Monday, April 22, 2024
Monday, April 22, 2024

కదలిన న్యాయ రథం

దాదాపు రెండేళ్ల పాటు కేవలం అభియోగాల ఆధారంగా జైలులో గడిపిన పత్రికా రచయిత సిద్దీఖ్‌ కప్పన్‌ను గురువారం బెయిలు మీద విడుదల చేసి సుప్రీంకోర్టు కొంతవరకైనా అన్నమాట నిలబెట్టుకుంది. హాత్రస్‌లో జరిగిన అత్యాచారం, హత్య సంఘ టనపై సమాచారం సేకరించడానికి వెళ్తున్న కప్పన్‌ను అరెస్టు చేసి జైలులో తోసేశారు. ఎన్నిసార్లు బెయిలు కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దళిత మహిళపై అగ్ర కులానికి చెందిన ఠాకూర్లు అత్యాచారం చేశారు. ఈ సమాచారం సేకరించడానికే కప్పన్‌ ప్రయత్నిస్తుండగా కటకటకటాల్లోకి వెళ్లవలసి వచ్చింది. ‘‘ప్రతి వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్‌, న్యాయమూర్తి ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. హాత్రస్‌ సంఘటనకు మసి పూయడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులు చేసిన ప్రయత్నంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అయింది. పంథొమ్మిదేళ్ల మహిళపై హాత్రస్‌లో అత్యాచారం జరిగిన తరవాత కొన్నాళ్లకు ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అంత్యక్రియలు కానిచ్చేశారు. మొదట కప్పన్‌ మీద శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఆ తరవాత బెయిలు రావడం కూడా కష్టమయ్యే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కింద కేసు నమోదు చేశారు. అంతే రమారమి రెండేళ్లుగా బెయిలుకు అవకాశం లేకుండా కప్పన్‌ జైలులోనే మగ్గిపోవలసి వచ్చింది. ఆయనకు పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కప్పన్‌ బెయిలు అంశం సుప్రీంకోర్టులో శుక్రవారం చర్చకు వచ్చినప్పుడు హింసాత్మక చర్యలు రెచ్చగొట్టడానికి కప్పన్‌కు డబ్బులు ముడ్తాయని పోలీసులు వాదించారు. ఆయన ప్రభుత్వ గుర్తింపు (అక్రెడిటేషన్‌) ఉన్న పత్రికా రచయిత కాదన్న సాకూ యు.పి. పోలీసులు చూపించారు. అక్రెడిటేషన్‌ లేకపోతే సమాచారం సేకరించకూడదన్న నియమం ఎక్కడుందో యు.పి. పోలీసులకే తెలియాలి. కప్పన్‌ మతకలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని, పేలుడు పదార్థాలు వినియోగించాలనుకున్నాడని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది మహేశ్‌ జెత్మాలానీ అన్నారు. ఆయన దగ్గర అభ్యంతరకరమైన, నేరారోపణ చేయగల సాహిత్యం దొరికిందని మహేశ్‌ జెత్మలానీ వాదిం చారు. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచి ఆయన దగ్గర ఏం దొరికింది? ఆయన కారులో పేలుడు పదార్థాలేవీ దొరకలేదుగా? దొరికిందంటున్న సాహిత్యాన్ని వినియోగించి ఆయన ప్రచారం చేసిన దాఖ లాలు లేవుగా? అది ప్రమాదకరం అన్న రుజువు ఏమిటి?’’ అని నిల దీసింది. ఇటీవలే కప్పన్‌ తొమ్మిదేళ్ల కూతురు ‘‘స్వేచ్ఛ, సాధారణ పౌరుల హక్కులు’’ అన్న అంశం మీద పాఠశాలలో మాట్లాడిన వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకైనా మంచిదనుకున్నారేమో పోలీసులు కప్పన్‌ మీద డబ్బు అక్రమ చెలామణి కేసు కూడా మోపారు. నాలుగు కేసులు మోపితే ఒకటన్నా నిలవదా అన్న ఆశ కాబోలు. కప్పన్‌కు హాత్రస్‌లో పనే లేదని ప్రభుత్వంతో పాటు న్యాయవాదులూ వితండ వాదానికి దిగడం హక్కులను కాల రాస్తున్న తీరుకు నిదర్శనం. అలహాబాద్‌ హైకోర్టు దాకా అనేక కోర్టులు కప్పన్‌కు బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించాయి. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఖైదీల గురించి ఇచ్చిన మాట నిలబెటు ్టకోవడానికా అన్నట్టు శుక్రవారం కప్పన్‌కు బెయిలు మంజూరు చేయడం విశేషం. యు.ఎ.పి.ఎ. కింద అరెస్టయిన వారికి బెయిలు మంజూరు కావ డం దుర్లభం అయ్యే రీతిలో ఆ చట్టాన్ని బిగించి పెట్టారు. కానీ భావ ప్రక టనా స్వేచ్ఛను గౌరవించే మేజిస్ట్రేట్లు, హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయ మూర్తులు కొన్ని సందర్భాలలోనైనా సాహసించి బెయిలు మంజూరు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచి కప్పన్‌కు బెయిలు మంజూరు చేయడం మంచిదా కాదా అన్న అంశం జోలికి పోలేదు. బెయిల్‌ నిరాకరించడం అనవసరమని భావించింది. కప్పన్‌కు బెయిలు నిరాకరించ డానికి ప్రభుత్వ పక్షం చేస్తున్న వాదనలు, చూపిన సాక్ష్యాలు సమంజసంగా లేవని న్యాయమూర్తులు భావించారు. ఆయన దగ్గర దొరికిన సాహిత్యం రెచ్చగొట్టేదిగా ఉందని నిరూపించలేనంత కాలం కప్పన్‌ను జైలులోనే ఉంచే యడానికి కారణమే లేదని న్యాయమూర్తులు భావించారు. జైళ్లలో విచారణ లేని ఖైదీలుగా నెలలు, సంవత్సరాల తరబడి మగ్గిపోవడం మన న్యాయ నిర్ణయ వ్యవస్థకే సిగ్గు చేటు. అనేక మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన వారే. నేరాలను నమోదు చేసే జాతీయ సంస్థ సమాచారం ప్రకారం ప్రతి అయిదుగురు ఖైదీల్లో ఒకరు విచారణలో ఉన్న ఖైదీనే. అంటే వారి మీద ఆరోపణలు రుజువు కాకపోయినా ప్రాసి క్యూషన్‌ తీరుల్లో, బెయిలు హక్కు అన్న విషయాన్ని మేజిస్ట్రేట్లు, న్యాయ మూర్తులు శ్రద్ధగా పట్టించుకోకపోవడంవల్ల జైలులో మగ్గిపోవలసిన వారి సంఖ్య పెరుగుతోంది. జైళ్లలో ఉన్న వారిలో 76 శాతం మంది విచారణలో ఉన్న వారే. ఇలా వారి తప్పు ఏమీ లేకుండానే జైలులో ఉండవలసి రావడం అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్టే. మొన్నటి దాకా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్‌.వి.రమణ ఈ అంశంపై కలత చెందారు. విచ్చల విడి అరెస్టులు, బెయిలు దొరకకపోవడం అన్యాయం అని ఆయన అన్నారు. న్యాయ సంస్కరణల్లో ఇది అత్యంత ప్రధానమైందని గుర్తు చేశారు. విచిత్రం ఏమిటంటే కిరాతక చట్టాలను అమలు చేసి ఆనందించే బీజేపీ సర్కారు అధినేత నరేంద్ర మోదీ కూడా విచారణలో ఉన్న ఖైదీల దురవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి బెయిలు వచ్చే మార్గం ఆలోచించాలని న్యాయ సహాయ సంస్థను కోరారు. దిక్కు మొక్కు లేకుండా విచారణలో ఉన్న ఖైదీలుగా జైలు గోడలకే పరిమితం కావడం మొత్తం మన రాజ్యవ్యవస్థ ఉమ్మడి వైఫల్యం. ఈ ఖైదీల్లో చాలా మంది నిరాధారమైన కేసుల్లో ఇరుక్కున్న వారే. వారు విడుదల కాకపోవడానికి నేరం చేయడం కారణం కాదు. వ్యవస్థ వైఫల్యంవల్లే వారు అనవసరంగా శిక్ష అనుభవించవలసి వస్తోంది. చాలా మంది ఏ పనీ చేయడానికి వీలు లేకుండా వయసుడిగిన దశలో విడుదలవుతూ ఉంటారు. అంటే వారి జీవితం నిష్కారణంగా వృథా అయినట్టే. వ్యవస్థలో ఉన్న లోపాలకు పౌరులు బలై పోవడం వైపరీత్యమే. సుప్రీంకోర్టు అన్నమాట ప్రకారం విచారణలో ఉన్న ఖైదీలకు విముక్తి కల్పించడానికి నడుం కట్టిందని కప్పన్‌ విడుదల రుజువు చేస్తోంది. మన జైళ్లల్లో ఉన్న మొత్తం 4 కోట్ల 88 లక్షల 511 మందిలో 3,71,848 మంది విచారణలో ఉన్న ఖైదీలే. వీరిలో 20 శాతం మంది ముస్లింలు, 73 శాతం మంది దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల వారే. వీరిలో 27 శాతం మంది నిరక్షరాస్యులు. వారికి నిష్కృతి ఉండాలిగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img