Friday, May 31, 2024
Friday, May 31, 2024

భయపెడ్తున్న ధరలు

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలను, తగ్గడాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది. కానీ ఈ ద్రవ్యోల్బణం రేటులో అప్పుడప్పుడు తగ్గుదల కనిపించినప్పటికీ సామాన్యుడి బతుకు వెతలు ఆ సూచికలకు అనుగుణంగా తగ్గవు. గత రెండు నెలల నుంచి టోకు ధరల సూచీ తగ్గు ముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత రెండు నెలలుగా వ్యవసాయ కార్మికులకు వర్తించే టోకు ధరల సూచీ తగ్గినట్టు గణాంకాలను గమనిస్తే తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో టోకు ధరల సూచీ 8.39 శాతం ఉంటే నవంబర్‌ నాటికి అది 5.85 శాతానికి తగ్గింది. గత 21 నెలలుగా ఇంతగా తగ్గడం ఇదే మొదటి సారి. వ్యవసాయ కార్మికులకు వర్తించే టోకు ధరల సూచీ గత అక్టోబర్‌ లో 7.22 శాతం, గ్రామీణ ప్రజలకు వర్తించే సూచీ 7.34 శాతం ఉంది. నవంబర్‌ నెలలో టోకు ధరల సూచీలో స్వల్ప తగ్గుదల కనిపించడం తమ ఘనతేనని, తాము ధరలను అదుపు చేయడం వల్లే టోకు ధరలు తగ్గాయని మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రిజర్వు బ్యాంకు నిర్దేశించినట్టుగా ద్రవ్యోల్బణాన్నీ ఆరుశాతం కన్నా తక్కువ స్థాయిలో ఉండేట్టు చేయగలిగామని కేంద్ర ప్రభుత్వం సంతోష పడిపోతోంది. కానీ ఆహార పదార్థాల ధరలు పెద్దగా తగ్గనందువల్ల సామాన్యుడి బతుకు భారం ఏ మాత్రం తగ్గలేదు. మరి కొన్ని నెలల పాటు పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చు. దాదాపు 80 కోట్ల మందికి అయిదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇప్పటిదాకా అందుతూ వచ్చాయి. కానీ ఈ నెల తరవాత ఆ సదుపాయం ఉండదు. అందువల్ల పేద వాడికి కలిగే ఊరట ఏమీ ఉండదు. దీనికి తోడు ప్రభుత్వం దగ్గర ఆహార ధాన్యాల నిలవలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ గిడ్డంగుల్లో నిలవలు తగ్గితే మార్కెట్లో ధరలకు రెక్కలు రావడం ఖాయం. ప్రభుత్వ గిడ్డంగుల్లో ఆహార ధాన్యాల నిలవలు గత ఆరు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉన్నాయంటున్నారు. ధరలు అదుపు చేయడం కోసం మార్కెట్‌ లోకి ఆహార ధాన్యాలు భారీగా విడుదల చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. రాష్ట్రాల దగ్గర నిలవలూ తగ్గుతున్నాయి. 2021 డిసెంబర్‌లో రాష్ట్రాల దగ్గర గోధుమ నిలవలు 37.85 మిలియన్‌ టన్నులు ఉంటే అవి 2022 డిసెంబర్‌ ఆరంభం నాటికి 19 మిలియన్‌ టన్నులకు పడిపోయాయి. మార్కెట్‌ లోకి కొత్త గోధుమ పంట రావడానికి 2023 ఏప్రిల్‌ దాకా ఆగవలసిందే. ప్రభుత్వం నెలకు రెండు మిలియన్‌ టన్నులకన్నా ఎక్కువ విడుదల చేసే అవకాశం లేదు. ప్రభుత్వం విడుదల చేసే గోధుమలు తగ్గిన కొద్దీ ధరలు మరో నాలుగు నెలల పాటు పెరగక తప్పదు. నవంబర్‌ లోనూ కేంద్ర ప్రభుత్వం రెండు మిలియన్‌ టన్నులు మాత్రమే విడుదల చేసినట్టు భారత ఆహార సంస్థ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. వ్యాపారులు క్రమంగా గోధుమలు విడుదల చేస్తున్నప్పటికీ, 2022 నుంచి గోధుమల ఎగుమతి మీద నిషేధం ఉన్నా మార్కెట్‌లో గోధుమ ధరలు మాత్రం నిలకడగా లేవు. గోధుమ ఎగుమతులను నిషేధించిన తరవాతే స్థానిక మార్కెట్‌లో గోధుమ ధరలు కనీసం 28 శాతం పెరిగాయి. సామాన్య మానవుడు వినియోగించే అనేక సరుకుల ధరలు అంతకంతకూ భారమై పోతున్నాయి. ద్రవ్యోల్బణం 2 నుంచి 4 శాతం కన్నా పెరగకుండా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు సూచించింది. ఒకటి రెండు పాయింట్లు అటూ ఇటు అయినా ఫరవాలేదనుకున్నా ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 5.59 శాతం ఉంది. గత ఏప్రిల్‌లో అయితే ఎనిమిది ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది.
రష్యా-ఉక్రేన్‌ మధ్య యుద్ధంవల్ల ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి కనక మన దేశంలోనూ ధరలు పెరగడం అసహజం ఏమీ కాదని సరిపెట్టుకున్నా సామాన్యుడికి మాత్రం అది మోయ లేని భారమే. వినియోగ దార్ల ధరల సూచీలో 40 శాతం ఆహార పదార్థాల ధర మీదే ఆధారపడి ఉంటుంది కనక ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినట్టు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. గత అక్టోబర్‌ లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 7.01 శాతం ఉంటే అది నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గింది. కూరగాయల ధరలు కూడా 8.08 శాతం తగ్గాయి. ఈ సమయంలో బియ్యం క్రమంగా మార్కెట్‌ లోకి వస్తాయి. కూరగాయల దిగుబడీ ఇప్పుడు అధికమే. అందువల్ల ధరలు తగ్గడం సహజమే. కానీ వచ్చే నెలలో వీటి ధరలు పెరగక మానవు.
తృణ ధాన్యాల ధరలు 12.96 శాతం, మసాలా దినుసుల ధరలు 19.52 శాతం పెరిగిపోయాయి. గత సెప్టెంబర్‌తో పోలిస్తే ఇంధన ధరలూ దాదాపు ఒక శాతం పెరిగాయి. మధ్య మధ్యలో ఎన్నికలు రావడంవల్ల పెట్రోల్‌, డీసెల్‌ ధరలు పెంచకుండా ఆపుతున్నారు. వీటి ధరలు తగ్గడం, పెరగడంతో తమకేమీ సంబంధం లేదని, ఆ వ్యవహారం చమురు కంపెనీలు చూసుకుంటాయని ప్రభుత్వం చెప్తుంది. కానీ తగ్గడం, పెరగడం ప్రభుత్వ చేతిలోని అంశమేనని చమురు కంపెనీలు అంటాయి. ఏమైతేనేమి ఎన్నికల సమయంలో పెట్రోల్‌, డీసెల్‌ ధరలు కాస్త అయినా అదుపులో ఉంటాయి. ఇదివరకే ఎక్కువగా ఉన్న ధరలు ఈ సమయంలో మరింత పెరగవు. ఆ మేరకు ఊరటే అనుకోవాలి. వస్త్రాలు, గృహావసర వస్తువులు, వైద్యం, విద్య లాంటి ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వీటి ద్రవ్యోల్బణం ఆరు శాతానికన్నా ఎక్కువే ఉంది. పెరుగుతున్న ధరల భారాన్ని కంపెనీలు వినియోగదార్ల మీదే మోపుతున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ఈ పెరుగుదల ప్రభావం అనుభవంలోకి వచ్చింది.
ప్రస్తుతం ఆరుశాతంలోపు ఉందనుకుంటున్న ద్రవ్యోల్బణం త్వరలోనే 6.5 శాతానికి చేరే పరిస్థితే కనిపిస్తోంది. అంటే రిజర్వు బ్యాంకు నిర్దేశించిన పరిమితిని మించి పోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండొచ్చునని రిజర్వు బ్యాంకు అంచనా వేస్తోంది. కానీ స్థూల జాతీయాభివృద్ధి 7 శాతం అంచనా కాస్తా 6.8 శాతం దగ్గర చతికిల పడే సూచనలే అధికంగా ఉన్నాయి. అక్టోబర్‌ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి కూడా మందకొడిగానే ఉంది. 2021 అక్టోబర్‌తో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి మైనస్‌ నాలుగు శాతం ఉంది. ఇది 2021లో 4.2 శాతం ఉండేది. అంటే పారిశ్రామిక ఉత్పత్తిలో లోటు ఈ ఏడాది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వ్యవసాయోత్పత్తులు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తే అకాల వర్షాలు, తుపాన్లు పంటలను దెబ్బ తీస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img