Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

మోదీ చేతిలో ఆయుధం పెగాసస్‌

రాజకీయాలలో గూఢచర్యం కొత్త కాదు. ఇతర దేశాల, శత్రు దేశాల రాజులు ఏం చేస్తున్నారో,తమ రాజ్యానికి వ్యతిరేకంగా ఏం కుట్రలు పన్నుతున్నారో తెలుసుకోవడానికి అన్ని దేశాలూ గూఢచారులను నియోగించేవి.తన రాజకీయ అధికారాన్ని కాపాడు కోవడానికి ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ లాంటి వ్యవస్థలను ఉపయోగించుకున్నారో గత చరిత్రసాక్ష్యం. సొంతపార్టీ ముఖ్యమంత్రులను గద్డె దించడానికి కూడా ఇందిరా గూఢచారి సంస్థలను వినియోగించుకున్నారు. మోదీ ప్రభుత్వం గూఢచారి సంస్థలను నియోగించి అధికారం సంపాదించడంలో అపారమైన నైపుణ్యం సాధించింది. ఇజ్రాయిల్‌ గూఢచార వ్యవస్థ పెగాసస్‌ను వినియోగించుకోకుండా ఉంటే 2019లో బీజేపీ గెలిచి ఉండేది కాదేమో. ఇజ్రాయిల్‌ గూఢచర్యాన్ని అమ్మకం సరుకుగా మార్చింది. 2014 తరవాత బీజేపీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగిస్తూనే వచ్చింది. దీనిలో పెగాసస్‌ పాత్ర ఉండే ఉంటుందనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. పెగాసస్‌ గురించి వెల్లడైన సమాచారం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒకవేళ ఏ రాష్ట్రంలో అయినా తమకు మెజారిటీ రాకపోతే పెగాసస్‌ లాంటి గూఢచర్య సంస్థల సహాయంతో ప్రతిపక్షాల శాసనసభ్యులను నయాన్నో, భయాన్నో లొంగదీసుకుని మెజారిటీ ఉందనిపించుకున్న ఉదంతాలు ఈ ఏడు సంవత్సరాల కాలంలో అనేకం కనిపిస్తాయి. 201819 లో కర్నాటకలో జెడియస్‌, కాంగ్రెస్‌ సర్కారును అక్రమంగా కూల్చి, పార్టీ ఫిరాయింపుల సహాయంతో యడియూరప్ప ప్రభుత్వం ఎలా ఏర్పడిరదో చూస్తే బీజేపీ అధికార దాహం ఎంతటి నైచ్యానికి ఒడిగట్టేలా చేయగలదో అర్థం అవుతుంది. ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రక్రియను ‘‘ఆపరేషన్‌ లోటస్‌’’ అంటారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాలలో ఈ ఆపరేషన్‌ లోటస్‌ బీజేపీకి అధికారం దక్కేట్టు చేసింది. దీనికి మూలాధారం పెగాసస్‌. దీనిని బట్టి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం లోగుట్టు ఏమిటో అర్థం అవుతోంది. కర్నాటకలో హెచ్‌.డి. కుమారస్వామి సర్కారును పడదోయడానికి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సతీష్‌పై నిఘా పెట్టారు. ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్‌ ఫోన్‌ మీదా నిఘా ఉంచారు. అలాగే కాంగ్రెస్‌ నాయకుడు సిద్దరామయ్య వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్‌ ఫోన్‌ కూడా పెగాసస్‌ రాడర్‌ పరిధిలోనే ఉండేది. బల నిరూపణకన్నా ముందే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. ఇంకేముంది తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌, గోవాలో ఫిరాయింపుల ద్వారానే బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. డబ్బు సంచులకు బీజేపీకీ ఎటూ కొదవలేదు. ఇవన్నీ ప్రజాస్వామ్య సూత్రాలను, సంప్రదాయాలను తుదముట్టించేవే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేల మద్దతూ అవసరం లేదు. మెజారిటీ ఉండనక్కరలేదు. పెగాసస్‌ సేవలను కొనగల సామర్థ్యం ఉంటే చాలునన్న మాట. 2014 నుంచి చట్టసభల కొనుగోళ్లు సర్వ సాధారణమై పోయాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన పత్రికలు, కడకు న్యాయ వ్యవస్థను కూడా మోదీసర్కారు ఇదే పద్ధతిలో లొంగదీసుకుంటోందన్న మాట. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజంలో మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేస్తున్నాయి. ప్రజాస్వామ్యవ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయనే అంతర్జాతీయ సూచికలో మనదేశం 2014లో 27వ స్థానంలో ఉండేది. 2015లో 35వ స్థానానికి పడిపోయి 2016లో మాత్రం కొంచెం మెరుగనిపించి 32వ స్థానంలో నిలిచింది. 2017లో 41వస్థానంలో ఉంటే 2018లో 44వ స్థానానికి దిగజారింది. 2019లో 51వ స్థానానికి చేరింది. 2020లో ప్రజాస్వామ్య కొలమానాలు మరింత దిగజారి 53వ స్థానానికి పడిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థల స్థాయిలో ఇప్పుడు మన పోటీ అగ్రశ్రేణి ప్రజాస్వామ్య దేశాలతో లేదు. నియంతృత్వాలు, రాచరికాలు కొనసాగుతున్న అజర్‌బైజాన్‌, కజగిస్థాన్‌, బహ్రెన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సరసన చేరాం. తేడా ఏమిటంటే మనదేశంలో ప్రజాస్వామ్యం అయిదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడానికి పరిమితం. ఆ తరువాత నియంతృత్వానికి, డబ్బు సంచులు పోగేయగలిగిన రాజకీయ పక్షానికి ప్రజాస్వామ్యం పరిదారిక కన్నా అధమస్థాయికి దిగజారిపోతుంది. అసమ్మతిని సహించకపోవడం, పత్రికా యాజమాన్యాలనే టోకున కొనేయడం ఇప్పటి రీతి. పెగాసస్‌ ఈ గూఢచార్య సామాగ్రిని అనేక దేశాలకు అమ్మింది. అందులో భారత్‌ కూడా ఉంది. అంటే మోదీ సర్కారు ఈ సామాగ్రిని ఎంత భారీ ఎత్తున కొనుగోలు చేసిందో ఊహించవచ్చు. వీటికి తోడు ప్రభుత్వాలను పడగొట్టడానికి రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను మోదీ సర్కారు పదునైనా ఆయుధాలుగా ఉపయోగిస్తూనే ఉంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ఈ అంశంపై దర్యాప్తు చేయించాలని పట్టుబడ్తూనే ఉన్నాయి. అధికారపక్షం కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటూనే ఉంది. విచిత్రం ఏమిటంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఫోన్‌ కూడా పెగాసస్‌ నిఘా నేత్రం కిందకే వచ్చింది. అయినా లోక్‌సభలో ఆయన ఎలక్ట్రానిక్స్‌, సమాచార శాఖ మంత్రి హోదాలో మోదీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. మరో మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ది అదే పరిస్థితి. గూఢచర్యానికి స్వపర భేదాలు ఉండవు. ఇది ఇందిరాగాంధీ నేర్పిన పాఠం. ఇందిరాగాంధీ కుటుంబాన్నీ అనుక్షణం దుయ్యబట్టే బీజేపీ, మోదీ సర్కారు కచ్చితంగా అదే దారి అనుసరిస్తోంది. ఈ వ్యవహారాన్ని సమర్ధిస్తున్న మంత్రులు నిస్సిగ్గుగా ఇది ‘సంచలనాత్మకం’, ‘భారత ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే కుట్ర’ అంటున్నాయి. ఏదైనా చెడు జరిగితే ఇందిరాగాంధీ ‘విదేశీ శక్తుల కుట్ర’ అనే వారన్న మాట గుర్తుకు తెచ్చుకుంటే మోదీ వ్యూహం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. పెగాసస్‌ ఈ గూఢచర్య సామాగ్రిని ప్రభుత్వాలకే అమ్మిందన్న విషయాన్ని మాత్రం మోదీ సర్కారు అంగీకరించదు. ఈ సామగ్రిని కొన్న దేశాలలో భారత్‌ కూడా ఉందనేది బ్రహ్మ రహస్యమేమీ కాదు. 20172019 మధ్య మోదీ సర్కారు దీన్ని విస్తృతంగా వినియోగించింది. అదే సమయంలో రంజన్‌గొగొయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. రామమందిర నిర్మాణానికి పౌరసత్వ చట్టానికి అనుకూలంగా, 370వ అధికరణం రద్దు వ్యవహారంలోనూ గొగొయ్‌ మోదీకి ఎలా సహకరించారో చూస్తే ఆయనమీద పెగాసస్‌ మంత్రదండం ఉపయోగించే ఉంటారనిపిస్తుంది. ఆయన హయాంలో ఇచ్చిన ప్రతి తీర్పూ మోదీకి అనుకూలమే. గార్డియన్‌, ది వైర్‌, మరో 15 వార్తాసంస్థల పరిశోధనల్లో పెగాసస్‌ అందించిన గూఢచర్య సామాగ్రిని ఇప్పటికి వినియోగిస్తూనే ఉన్నట్టు స్పష్టం అవుతోంది. పెగాసస్‌ సేవలను మనదేశంలో వినియోగించలేదని చెప్పే ధైర్యం మోదీ సర్కారుకు లేకపోవడమే వాస్తవం ఏమిటో తెలియజేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img