Monday, May 20, 2024
Monday, May 20, 2024

కంచుకోటలు నిలిచేనా?

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, వైసీపీ లోక్‌సభ కంచుకోటలకు పగుళ్లు ఏర్పడే పరిస్థితులు కనిపి స్తున్నాయి. ఈ ఎన్నికల్లో వారి గెలుపునకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇండియా కూటమి బలపడటం. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ, జనసేన బహిరంగం గాను, వైసీపీ లోపాయికారికంగాను పొత్తులు పెట్టుకోవడంతో ఆ పార్టీల పోకడలలను ప్రజలు గమనిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ అనంతరం 2014, 2029లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ గెలుస్తూ వస్తున్న లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ సారి ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. 2014 ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాలకు వైసీపీ 8, టీడీపీ, బీజేపీకూటమి 17స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో బీజేపీ ఎంపీలుగా విశాఖ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు విజయం సాధించారు. వైసీపీ ఎంపీలుగా అరకు వాలీ (ఎస్టీ) నుంచి వంగా గీత, ఒంగోలువైవీ సుబ్బారెడ్డి, నంద్యాలఎస్‌పీవై రెడ్డి, కర్నూలుబుట్టా రేణుక, కడపవైఎస్‌ అవినాశ్‌రెడ్డి, నెల్లూరుమేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాదరావు, రాజంపేటలో పీవీ మిథున్‌రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఎనిమిది మందిలో ముగ్గురు ఎంపీలు వంగా గీత, ఎస్‌పీవైరెడ్డి, బుట్టా రేణుక వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2019 నాటికి వైసీపీ లోక్‌సభ ఫలితాల్ని చూస్తే…22 మంది ఎంపీలతో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ి కేవలం 3 లోక్‌సభ స్థానాలే దక్కించుకుంది. వారికి అతి తక్కువ మెజార్టీలే లభించాయి. శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్‌నాయుడు 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని), 4,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి 4,205 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఈ మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ స్థానాలు టీడీపీకి కంచుకోటలుగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ, గుంటూరుకు అభ్యర్థులు మారినప్పటికీ, ఎన్డీఏ కూటమి పార్టీలైన బీజేపీ, జనసేనతో కలిసి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే సమయంలో వైసీపీకి కూడా 2014, 2029 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన కీలక ఎంపీ స్థానాల్ని ఈ విడత వైసీపీ కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. 2014లో వైసీపీ గెలిచిన 8 లోక్‌సభ స్థానాలతోపాటు మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కడప, రాజంపేట, కర్నూలు, ఒంగోలు, అరకు తదితర స్థానాలు కీలకంగా నిలుస్తున్నాయి. ఇందులో 2024 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితులతో…కడప, రాజంపేట, ఒంగోలు, అరకు లోక్‌సభ స్థానాల్లో వైసీపీ కోటలకు కాస్త పగుళ్లు పట్టినట్లుగా కన్పిస్తున్నది. కడప లోక్‌సభ నుంచి వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి సీఎం జగన్‌ సోదరి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల బరిలోకి దిగారు. మరోవైపు ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో ఫలితం ఎలా ఉంటుందనేదీ ఉత్కంఠగా ఉంది. రాజంపేట లోక్‌సభకు ఎంపీ మిథున్‌రెడ్డి మూడోసారి గెలుపొందేందుకు సిద్ధమయ్యారు. ఆయన వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు. ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో రాజంపేట ఎన్నిక రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. ఒంగోలు లోక్‌సభనూ వైసీపీ ఆవిర్భావం నుంచి గెలుస్తున్నది. ఈ సారి ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సీఎంకు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నిలిపి, అక్కడ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు లోక్‌సభ కూడా వైసీపీ కంచుకోటగా నిలుస్తున్నది. ఇక్కడ 2014లో వైసీపీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2019లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మారిన సమీకరణ రీత్యా, వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిని సీఎం బరిలోకి దించారు. అదే స్థానం నుంచి వైసీపీని వీడి, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ తాజా రాజకీయ సమీకరణలతో నెల్లూరు ఎంపీ పీఠం ఎవ్వరికి దక్కుతున్నదనేది ఆసక్తికరంగా మారింది. అరకులోనూ ఇండియా కూటమి తరపున సీపీఎం అభ్యర్థి బరిలోకి నిలవడంతో ఈ సారి వైసీపీ తడబడుతోంది.


సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img