Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తన గొయ్యి తానే తవ్వుకుంటున్న బీజేపీ

పెట్టుబడిదారీ విధానం తన వినాశనం తానే కొని తెచ్చు కుంటుంది అన్న కార్ల్‌ మార్క్స్‌ మాట చాలా దూర దృష్టితో చెప్పిందే అయి ఉంటుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మార్క్స్‌ చెప్పిన మాటను సంపూర్ణంగా రుజువు చేస్తోంది. పెగాసస్‌ విషయంలో నిజానిజాలు తేల్చడానికి మోదీ సర్కారు నిరాకరించి తన మెడకు తానే ఉచ్చు బిగించుకుంటోంది. ఇజ్రాయిల్‌లోని ఎన్‌.ఎస్‌.ఒ. సంస్థ అధీనంలో పెగాసస్‌ అనే రహస్య సమాచార సేకరణ సాఫ్ట్‌వేర్‌ తయారుచేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను అనేక దేశాలకు విక్రయించింది. అందులో భారత్‌ కూడా ఉంది. ఈ పరిజ్ఞానం అసలు ఉద్దేశం నేరస్థుల, తీవ్రవాదుల కార్యకలాపాలను పసిగట్టడానికి వినియోగించడం. కానీ మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పత్రికా రచయితలు, కడకు తమ పార్టీకే చెందిన కొందరు నాయకులకు వ్యతిరేకంగానే కాక ఇతరుల ఆరా లాగడానికీ వినియోగించింది. ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత గట్టిగా నిరాకరిస్తున్నప్పటికీ వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మోదీ ప్రభుత్వమే బోనులో నిలబడవలసి వస్తోంది. మోదీ సర్కారు రెండు అంశాల మీద ఆధారపడి ఉంది. ఒకటి: బూటకపువాగ్దానాలు, రెండు వాస్తవాలు బయట పడ్డప్పుడు నిరాకరించడం. పెగాసస్‌ విషయంలో నిజానిజాల నిగ్గు తేలకపోతే మన ప్రజాస్వామ్య డొల్లతనమే బయటపడ్తుంది. విఫల ప్రజాస్వామ్యాల జాబితాలో చేరిపోతుంది. బయటపడ్తున్న సమాచారాన్నిబట్టి చూస్తే ఈ రహస్య సమాచార సేకరణ ఆయుధాన్ని ఎంతమంది మీద ఉపయోగించారో తలుచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం ఇంకా దాపరికం వీడకపోతే ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం కలుషిత మవుతుంది. మనదేశంలో వ్యాపారం చేయడం సులువు అని మోదీ వేస్తున్న దండోరా పచ్చిఅబద్ధమని రూఢ అవుతుంది. అనేకమంది మంత్రులు, బీజేపీ నాయకులు ఇది భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పన్నిన అంతర్జాతీయ కుట్ర అని కొట్టిపారేస్తున్నారు. సమగ్రమైన దర్యాప్తునకు అంగీకరించి ఈ కుట్రను బయటపెట్టొచ్చుగా!. ‘‘భారత ప్రభుత్వం పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞాన్ని తన పౌరులకు వ్యతిరేకంగా వినియోగించలేదు’’ అని చెప్పే ధైర్యం మోదీ సర్కారుకు లేకపోవడమే ప్రభుత్వ వాదన బూటకమని చెప్పడానికి అవకాశం కల్పిస్తోంది. టొరాంటో సిటిజన్‌ లాబ్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌లోని గార్డియన్‌ పత్రిక కూడా భారత్‌ పెగాసస్‌ రూపొందించిన ఎన్‌.ఎస్‌.ఒ. సంస్థ వినియోగదారే అంటున్నాయి. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగవలసిన సమయంలో కుట్రపూరితంగా ఈ అంశంపై దుమారం రేపుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వాదిస్తున్నారు. ఈఅంశం పార్లమెంటు కార్యకలాపాలకు భంగం కలగడానికి పరిమితం అయింది కాదు. ఇందులో పౌరుల స్వేచ్ఛ కూడా ఇమిడి ఉంది కనక అది చాలా విస్తృతమైంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలు. మన దేశంలోని ‘‘ది వైర్‌’’ లాంటి వెబ్‌ సైట్‌తో పాటు అంతర్జాతీయంగా 17 వ్యవస్థల దర్యాప్తులో తేలిన అంశాలు, రహస్య సమాచార సేకరణకి గురైన వారికి సంబంధించి విడుదలచేసిన వివరాలు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడ్తున్నాయి. పెగాసస్‌ను వినియోగించి గూఢచర్యం నెరపిన దేశాల జాబితా చూస్తే భారత్‌ ఎలాంటి దేశాల సరసన నిలుస్తోందో అర్థం అవుతుంది. అందులో నిరంకుశ ప్రభుత్వాలున్న దేశాలు, ప్రజాస్వామ్యం వాసన కూడా లేని అరబ్‌ రాజ్యాలు ఉండడం భారత్‌కు అపకీర్తి తెచ్చేదే. మానవ హక్కులను కాల రాయడానికీ ఈ రహస్య సమాచార సేకరణ విధానాన్ని ఉపయోగించడం దేశప్రతిష్ఠను మంటగలుపుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర పని చేసే సిబ్బంది, ఎన్నికల కమిషన్‌ ఉన్నతాధికారి, సీ.బి.ఐ. ఉన్నతాధికారుల మీద ఈ అస్త్రం ప్రయోగించారంటున్నారంటే మోదీ, అమిత్‌ షా ఎంత కర్కశంగా ప్రవర్తించగలరో అర్థం అవుతోంది. వీరి ఏలుబడిలో ప్రజాస్వామ్యం పట్టపగలు హననానికి గురవుతోంది.
కొత్తగా సమాచార సాంకేతిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్‌ ‘‘అనధికారికం’’గా భారత్‌లో పెగాసస్‌ను వినియోగించ లేదంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని ప్రభుత్వాలకు, సైనిక వ్యవస్థలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్‌.ఎస్‌.ఒ. చెప్తోంటే ఈ పరిజ్ఞానం ఎక్కడైనా, ఎవరికైనా, ఏ సమయంలోనైనా కడకు ప్రైవేటు సంస్థలకైనా దొరుకు తుందని అశ్విని వైష్ణవ్‌ అనడం అబద్ధాల పరంపరలో భాగం. ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్ల మీద నిఘా ఉందని వైష్ణవే అంగీకరిస్తున్నారు. ఈ నిఘాకు గురైన వారిలో ఆయనతో పాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులూ ఉన్నారు. అంటే మోదీ సర్కారు తన నీడను చూసి తానే భయపడే దుస్థితిలో ఉంది. అందుకే జాతీయభద్రత పేర బీజేపీప్రభుత్వం పౌరులస్వేచ్ఛను అణగ దొక్కుతోంది. ఈ విషయంలో న్యాయస్థానాలు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా మోదీ సర్కారుకు ఖాతరు లేదు. సకల ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయడంతో పాటు న్యాయవ్యవస్థనూ నిర్వీర్యం చేస్తోంది. వైష్ణవ్‌ కన్నా ముందు సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా రవి శంకర్‌ ప్రసాద్‌ ఉన్నప్పుడే ఈ ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ‘‘అనధికారికం’’గా ఎవరి సంభాషణలనూ వినలేదని ఆయన చెప్పారు. మరి వైష్ణవ్‌ దానికి పూర్తి విరుద్ధంగా పార్లమెంటు వేదిక మీంచే చెప్తున్నారంటే మోదీ సర్కారుకు పార్లమెంటు మీద ఉన్న లెక్కలేనితనం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. మరో 45 దేశాలు కూడా పెగాసస్‌సహాయంతో రహస్య సమాచారసేకరణ నెరపు తున్నాయని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారంటే అన్యాపదేశంగా మోదీ సర్కారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్టే. మోదీ నిరాకరణల మార్గం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడానికే కాదు తన మిత్రులనే శత్రువులను చేసుకునే స్థాయికి చేరింది. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌తో పాటు కలిసి బీజేపీ అధికారంలో ఉంది. అదే నితీశ్‌ కుమార్‌ పెగాసస్‌ వ్యవహారంలో లోతైన దర్యాప్తు చేయాలంటున్నారు. ఆయన నిష్కారణంగా ఈ మాట చెప్పరుగా!. మమతా బెనర్జీ ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌. బి. లోకూర్‌ నాయకత్వంలో విచారణ కమిటీని నియమించారు. లోకూర్‌కమిటీ వాస్తవం కనిపెట్టినా అది బెంగాల్‌కే పరిమితం అవుతుంది. పైగా ఇలాంటి కమిటీల నివేదికలు ఎవరినీ శిక్షించ డానికి ఉపకరించవు. పార్లమెంటులో మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతిలోంచి కాగితాలు లాక్కుని చించేసినందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శంతను సేన్‌ను వర్షాకాల సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌చేశారు. ఆ సందర్భంగా మరో మంత్రి హర్దీప్‌ పూరి నోటిదురుసుకు వ్యతిరేకంగా తృణ మూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఇందులో శివసేన, కాంగ్రెస్‌, సీ.పీ.ఐ. (ఎం) సభ్యులు కూడా హర్దీప్‌ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంటే బీజేపీ వైరి పక్షాలను ఏకం చేయడంతో పాటు తన మిత్రులనే దూరం చేసుకుంటోంది. తన గొయ్యి తానే తవ్వుకోవడం అంటే ఇదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img