ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవంలో రవీంద్రనాథ్, ఓబులేసు
గురుదాస్ దాస్‌గుప్తాకు ఘన నివాళి
ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆవిర్భావం నుంచి ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించి… కార్మికుల హక్కుల సాధనకు కార్మిక చట్టాల రూపకల్పనకు బాటలు వేసినందని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, జి.ఓబులేసు స్పష్టం చేశారు.
విశాలాంధ్ర – విజయవాడ/గుంటూరు: ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆవిర్భావం నుంచి ఎన్నో వీరోచిత పోరాటాలు నిర్వహించి… కార్మికుల హక్కుల సాధనకు కార్మిక చట్టాల రూపకల్పనకు బాటలు వేసినందని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, జి.ఓబులేసు స్పష్టం చేశారు. కార్మిక నాయకులు కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బలమైన కార్మిక ఉద్యమాలకు రూపకల్పన చేసిన గురుదాస్ దాస్ గుప్తాకు ఘనంగా నివాళులర్పించారు. ఏఐటీయూసీ విజయవాడ నగర కమిటీ అధ్వర్యంలో 105వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక హనుమాన్ పేటలోని దాసరి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదట పుట్టిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అని తెలిపారు. 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో లాలా లజపతి రాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ పురుడు పోసుకుందని గుర్తుచేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా పిలుపునిచ్చిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. విశ్వకర్మ పేరుతో కార్మిక వర్గాన్ని మతం మత్తులోకి దించాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీకి వంతపాడుతోందని, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు నష్టం కలిగించే చర్యలను ఖండిరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టు రమణారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రకాశ్, ఏపీ ఆర్టీసీ పోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.రాంబాబు, ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్షుడు కేఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికవర్గ అభ్యున్నతి కోసం జరిగే ఐక్య ఉద్యమాలే గురుదాస్ దాస్‌గుప్తాకు ఇచ్చే ఘన నివాళి అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం, ఏఐటీయూసీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్ గుప్తా 5వ వర్థంతి గుంటూరు మల్లయ్యలింగం భవన్‌లోని వీఎస్కే హాలులో నిర్వహించారు. గురుదాస్ దాస్ గుప్తా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఓబులేసు మాట్లాడుతూ కార్మికవర్గ సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత గురుదాస్ దాస్గుప్తాదని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పేరుతో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించిన ధీరుడు ఆయన అని కొనియాడారు. దాస్ గుప్తా స్ఫూర్తితో కార్మిక సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశ కార్మికవర్గ అభ్యున్నతి కోసం పార్లమెంటు లోపల, బయట పోరాడిన కార్మిక పక్షపాతి గురుదాస్ దాస్ గుప్తా అని, పార్లమెంటు సభ్యుడైనా అత్యంత సాదా సీదా జీవితం గడిపిన బెంగాల్ బెబ్బులి గురుదాస్ దాస్ గుప్తా అని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు, ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ జీ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ గొల్లపూడిలోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం జోస్యభట్ల సత్యనారాయణ భవన్ వద్ద ఏఐటీయూసీ జెండాను రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొంబాయిలో పుట్టిన ఏఐటీయూసీ దేశంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.