Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఏపీలో భానుడి భగభగలు

నేడు, రేపు ఇదే పరిస్థితి
విజయవాడలో ఈ వారం మొత్తం ఠారెత్తించనున్న ఎండలు

జూన్‌ నెలలోకి అడుగుపెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నప్పటికీ.. ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. కోస్తాంధ్రలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైనే నమోదవుతుండగా.. రాత్రి 10 గంటలు దాటినప్పటికీ.. వేడి తగ్గడం లేదు. కోసాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధిక వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోస్తా జిల్లాల్లో నేడు, రేపు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నేడు ఏపీలోని 141 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
బుధవారం సాయంత్రం విశాఖ నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు చోట్ల చెట్లు నేల కూలాయి. విశాఖ నగరంలోని గాజువాక-పెద గంట్యాడ, స్టీల్‌ ప్లాంట్‌ ఏరియాల్లో హుదూద్‌ తుఫాన్‌ తరహా గాలులతో వడగండ్ల వర్షం కురిసిందని ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌ మ్యాన్‌ తెలిపారు. ఈ వారం మొత్తం విజయవాడ నగరంలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ వెదర్‌ మ్యాన్‌ హెచ్చరించారు. పశ్చిమ గాలుల ప్రభావంతో జూన్‌ 4, 5 తేదీల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్లలో ఇది బలమైన వడగాల్పులకు దారితీసే అవకాశం ఉందన్నారు. బుధవారం నరసరావు పేటలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రేపల్లెలో 45.5 డిగ్రీలు, రెంటచింతలలో 45.4 డిగ్రీలు, విజయవాడలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ వెదర్‌ మ్యాన్‌ తెలిపారు. రాష్ట్రంలో వడగాలులు తీవ్రం అవుతున్నాయని.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. విశాఖ నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ.. గాల్లోని తేమ కారణంగా 49-50 డిగ్రీల ఉష్ణోగ్రత తరహాలో ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ వెదర్‌ మ్యాన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img