Friday, June 9, 2023
Friday, June 9, 2023

కేజ్రీవాల్‌కు జరిమానా!?

ప్రజాతంత్ర వ్యవస్థలో కూడా ప్రశ్నించే అధికారం లేదని, అలా ప్రశ్నించిన వారికి కోర్టు శిక్ష విధిస్తుందని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హత ఏమిటి అని ప్రశ్నించినందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు 25,000 రూపాయల జరిమానా కూడా విధించింది. ప్రధానమంత్రి విద్యార్హత గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని కూడా తేల్చేసింది. చదువుకోవడం, లేదా చదువుకోక పోవడం దోషమూ కాదు. నేరమూ కాదు. పైగా మన దేశంలో రాజకీయ నాయకులకు విద్యార్హత ఉండి తీరాలన్న నియమం ఏమీ లేదు. రాజకీయాలు విద్యకు సంబంధించిన అంశం కాదు. దేశాన్ని నడిపించే వారు అక్షరాస్యులు అయి ఉండడం ఈ రోజుల్లో అవసరం. ప్రధానమంత్రి నిరక్షరాస్యుడని ఎవరూ అనడంలేదు. కానీ ఆయన రాజనీతిశాస్త్రంలో ఎమ్మే పూర్తి చేశారని చెప్పడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. లేకపోతే సర్వాధికారాలు చెలాయించేస్థానంలో ఉన్న మోదీ మురికి కాలవనుంచి వెలువడే గ్యాస్‌తో చాయ్‌ తయారు చేయడానికి ఉపకరిస్తుందని అంటే నమ్మేయాలా!. మురికి కాలవలనుంచి వెలువడే గ్యాస్‌ను ఇంధనం కింద మార్చడం సాధ్యమని మోదీ చెప్పారు. అలాగే మేఘాల చాటున యుద్ధ విమానాలుఉంటే వాటిని రాడార్లు కనిపెట్టలేవు కనక మేఘాలమాటున శత్రువుల మీద దాడి చేయవచ్చునని కూడా ఆయన అన్నారు. ఇది మురికి కాలవల గురించి చెప్పిన మాటలకన్నా ఘోరమైంది. ఆయన కెనడావెళ్లి ఎ ప్లస్‌ బి హోల్‌ స్క్వైర్‌ అన్న బీజగణిత సూత్రాన్ని వివరించే ప్రయత్నంలో ఏం చెప్తున్నారో అర్థంకాని పరిస్థితి ఎదురైంది. శీతోష్ణస్థితిలో మార్పులు అనేవి ఏమీలేవని మరో సందర్భంలో అన్నారు. ప్రపంచమంతా శీతోష్ణస్థితిలో మార్పులను ఎదుర్కోవడానికి సతమతమవుతోంది. ఇంకో సందర్భంలో ఆయనే నేను పెద్దగా చదువుకోలేదు. మా ఊళ్లో ఉన్న బడికి మాత్రమే వెళ్లాను అన్నారు. అలాంటప్పుడు ఈ ఎమ్మే డిగ్రీ ఎక్కడి నుంచి వచ్చిందో! అక్షరాస్యత అంటే కేవలం అక్షరాలు రావడం కాదు. ఆ చదువువల్ల లోకజ్ఞానం పెరగాలి. కానీ మోదీ ఇలాంటి ప్రకటనలు చేయడం అయితే ఆయనకు లోకజ్ఞానం లేకపోయి అయినా అయిఉండాలి. లేదా అనునిత్యం ఆయనచేసే బూటకపు వాగ్దానాల్లాంటిదైనా అయి ఉండాలి. ఏమైనా మోదీ చెప్పినమాట పూర్తిగా అశాస్త్రీయమైంది. గత కొద్ది సంవత్సరాల కాలంలో అరవైవేల పాఠశాలలు మూసేయడం ప్రధానికి చదువు లేకపోవడమే కారణం అనుకోవాల్సి వస్తుంది. గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వు ప్రధానమంత్రి విద్యార్హత గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేయకపోగా వాటిని మరింత పెంచింది. ప్రధానమంత్రి ఎమ్మే చదివారని 2016లో అరుణ్‌ జైట్లీ, అమిత్‌ షా ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి మోదీ డిగ్రీ ఇది అని చూపించారు. కానీ గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఆయన డిగ్రీ గురించి ఎన్నిసార్లు అడిగినా మౌనముద్ర వీడడం లేదు. మోదీ డిగ్రీ చూపించకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు. నా డిగ్రీల గురించి అడిగే హక్కు ఎవరికిఉంది అన్న అహంకారమో లేదా ఆ డిగ్రీ నకిలీది అయి ఉండడమో కావొచ్చు. ఆయన గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి కనక ఎమ్మే డిగ్రీ పుచ్చుకుని ఉన్నట్టయితే ఆ విషయం ఆ విశ్వవిద్యాలయానికి గర్వ కారణమే కదా! మా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని గర్వించవచ్చుగా! మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ చదువుకున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆయన పేర ఒక పీఠమే ఉంది. మోదీ విద్యార్హతల వ్యవహారం కేంద్ర సమాచారశాఖ దాకా వెళ్లింది. అప్పుడు కేంద్ర సమాచార కమిషనర్‌గా ఉన్న మాడభూషి శ్రీధర్‌ ప్రధాని డిగ్రీని బయట పెట్టాలని గుజరాత్‌, దిల్లీ విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. ఇప్పుడు గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఈ ఆదేశాన్నే కొట్టేసింది.
మోదీ డిగ్రీ ఏమైనా రహస్య పత్రమా? అందులో దేశ భద్రతకు సంబంధించిన అంశం ఏమైనా ఉందా? కేజ్రీవాల్‌ ప్రశ్నించడంపై కేసు గుజరాత్‌లోనే నమోదు కావడంలో మతలబు ఏమైనా ఉందా? ఎవరైనా ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్‌కు అందజేసే అఫిడవిట్‌లో తమ విద్యార్హతలను కూడా ప్రస్తావించవలసి ఉంటుంది. మోదీ పోటీ చేసేటప్పుడు తన విద్యార్హత గురించి ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలకు గతంలోనూ, ఇప్పుడూ బయటపడ్తున్న సమాచారానికి తేడా ఉందనుకోవాలా? గుజరాత్‌ హైకోర్టు వెలువరించిన 79 పేజీల తీర్పులో అనేక వైరుధ్యాలున్నాయి. మోదీ డిగ్రీ సామాజిక మాధ్యమాలలో ఉంది అని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంటున్నారు. మరి ఆ డిగ్రీ బయటపెట్టడానికి అభ్యంతరమేమిటో!. పైగా గుజరాత్‌ హైకోర్టు ప్రధాని డిగ్రీ గురించి ప్రశ్నించకూడదని ఆదేశించడం, కేజ్రీవాల్‌కు జరిమానా విధించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తి డిగ్రీకి ప్రాధాన్యం ఉందని గుజరాత్‌ హైకోర్టు భావించనే లేదు. మోదీ బియ్యే డిగ్రీ గురించిన వ్యవహారం దిల్లి కోర్టులో ఇంకా విచారణలోనే ఉంది. ఎన్నికల కమిషన్‌ ఎదుట దాఖలుచేసే అఫిడవిట్‌లో ఇచ్చే సమాచారం తప్పయితే శిక్షకూడా పడొచ్చు. ఆ సమాచారం విద్యార్హతకు సంబంధించింది కూడా కావచ్చు. అందుకే గుజరాత్‌ హైకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వీలులేదని ఆంక్ష విధించిందా? ఈ కేసులో వాదించిన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రధానమంత్రి విద్యార్హతతో సంబంధం ఏమిటి, దీనివల్ల ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పేమీ లేదనీ ప్రజాహితానికి సంబంధించిన అంశం కాదనీ అన్నారు. ప్రజాజీవనంలో ఉన్న వ్యక్తి గురించి సరైన సమాచారం తెలియడం ప్రజాహిత వ్యవహరమే అవుతుంది.
మోదీ డిగ్రీ గురించి అంత గోప్యత ఎందుకు అన్న అనుమానం సామాన్యమానవుల మదిలోకూడా మెదులుతుంది. కేజ్రీవాల్‌కు జరిమానా విధించడంద్వారా ఈ విషయాన్ని భవిష్యత్తులో ఎవరూ లేవనెత్తకూడదన్న సంకేతం కూడా ఉండొచ్చు. నిజానికి ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌ కక్షిదారు కాదు. ఆయన కేంద్ర సమాచార కమిషన్‌ ఎదుట మోదీ విద్యార్హతల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ కమిషన్‌ గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని, దిల్లీ విశ్వవిద్యాలయాన్ని మోదీ డిగ్రీల గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి నిజాయితీని ప్రశ్నించడానికి అవకాశం లేకపోవచ్చు. ఆయన చెప్పిన తీర్పుకు దురుద్దేశాలు అంటగట్ట కూడదు. కానీ తీర్పు మంచి చెడ్డలను చర్చించే అధికారం ఎవరికైనా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని అడుగంటించే ప్రభుత్వ విధానాలను సమర్థించడానికే ఈ తీర్పు ఉపయోగపడుతుంది. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి మూలం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img