Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఆమ్‌ ఆద్మీ పార్టీ చూపిన ఆదర్శం

పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ నాయకత్వంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలలోగానే అవినీతికి పాల్పడ్డందుకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌ సింగ్లాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం రెండు అంశాలను స్పష్టం చేస్తోంది. మొదటిది రాజకీయా ధికారం అవినీతి పర్యాయ పదాలుగా మారిపోయాయి. రెండవది రాజకీయ రంగం అతి తక్కువ మినహాయింపులతో అవినీతిలో కూరుకు పోయిన తరుణంలో అవినీతి ఆరోపణల కారణంగా ఒక మంత్రిని బర్తరఫ్‌ చేసే సాహసం ప్రదర్శించడం. రాజకీయాల్లో అవినీతిపరులు లేరంటేనే ఆశ్చర్య పడవలసిన దశలో ఉన్నాం కనక భగవంత్‌ మాన్‌ తీసుకున్న నిర్ణయం సాహాసోపేతమైందనే అనాలి. సింగ్లా అవినీతికి పాల్పడ్డట్టు కచ్చితమైన ఆధారాలు దొరికాయంటున్నారు. టెండర్ల మీద ఆయన ఒక శాతం కమిషన్‌ అడిగారంటున్నారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రావడం సహజం. కానీ వారి మీద చర్య తీసుకోవడానికి సాహసించడం అపురూపమే. అదీగాక అవినీతి నిరోధక శాఖ సదరు మంత్రి సింగ్లాను అరెస్టు చేయడం నిజంగానే ఆశ్చర్యకరం. ఫలానా రాజకీయ నాయకుడిపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నా చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా అరుదు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసి అరెస్టు చేయడం అంతకన్నా అరుదు. కానీ పంజాబ్‌లో బర్తరఫ్‌, అరెస్టు జరగడం విచిత్రమే. నిజానికి ఇలాంటి చర్య సహజంగా జరిగిపోవాలి. అలా జరగకపోవడంవల్లే సింగ్లా మీద చర్య తీసుకోవడం చర్చనీయమైంది. సింగ్లా మీద అవినీతి ఆరోపణలు వచ్చిన పది రోజులకే చర్య తీసుకోవడం ఆమ్‌ ఆద్మీ పార్టీ భిన్నమైంది అన్న పేరు నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగమనుకోవాలి. మంత్రివర్గ సహచరుడి మీద ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణల కారణంగా చర్య తీసుకోవడం దేశ చరిత్రలోనే ఇది రెండవ సారి. అంతకు ముందు 2015లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలాగే తన మంత్రివర్గ సహచరుడిని తొలగించారు. అవినీతిపరులు, నేరచరిత్రగల వారు తమ మీద కేసులు, దర్యాప్తులు తప్పించుకోవడానికే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న దశలో ఇలాంటి చర్య ఊహాతీతమైందే. సింగ్లా మీద ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన టెలిఫోన్‌ సంభాషణలు, ఆయనకు వత్తాసు పలికిన అధికారుల నడవడికపై దర్యాప్తు చేసి ఈ చర్య తీసుకున్నారు. సింగ్లా తాను చేసిన తప్పు ఒప్పుకున్నారని కూడా అంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో తప్పు ఒప్పుకోవడం కచ్చితంగా శిక్ష పడడానికి దారి తీస్తుందని చెప్పలేం. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి తొలగించినందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్ర నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి మాన్‌ ను అభినందించడమే కాకుండా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అవినీతిని ఎంత మాత్రం సహించదని ఆచరణలో నిరూపించినందుకు ఆనంద బాష్పాలు కూడా రాల్చారట. కుత్తుక తెగిపోయినా ద్రోహాన్ని సహించేది లేదని కేజ్రీవాల్‌ అన్నారు. నిజానికి అరవింద్‌ కేజ్రీవాల్‌ 2010-11 ప్రాంతంలో అన్నా హజారే నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంలోనే ప్రసిద్ధుడయ్యారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో అనేక మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు కానీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏకంగా రాజకీయ పార్టీ నెలకొల్పారు. ఆ తరవాత వరసగా దిల్లీ శాసనసభ ఎన్నికలలో గెలిచి స్వచ్ఛమైన రాజకీయాలకు ఇప్పటికీ జనాదరణ ఉందని నిరూపించారు. అంతమాత్రం చేత ఆమ్‌ ఆద్మీ పార్టీ సంపూర్ణంగా నిష్కల్మషమైందని చెప్పలేం. కాని ఒక ప్రయత్నం కనిపిస్తోంది. దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం చాలా అననుకూల పరిస్థితుల్లో పని చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో అనేక చోట్ల విజయ ఢంకా మోగిస్తున్నా రాష్ట్రం కాని రాష్ట్రమైన దిల్లీలో మాత్రం అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీని ఓడిరచలేకపోతోంది. ఇది ఒక రకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ విశిష్టతే.
అవినీతిని ఇసుమంత కూడా సహించబోమని పంజాబ్‌ ముఖ్యమంత్రి బల్వంత్‌ మాన్‌ అంటున్నారు. తాము ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌ నాయకత్వంలో పని చేసే సైనికులం అని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే అధికారంలోకి రాక ముందు సింగ్లా కూడా అవినీతిని ససేమిరా సహించబోమని ప్రకటించిన వారే. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తరవాతే ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం, అవమానకరంగా మంత్రిపదవి నుంచి బర్తరఫ్‌ కావడం ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే అక్రమ సంపాదనకోసమేనన్న అనుమానం కలగడం సహజం. రాజకీయ నాయకులు ఎక్కువ సందర్భాలలో తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ అవినీతిని గంప కింద కమ్మేస్తుంటారు. తాము ఏ పాపమూ ఎరగము అని చెప్పడానికి నానా అడ్డదార్లు తొక్కుతారు. అవినీతిపరులు రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న రాజకీయ నాయకులు అవినీతికి దూరంగా ఉండడం అరుదాతి అరుదైన వ్యవహారం. ఒక వేళ ఆరోపణలు వెల్లువెత్తినా తమ చేతిలో ఉన్న అధికారాన్ని డాలులా వాడుకుని శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నారు. తమది భిన్నమైన పార్టీ అని దశాబ్దాల తరబడి ప్రచారం చేసుకున్న భారతీయ జనాతా పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరవాత అవినీతికి పాల్పడడంలో అవినీతిపరులుగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌ నాయకులను మించిన అవినీతి పరులుగా నిరూపించుకున్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా పని చేసిన యెడ్యూరప్పే బీజేపీ ఎంతమాత్రం భిన్నమైన పార్టీ కాదని తేల్చి పారేశారు. అయినా ఆయన కర్నాటకలో బలమైన రాజకీయ నాయకుడు. ఆయనను కాదని బీజేపీ అక్కడ సాధించగలిగిందేమీ లేదు కనక ఆయన మీద ఈగైనా వాలలేదు. అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల బంధువులు ఎంతటి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారో అమిత్‌ షా కుమారుడు జే షా మీద పడ్డ మచ్చే నిరూపిస్తోంది. కానీ, తమది ‘‘భిన్నమైన’’ పార్టీ అని టముకు వేసుకు బతికేస్తున్న బీజేపీ కనీసం జే షా వ్యవహారంలో ఆరోపణలపై దర్యాప్తు కూడా చేయించలేదు. అవినీతికి దూరంగా ఉన్న నాయకులు అసలే లేరని కాదు. పదవిలోకి రాక ముందు, వచ్చిన తరవాత ఆస్తిపాస్తుల్లో అనూహ్యమైన మార్పు కనిపించని నాయకులు ఇప్పుడూ కొంతమందైనా ఉన్నారు. అయితే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాజకీయాల్లోకి ప్రవేశించడమంటేనే అక్రమార్జనకు మార్గం కనిపెట్టడం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. అందుకే జనం కూడా రాజకీయ నాయకుల అవినీతిని సర్వసాధారణమైన అంశంగా పరిగణిస్తున్నారు. తాము చేయగలిగింది ఏమీ లేదన్న నిస్పృహలో కూరుకుపోతున్నారు. కాని నిజానికి ఇది నిష్క్రియాపరత్వం. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక మంత్రిని బర్తరఫ్‌ చేసినందువల్ల ఆ పార్టీ ప్రభుత్వాలు ఎల్ల కాలం కడిగిన ముత్యంలా ఉంటాయన్న భ్రమ కూడా అనవసరం. కానీ అవినీతితో సర్వం అంథకారమయమై పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతిపరులైన రాజకీయ నాయకుల మీద కొరడా రaళిపించడాన్ని అభినందించవలసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img