Friday, June 14, 2024
Friday, June 14, 2024

ప్రమాదకరమైన రాజకీయ క్రీడ

కర్నాటకలో శివమొగ్గ పట్టణంలో యువకుడైన హర్ష హత్య జరిగింది. అనంతరం అల్లరిమూకల దాడులు, ఆస్తుల విధ్వంసం, చివరికి కర్ఫ్యూకి దారితీసింది. ఈ దుర్ఘటన పైన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి, ఈ హత్యకు కారకులుగా అనుమానిస్తున్న తొమ్మిది మందిని ఇంత వరకు అరెస్టు చేశారు. కర్ఫ్యూను శుక్రవారం వరకు పొడిగించారు. హర్ష హత్య ఘటన సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. హర్ష హత్యపై స్పందించిన బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేయగా, ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన మల్పి పోలీసు స్టేషన్‌ పోలీసు అధికారులు స్టేషన్‌ బెయిల్‌ పైన వెంటనే నిందితులను విడుదల చేశారు. హత్యకుగురైన హర్ష బజరంగ్‌దళ్‌ కార్యకర్త. హిందూమత ఆరాధకుడు. సోషల్‌ మీడియాలో జైశ్రీరామ్‌ నినాదానికి అనుకూలంగా మాట్లాడుతూ పోస్టింగ్‌లుపెట్టడం అలవాటుం దని హతుడి సోదరి చెప్పగా, సోదరుడు మాత్రం మతాల గొడవ లకు వెళ్లవద్దని నివారించడానికి ప్రయత్నించానని చెప్పారు. ఈ ఘట నకు ముందు దాదాపు 25 రోజుల నుండి హిజాబ్‌ వ్యవహారంపై వివాదం నడుస్తూనే ఉంది. బహుశా ఈ సమస్య హత్యకు కారణమై ఉండవచ్చు. నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే అసలు వాస్తవాలు వెల్లడయితే దోషులు శిక్షను అనుభవించవలసిందే. ఈలోపు అనేక కథనాల సృష్టి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయనాయకుల ప్రకటనలు, రాజ్యాంగ పదవులలో ఉన్న మంత్రులు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయ డం పరిస్థితిని మరింత ఉద్రిక్తపరిచి, గందరగోళానికి దారి తీయవచ్చు. ఎక్కువ ఘటనల్లో జరుగుతున్న తతంగమే ఇది. ఈలోపు అసలు వాస్తవం మరుగునపడి పోయే అవకాశాలుంటాయి. ఈ హత్య కేసులో అరెస్టయిన వారంతా ముస్లిం యువకులే. శివమొగ్గలో ఇలాంటి ఘటనలు లేవని ముస్లిం గూండాలే ఈ దారుణానికి పాల్పడ్డారని, రాష్ట్ర గ్రామీణాభిశాఖ మంత్రి ఈశ్వరప్ప ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం ఆయనకు అలవాటే. ఎర్ర కోటపై కాషాయజెండా ఎగురవేస్తామని వ్యాఖ్యానించి పెద్ద వివాదం సృష్టించారు. అలాగే కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.శివకుమార్‌ ముస్లింలకు అనుకూలంగా మాట్లాడటం వల్లనే ఈ హత్యకు దారితీసిందని బీజేపీ నాయకులు కొందరు వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. గతంలో పత్రికా రచయిత్రి గౌరిలంకేశ్‌, కన్నడ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌, రచయిత కల్బుర్గిని సంఘపరివార్‌ శక్తులు హత్య చేశాయి. హేతువాదులు, సామాజిక కార్యకర్తలను అనేక ప్రాంతాల్లో ఈ మూకలు మతోన్మాద శక్తులు హత్య చేశాయి.
కర్నాటకలో జరిగిన తాజా సంఘటన ప్రకంపనలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాలు లేకపోలేదు. హిజాబ్‌ వివాదం అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఈ అంశం రెండు మతాల ప్రజల మధ్య ఇప్పటికే విద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించింది. వాస్తవాలు వెల్లడిగాక ముందే ప్రజలను పాలించవలసిన మంత్రులు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. ఎవరు దోషులో తేల్చడానికి పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలున్నాయి. ఈ వ్యవస్థలన్నీ పాలక వర్గాలకు అనుకూలంగానే పనిచేస్తున్నాయన్న ఆరోపణలు, విమర్శలు చాలా బలంగానే ఉన్నాయి. హతుడు హర్షపై ఒక దాడి కేసు, మరో కేసు పోలీసుస్టేషన్‌లో నమోదై ఉన్నాయని ఉడుపి ఎస్‌పి చెప్పారు. ఇలాంటి ఘటనలపై ప్రచార, ప్రసార సాధనాలు అనేక కథనాలను ప్రచారం చేయడం సర్వసాధారణమై పోయింది. హత్యకు దారితీసిన పరిస్థితు లేమిటో నిర్ధారణ కావలసి ఉంది. ఈలోపు రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడటమేగాక, దర్యాప్తును ప్రభా వితం చేయడానికి ప్రయత్నిస్తాయి. గత అక్టోబరులో బెళగావిలో 24 ఏళ్ల యువకుడు అర్బాన్‌ఖాన్‌, ఈ సంవత్సరం జనవరిలో నరగుండ్‌లో సమీర్‌షాపూర్‌లో హత్యకు గురయ్యారు. తాజాగా హర్షను హత్య చేశారు. ఈ హత్యల మధ్య పరస్పర సంబంధం ఏమైనా ఉందా? ఉంటే ఈ దారుణాలను పురికొల్పుతున్న శక్తులేవి అనేది కూడా వెలుగులోకి రావాలి. అంతకంటే ముఖ్యమైంది ఎంతో భవిష్యత్‌ ఉన్న యువకులను మత శక్తులు వినియోగించుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. విద్యాలయాల్లో గతంలో పనిచేసిన విద్యార్థి సంఘాలు, ఫీజులు, చదువులు తదితర అంశాలపై ఆందోళనలు చేసి, విద్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు సాధించుకునేవారు. ఇప్పుడు కులాలు, మతాల ప్రాతిపదికన సంఘాలు ఏర్పడటం, వీటిని బాహ్యశక్తులు ప్రోత్సహించడం గమనించవచ్చు. యువతను మతాల ఉచ్చులోకి లాగుతున్న శక్తులు సమాజానికి చేస్తున్న చెరుపు, ద్రోహం అంతా ఇంతా కాదు. కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన నాటినుండి తినే ఆహారం, కట్టే బట్ట, గోవుల సంరక్షణ లాంటి అంశాలపై హింసా ఘటనలు అపరిమితంగా పెరిగాయి.
మతశక్తుల పన్నాగాలను ప్రజలు పసిగట్టి తగినట్టుగా స్పందించకపోతే ముందు, ముందు సామాజిక కల్లోలం సంభవించే పరిస్థితులు దాపురించవచ్చు. అసంబద్ద ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ప్రధాని మోదీయే స్వయంగా పూనుకొన్నప్పుడు ఆయన అనుసరిస్తున్న, ఆరాధిస్తున్న శక్తులు ఎలాంటి ప్రమాదకర వ్యాఖ్యలనైనా చేస్తారు కదా. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ సమాజ్‌వాది పార్టీకి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయిని ఆరోపించారు. నిజంగా సంబంధాలుంటే, తగిన ఆధారాలను సేకరించి దోషులను శిక్షించవచ్చు. అన్ని వ్యవస్థలూ ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నది బహిరంగ రహస్యమేనని విశ్లేషకులు చెప్తారు. ప్రజలందరినీ సమంగా చూడటం, ఒకే విధమైన పాలన, న్యాయం అందించవలసిన బాధ్యత గల ప్రధాని ఈ విధంగా వ్యాఖ్యానించడం దుర్మార్గం. మతశక్తుల కుయుక్తులను, కుట్రలను గమనించి యువత ఈ దేశ భవిష్యత్‌ను తీర్చవలసిన కర్తవ్యాన్ని గుర్తించాలి. హర్ష హత్యపైన, అంతక్రితం జరిగిన హత్యలపైన నిష్పాక్షిక దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి. అంతేకాదు దేశంలో బహుళ సంస్కృతిని ఆదరించి ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఇందుకు యువత నడుం కట్టాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img