణీ, ఖర్చు బాధ్యతను అధిష్ఠానం ఆయనకే అప్పగించింది. ఆ ఎన్నికల్లో ఖర్చుచేయగా మిగిలిన సొమ్మును విజయభాస్కరరెడ్డి దిల్లీ తీసుకువెళ్లి అధిష్టానానికి అప్పగించారట. అప్పట్లో పార్టీ అధ్యక్షుడు, ప్రధాని అయిన రాజీవ్‌గాంధీకి చాలా ఆశ్చర్యం వేసిందట. విజయభాస్కరరెడ్డి నిజాయితీకి గుర్తింపుగా ఆయనను కేంద్రానికి పిలిపించుకుని మంత్రిపదవి ఇచ్చారు. ఆ సమయంలో ఒకసారి రాజీవ్‌గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, కోట్ల విజయభాస్కరరెడ్డి, విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్‌ వంటి నిజాయితీపరులతో తన ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని చెప్పారు. విజయభాస్కరరెడ్డి 1983 నుంచి 1984లో లోక్‌సభ ఎన్నికలు జరిగేవరకు షిప్పింగ్‌, రవాణా, పరిశ్రమలు, కంపెనీ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. తరువాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో 1991 నుంచి 92 వరకు న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. 1992 అక్టోబర్‌ 9న మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి, 1994 డిసెంబర్‌ 12 వరకు పదవిలో ఉన్నారు. విజయభాస్కరరెడ్డి 1977, 1984, 1989, 1991, 1996లో కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కోట్లకు వ్యవసాయం అంటే మక్కువ. వృత్తిరీత్యా న్యాయవాదిగా కూడా ఉన్నారు. క్రీడాకారుడు కూడా. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img