Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

తిరగబడ్డ ఫిరాయింపు నాటకం

తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.) కి చెందిన నలుగురు శాసనసభ్యులకు దండిగా డబ్బు ముట్టచెప్పి తమ పార్టీలో చేర్పించడానికి బీజేపీ కుట్ర పన్నిందన్న ఆరోపణలో నిజానిజాలు వెంటనే తెలియక పోవచ్చు. ఆ నిజం నిష్పాక్షిక విచారణాధారం. తన ఎమ్మెల్యేలు గీత దాటి అమ్ముడుపోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అడ్డుకోగలిగారు. ఎన్నికలలో మెజారిటీలేని రాష్ట్రాలలోనూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ అద్వితీయమైన కౌశలం సంపాదించింది. ప్రజా ప్రతినిధులు అమ్మకం సరుకుగా మారిపోయి చాలాకాలం అయింది కనక బేరసారాలకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి కోట్లాది రూపాయలు ముట్టచెప్పి తమవేపు తిప్పుకోవడానికి కావలసిన ఆర్థిక స్తోమత బీజేపీకి ఉంది. ఎన్నికల బాండ్లు అమలులోకి వచ్చిన తరవాత ఆ ఖాతా కింద పోగుపడే మొత్తంలో 85శాతం బీజేపీకే దక్కుతోందన్నది వాస్తవం. చెలామణిలో ఉంటేనే డబ్బుకు విలువ. అందుకని తమ ఖజానాలో మూలుగుతున్న డబ్బును ప్రజా ప్రతినిధులను కొనడానికి వెచ్చిస్తోంది భారతీయ జనతా పార్టీ. టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారన్న ఆరోపణలను బీజేపీ కొట్టి పారేయడం సహజమే. పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు కుదుర్చుకోవడానికి పన్నిన పన్నాగం బయట పడిరది. రోహిత్‌ రెడ్డే ఈ కుట్రను భగ్నం చేశారంటున్నారు. ఆయన నిజాయితీకి జోహార్లు అర్పించాల్సిందే కదా! మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలనుకుందట. ఈ బేరం కుదిరిస్తే రోహిత్‌ రెడ్డికి వంద కోట్ల రూపాయలు, మిగతా ముగ్గ్గురు ఎమ్మెల్యేలకు యాభై కోట్ల చొప్పున ఇస్తామన్నారట. ధరలు మండిపోతున్న దశలో ఒక్కో ఎమ్మెల్యే ఆ మాత్రం ధర పలకడంలో ఆశ్చర్యం ఏముంది కనక! డబ్బిచ్చి ప్రజా ప్రతినిధులను బీజేపీ కొనడానికి ఓ ప్రత్యేక పదబంధం ప్రచారంలోకి వచ్చింది. అదే ఆపరేషన్‌ లోటస్‌. రోహిత్‌ రెడ్డి ఫిర్యాదు చేసిన తరవాత హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పూజారి సతీశ్‌ శర్మ అలియాస్‌ రాంచంద్ర భారతి, తిరుపతికి చెందిన గురువు డి. సిం హయ్యాజీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్‌ ను అరెస్టు చేశారు. బీజేపీలో చేరితే తమకు భారీ మొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టారని ఈ శాసనసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మాటవిని బీజేపీలో చేరకపోతే కేసులు మోపుతామని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈడీ) దాడులు జరుగుతాయని బెదిరించారని కూడా టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు తెలియజేశారు. టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వాన్ని పడగొడ్తామని కూడా చెప్పారట. టి.ఆర్‌.ఎస్‌. శాసనసభ్యులను కొనడానికి బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిరచింది. ఇదంతా కె.సి.ఆర్‌. నాటకమనీ ఈ నాటకానికి రచన, కథ, మాటలు, పాటలు అన్నీ కె.సి.ఆర్‌. అని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి తన సహజ శైలిలో విరుచుకుపడ్డారు. ఈ సంఘటన జరిగిందంటున్న ఫాం హౌజ్‌కు పోలీసులు రాకముందే మీడియా అక్కడ ప్రత్యక్షమైందని లోపల ఏం జరిగిందో వివరించిందనీ, వారిని ఫాంహౌజ్‌లోకి ఎందుకు అనుమతించారు? దీనితో బీజేపీకి సంబంధం ఏమిటి? టి.ఆర్‌.ఎస్‌. చెప్తున్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదు అని కిషన్‌రెడ్డి అంటున్నారు. ఇందులో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ఆయన చెప్పారు. 119 మంది సభ్యులున్న శాసనసభలో టి.ఆర్‌.ఎస్‌.కు 103 మంది మద్దతు ఉండగా ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తాము ఏం చేయగలుగుతామని కిషన్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కొంటే సరిపోదన్న మాట నిజమే. కానీ ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని ఎన్‌.సి.పి., కాంగ్రెస్‌, శివసేన కూటమి ప్రభుత్వాన్ని కూల్చడంలో బీజేపీ పాత్రను నిరాకరించలేం. తిరుగుబాటు చేసింది ఏక్‌నాథ్‌షిండే కావచ్చు. తెర వెనక నాటకం ఆడిరచి ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని దించి, షిండేను ముఖ్యమంత్రిని చేసి బీజేపీ ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన వైనాన్ని ఎలా కాదనగలం!
టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలను కొనడానికి తాజాగా జరిగిన ప్రయత్నాన్ని పక్కన పెట్టినా 18 మంది టి.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని గత ఆగస్టులో ఓ బీజేపీ నాయకుడు బహిరంగంగానే చెప్పారు. దిల్లీ, పంజాబ్‌ ప్రభుత్వాలను కూలదోయడానికి తమ ఎమ్మెల్యేలకు మదుపుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవలే ఆరోపించారు. నవంబర్‌ మూడున మునుగోడు శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో బీజేపీ టీ.ఆర్‌.ఎస్‌.తో తల పడ్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొనుగోళ్ల నాటకానికి తెరలేచి ఉండవచ్చు. టి.ఆర్‌.ఎస్‌.కు ప్రస్తుతానికి ఎదురు లేదు. కానీ 2023లో జరగవలసి ఉన్న ఎన్నికలలో తెలంగాణలో అధికారం సంపాదించాలని బీజేపీ ఆత్రుత చూపుతోంది. కొనుగోళ్ల కార్యక్రమం నిరాఘాటంగా సాగి ఉంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు అక్టోబర్‌ 31 న మునుగోడులో బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా పాల్గొనబోయే సభలో కాషాయ కండువాలు కప్పుకోవలసింది. తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందన్నది వాస్తవం. నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల తరచుగా ఏదో ఓ కారణంతో తెలంగాణకు వస్తూనే ఉన్నారు. బీజేపీ పన్నాగాలను భగ్నం చేయడంలో కె.సి.ఆర్‌. సామర్థ్యాన్ని, ఎత్తుగడలను, వ్యూహాలను తక్కువ అంచనా వేయలేం. ఆయన రాజకీయం ఈ మూడు అంశాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలుగు దేశం పార్టీని ఓటుకు నోటు కేసులో ఇరికించి అస్తిత్వమే లేకుండా చేసిన వ్యూహకర్త కె.సి.ఆర్‌.
ఇప్పుడు అదే రీతిలో బీజేపీ దిమ్మ తిరిగేట్టు చేశారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పారిన బీజేపీ పాచికలు తెలంగాణలో పారలేదు. అయితే టి.ఆర్‌.ఎస్‌. నేతలు పక్క చూపులు చూడలేదని ఖాయంగా చెప్పలేం. ఎందుకంటే గతంలో కొంతమంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. వారిలో కొందరిని కె.సి.ఆర్‌. మళ్లీ టి.ఆర్‌.ఎస్‌.లోకి తీసుకురావడంలో సఫలమై ఉండొచ్చు. బీజేపీ విసురుతున్న సవాలును ఎదుర్కోవడానికి ఎన్నికలు జరిగేదాకా వేచి ఉండాలని కె.సి.ఆర్‌. అనుకుంటున్నట్టు లేదు. అందుకే తమ ఎమ్మెల్యేలకు వలపన్నాలని బీజేపీ ప్రయత్నిస్తే అదే వలలో కె.సి.ఆర్‌. చాకచక్యంగా బీజేపీని ఇరికించేశారు. దిల్లీ మద్యం వ్యవహారంలో కె.సి.ఆర్‌. కుమార్తెను ఇరికించడానికి బీజేపీ ప్రయత్నించింది. ఆ కసి కూడా కె.సి.ఆర్‌. తీర్చేసుకున్నారు. బీజేపీని నైతికంగా దెబ్బ తీయడంలో కె.సి.ఆర్‌. సఫలమైనట్టే. కోట్ల రూపాయలతో పట్టుబడ్డ బీజేపీ దళారులు మాత్రం అడ్డంగా దొరికిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img