Friday, April 26, 2024
Friday, April 26, 2024

మతతత్వ బాటలో కేజ్రీవాల్‌

మన వైఫల్యాలను దేవుడిమీదకు తోసేస్తే ఓ పని అయి పోతుందని చాలా మంది అనుకుంటారు. వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి దేవుడిని, ఎన్నికలలో గెలవడానికి మతాన్ని విని యోగించుకోవడం పరిపాటి అయిపోయింది. మతత్వం ఆధారంగా బీజేపీ అధికారం సంపాదించింది కనక తానూ అదే బాటలో నడవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భావిస్తున్నారు. మతతత్వాన్ని వినియోగించుకోవడంలో తాను బీజేపీకన్నా రెండాకులు ఎక్కువ చదివానని రుజువు చేసుకోవాలన్న తహ తహ ఆయనలో బాగా కనిపిస్తోంది. అందుకే మన రూపాయి నోట్ల మీద వినాయకుడి, లక్ష్మీదేవీ చిత్రాలు కూడా ఉండాలని ఆయన అంటున్నారు. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడనీ, లక్ష్మీదేవి సంపత్తి సమకూరుస్తుందని ఆయన తన వ్యాఖ్యలకు భాష్యం కూడా చెప్తున్నారు. మన నోట్లమీద ఉన్న గాంధీ బొమ్మను అలాగే కొనసాగిస్తూ ఈ ఇద్దరు దేవుళ్ల బొమ్మలను కూడా ముద్రించాలని ఆయన సూచించారు. ఈ మాట ఒక్కసారి అని ఊరుకోకుండా అదే మాట ప్రధానమంత్రి మోదీకి రాసిన ఉత్తరంలో పునరుద్ఘాటించారు. కరెన్సీనోట్లు ముద్రించడంలో మోదీ ప్రమేయం ఎంత మాత్రం ఉండదనీ, రిజర్వు బ్యాంకు కొన్ని ప్రమాణాలను పాటిస్తూ నోట్లు ముద్రిస్తుందని ఆయనకు తెలియదనుకోలేం. పైగా ఆ చిత్రాలు ముద్రించడంవల్ల ఆ దేవుళ్ల ఆశీర్వాదంతో కునారిల్లి పోతున్న మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని మెట్ట వేదాంత ప్రవచనాలు కూడా చేస్తున్నారు. నోట్ల మీద దేవుళ్ల చిత్రాలు ఉండాలన్నది తన ఒక్కడి ఆలోచన కాదని ఇది 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని కేజ్రీవాల్‌ సమర్థించుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు దైవ భక్తి ఉంటే ఉండొచ్చు. మత విశ్వాసాలూ ఉండొచ్చు. కానీ ఈ రెండూ వ్యక్తిగతమైతే ఫరవాలేదు. కేజ్రీవాల్‌ చెప్తున్న 130 కోట్ల మందిలో వినాయకుడిని, లక్ష్మీదేవిని ఆరాధించని వారూ దేశవాసుల్లో ఉన్నారు. మరి వారి మతాలప్రకారం సకలమతాల దేవుళ్లనూ ఆదరిస్తారా? ఏకేశ్వరోపాసకులూ ఉంటారు గదా. దేవుడికి మానుష భావారోపణ చేయని మతాలను అనుసరించే వారి అభిప్రాయాలను ఏం చేయాలి అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. కేజ్రీవాల్‌ ఈ సూచన ఏ సందర్భంలో చేశారో గమనిస్తే ఆయన ఆంతర్యం ఏమిటో తెలుస్తుంది. దిల్లీలో, పంజాబ్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశమంతటికీ తన పార్టీని విస్తరింపచేయడానికి ఆయన వెంపర్లాడుతున్నారు. మతం మీద ఆధారపడడంవల్లే బీజేపీకి అధికారం దక్కింది కనక తానూ అదేదారిలో నడవాలనుకుంటున్నట్టున్నారు. మరీ మాట్లాడితే బీజేపీని మించిన హిందుత్వవాదిని తానేనని నిరూపించుకోవాలన్న తపనా ఆయనకు ఉంది. హిందుత్వ రాజకీయాలకు ప్రయోగశాల అయిన గుజరాత్‌లో అధికారం సంపాదించాలన్నది ఆయన ఆశ. కిందటి ఎన్నికలలో కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ చేసినా ఒక్క సీటైనా దక్కలేదు. ఈ సారి హిందుత్వ బాణీ ఎత్తుకుంటే ఫలితం ఉంటుందని ఆశిస్తున్నారు. మొదట ఆయన బలహీనపడ్డ కాంగ్రెస్‌ కారణంగా ఏర్పడిన ఖాళీని పూరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేశమంతటికీ, ముఖ్యంగా గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం సంపాదించడానికి హిందూత్వవాదనే గట్టెక్కిస్తుందన్నది ఆయన భావన. ఆయన దృష్టి ప్రస్తుతానికి గుజరాత్‌ మీదే ఉంది. రాజకీయాలలో మతాన్ని జొప్పించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయనకు తెలుసు. కానీ బీజేపీ విజయాలకు మతతత్వమే కారణం అనుకుంటు న్నందువల్లే కేజ్రీవాల్‌ అదే మంత్ర జపం ప్రారంభించారు. ఇది ఆయనకు కొత్తగా కలిగిన జ్ఞానోదయం ఏమీ కాదు.
ఇంతకు ముందే హనుమాన్‌ చాలీసా పఠించి, అయోధ్య సందర్శించే వృద్ధులకోసం బస్సులు ఏర్పాటుచేసి హిందువులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇది బీజేపీ నమ్ముకున్న వ్యూహంతోనే ఆ పార్టీని దెబ్బతీయాలన్న మహావ్యూహంలో భాగం మాత్రమే. అందుకే మతోన్మాద గుర్రంమీదస్వారీ మొదలు పెట్టారు. కేజ్రీవాల్‌కు అర్థంకానిది ఏమిటంటే ఆయన ఎన్నిచెప్పినా హిందుత్వ రాజకీయాలు కచ్చితంగా బీజేపీ గుత్తసొత్తే. ఆమ్‌ ఆద్మీ పార్టీని విస్తరించడానికి మించిన లక్ష్యమూ ఆయనకు ఉంది. ప్రధానమంత్రి పీఠంపై ఆయన కన్నేశారు. తక్షణం ఫలితం కనిపించకపోయినా కాలక్రమంలో ప్రయోజనం ఉండకపోతుందా అన్నది ఆయన ఆలోచన. తన పార్టీని విస్తరించడానికి దేవుళ్ల ఆవాహన నెపంతో మతతత్వ రాజకీయాలు అనుసరించాలన్నది ఆయనకు ఇప్పుడు పరమ లక్ష్యం అయిపోయింది. ఆయనకు అర్థంకాని విషయం ఏమిటంటే హిందుత్వ రాజకీయాలను గుత్తకు తీసుకున్న బీజేపీ ఇతర పార్టీలకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వదు. బీజేపీకన్నా వీర హిందుత్వ వాదాన్ని అనుసరించిన శివసేన గతి ఏమైందో ఆయనకు తెలియకపోలేదు. హిందుత్వ విధానాలు అనుసరిస్తూ రాజ్యాధికారం సంపాదించడం మీద దృష్టి కేంద్రీకరిస్తున్న బీజేపీ అదే పద్ధతి అనుసరించే మరో పార్టీని సహిస్తుందనుకోవడం కల్ల.
అన్నా హజారే నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమం ఆసరాగా కేజ్రీవాల్‌ రాజకీయాల్లో ఎదిగారు. ఆ స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం తనది భిన్నమైన పార్టీ అని నమ్మించడానికి ప్రయత్నించారు. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు అత్యవసరం అని ప్రచారం చేసుకోవడమే కాక దిల్లీలో ఈ లక్ష్యాలను కొంతమేరకైనా సాధించారు. పంజాబ్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితి, అంత:కలహాల్లో మునిగిపోయిన కాంగ్రెస్‌ కుదేలైపోవడం, అకాలీదళ్‌ నీరస పడిపోవడం, బీజేపీ అక్కడ పూర్తిగా పట్టుకోల్పోవడంవల్లే ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కానీ పంజాబ్‌లో ఆ పార్టీ పరిపాలనలో వైవిధ్యం బొత్తిగా కనిపించడం లేదు. మాదకద్రవ్యాల బెడద, మాఫియా ముఠాలు, నిరుద్యోగం మునుపటిలాగే ఉన్నాయి. ఇది నిస్సందేహంగా కేజ్రీవాల్‌ పార్టీ వైఫల్యం కిందే లెక్క. ఈ లోపాలను కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు ఆయన దేవుళ్లను ఆశ్రయిస్తున్నారు. నోట్ల మీద దేవుళ్ల బొమ్మలుంటే ఆర్థికవ్యవస్థ మెరుగు పడుతుందని వాదించి జనాన్ని నమ్మించి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు.
పెద్దనోట్ల రద్దువల్ల నల్లధనం బయటకు వస్తుందనీ, తీవ్రవాదం అంత మవుతుందనీ అందుకోసం కొద్ది కాలం కష్టాలు అనుభవించాలని మోదీ అప్పుడు ప్రచారం చేశారు. మోదీ వాదనలో ఓ ప్రాతిపదిక అయినా ఉంది. భిన్నమైన రాజకీయ మార్గం అనుసరిస్తానని నమ్మించిన కేజ్రీవాల్‌ ఇప్పుడు సగటు రాజకీయాలకన్నా హీనమైన రాజకీయాలనే అనుసరిస్తున్నారు. బీజేపీ పాదముద్రలను అనుసరిస్తే లాభం ఉంటుందను కోవడం కేవలం కేజ్రీవాల్‌ భ్రమకాదు. ఈ భ్రమకు జనాన్ని బలి చేయడం మాత్రమే. ప్రాంతీయ పార్టీలన్నింటికి ఉన్న సిద్ధాంతరాహిత్యమే ఆమ్‌ఆద్మీ పార్టీకీ ఉంది. అన్నింటి కన్నా మించి పది పన్నెండేళ్ల కిందట ఉన్నట్టు ఇప్పుడు లేరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img