Friday, May 17, 2024
Friday, May 17, 2024

రాజకీయ వలసలు

స్థానికేతరులకు ఎంపీ సీట్లు .. ధన బలమే కొలబద్ద
గెలుపు ఆరాటంలో వైసీపీ, ఎన్డీఏ

సార్వత్రిక ఎన్నికల బరిలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుంచి వలస నేతలు దిగారు. ప్రాంతాలు, నియోజకర్గాలతో సంబంధం లేనివారికి ప్రధాన పార్టీలు లోక్‌సభ టిక్కెట్లు కట్టబెట్టాయి. అధికార వైసీపీతోపాటు ఎన్డీఏ కూటమి పార్టీలు ధన బలం కలిగిన వారికి సీట్లు కేటాయించగా, కొన్ని చోట్ల మాత్రం సామాజిక సమీకరణలతో సీట్లను సర్దుబాటు చేశారు. ప్రాంతాలు, జిల్లాలను దాటి మరీ వారికి సీట్లు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంతో అధికార వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చంద్రబాబు నుంచి మిగిలిన ముఖ్యనేతలందరితోనూ ఆయనకు పూర్తి సంబంధాలున్నాయి. దానికితోడు బీజేపీలో చేరాక ఆయన రాజకీయ పరిచయాలు విస్తృతమయ్యాయి. అత్యంత ధనవంతుడైన సీఎం రమేశ్‌కు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సంబంధాలు లేవు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని బరిలోకి దించారు. ఆమె బాపట్ల జిల్లాకు చెందిన వారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విశాఖ నుంచి ఎంపీగాపోటీ చేసి, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పొత్తుల్లో భాగంగా ఆమెకు రాజమహేంద్రవరం ఎంపీ సీటును ఆధిష్టానం ఖరారు చేసింది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా స్థానికేతరుడైన పుట్టా మహేశ్‌ యాదవ్‌ను ఆధిష్టానం ఖరారు చేసింది. ఏలూరు టీడీపీ టిక్కెట్‌ కోసం ఎన్‌ఆర్‌ఐ గొరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ ఎంతో ప్రయత్నించారు. చాలా కాలం నుంచి ఏలూరు పార్లమెంట్‌ నియోజకర్గ పరిధిలో ఆయన సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. చివరి దశలో ఆయనను కాదని పుట్టా మహేశ్‌ యాదవ్‌కు సీటు ఖరారు చేశారు. దీంతో కలత చెందిన గొరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ వైసీపీలో చేరారు. మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు కూడా ఈ సీటును ఆశించారు. ఆయనను కూడా టీడీపీ పక్కన పెట్టి, పుట్టా మహేశ్‌ను ఖరారు చేసింది.
వైసీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న వారిలో కొందరు వలస నేతలున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా ఆధిష్టానం బరిలోకి దించింది. ఒంగోలులో నెలకొన్న రాజకీయ పరిణామాలతో వ్యూహాత్మకంగా చెవిరెడ్డి పేరును సీఎం జగన్‌ ఖరారు చేశారు. 2019లో ఒంగోలు వైసీపీ ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపొందారు. ఆయన తనయుడు దిల్లీ లిక్కర్‌ కేసులో అప్రూవర్‌గా మారడం, ఆ కేసు ఇంకా కొనసాగడం వెరసి మాగుంటకు టిక్కెట్‌కు ఇచ్చేందుకు వైసీపీ ఆధిష్ఠానం నిరాకరించింది. మాగుంటకు టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనంటూ… ఒంగోలు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆధిష్టానంపై గట్టిగా ఒత్తిడి పెంచారు. చివరి దశకు వరకు ఆయన ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మాగుంట స్థానంలో చెవిరెడ్డిని వ్యూహాత్మకంగా ఆధిష్టానం నిలిపింది.
హిందూపురంలోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జలరాశి శాంతకు స్థానికంగా అంత రాజకీయ సంబంధాలు లేవు. కర్నాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన ఆమెను వైసీపీ ఎన్నికల బరిలోకి దించించి. పార్టీలో చేరిన రోజునే హిందూపురం లోక్‌సభ టిక్కెట్‌ను ఖరారు చేసింది. నరసరావుపేట లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పోటీలోకి దించారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యెగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ గెలుపొందారు. 2019లో ఆయన సీఎం జగన్‌ కేబినెట్‌లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సీఎంకు నమ్మినబంటుగా పేరొందారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు టౌన్‌ నుంచి మళ్లీ ఆయన పోటీకి సిద్ధపడగా, అక్కడ వైసీపీలోని వర్గవిభేదాలు, రాజకీయ సమీకరణలు అనిల్‌కుమార్‌కు అనుకూలంగా లేవు. దీనికితోడు నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో అక్కడి సిట్టింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు వెళ్లాలని వైసీపీ సూచించగా, అందుకు ఆయన నిరాకరించారు. ఈలోగా నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్‌కుమార్‌ పేరు ఖరారు చేశారు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామాచేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ వలస నేతలంతా ఎన్నికల్లో తమ రాజకీయ భవితవ్యాన్ని పరిశీలించుకోనున్నారు.
విశాలాంధ్ర బ్యూరో
అమరావతి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img