test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

మోదీ ప్రచార కాంక్ష

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చిన సంఫ్‌ు పరివార్‌ కుదురుకు రాజ్యాంగంపై ఎన్నడూ నమ్మకం లేదు. 2019లో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఛిన్నాభిన్నం చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు మోదీ పార్లమెంటు మెట్లకు మొక్కి తనకు ఆ వ్యవస్థపై అపారమైన విశ్వాసం ఉన్నట్టు నమ్మించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని 1921-1927 మధ్య నిర్మించారు. దానిని 1927 జనవరిలో ప్రారంభించారు. అప్పుడు దానిని ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ అనే వారు. మన దేశంలో బ్రిటిష్‌ పాలన అంతమైన తరవాత రాజ్యాంగ నిర్ణాయక సభ ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంది. 1950లో భారత రాజ్యాంగాన్ని అమలుచేసిన తరవాత దానిని పార్లమెంటు భవనం అంటున్నాం. ఉభయ సభలైన లోకసభ, రాజ్యసభ కూడా ఈభవనంలో ఇప్పటిదాకా కొనసాగాయి. మరింత చోటు అవసరమై నందువల్ల 1956లో ఈ భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మించారు. ఈ భవనం ఇప్పటికీ పదిలంగానే ఉంది. అయినా ప్రధాన మంత్రి తన ప్రచారకాంక్ష కారణంగా దాదాపు రెండువేలకోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కొత్త భవనం నిర్మించారు. ఇది మరింత విశాలంగా ఉన్న మాట నిజమే. రేపెప్పుడో పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరిగితే తగిన వసతి ఉండడానికి వీలుగా కొత్త భవనాన్ని నిర్మించిన మాట వాస్తవం. ప్రస్తుత పార్లమెంటు భవనంలో చోటు సరిపోవడం లేదన్న కారణంతో 2010లో నూతన పార్లమెంటు భవనం నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. భవనం పాతదైపోతోందన్న కారణమూ ఉంది. 2012లో అప్పుడు లోకసభ స్పీకరుగా ఉన్న మీరాకుమార్‌ కొత్త భవననిర్మాణం గురించి ఆలోచించారు. పాతభవనాన్ని పటిష్ఠంగా ఉంచడంకోసం తగిన సూచనలు చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుత భవనం 93 ఏళ్ల నాటిది. పాత భవనంలో వసతి తక్కువైనా, అది మన వారసత్వంలో భాగం. దానిని పరిరక్షించడానికి తగిన ఏర్పాట్లు చేయవలసిన అవసరమూ ఉంది. 2019లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించి అందులో నూతన పార్లమెంటు భవన నిర్మాణాన్ని కూడా చేర్చింది. అంతకు ముందున్న రాజ్‌ పథ్‌ పేరును కర్తవ్య పథ్‌గా మార్చింది. ఉప రాష్ట్రపతికి కొత్తఆవాసం ఏర్పాటుచేయాలని తలపెట్టింది. ప్రధాన మంత్రి కార్యాలయం, నివాసాన్ని కూడా కొత్తగా నిర్మించారు. ఒకే ఆవరణలో కేంద్ర సెక్రెటేరియట్‌ నిర్మాణం కూడా జరిగిపోయింది. మంత్రుల కార్యాలయాలన్నీ అక్కడే ఉంటాయి. నూతన పార్లమెంటు భవనానికి, తదితరభవనాలకు 2020 అక్టోబర్‌లో అంకురార్పణ జరిగింది. పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్‌ పదిన ప్రధానమంత్రి మోదీ శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ లాంఛనం పూర్తి అయినా కొన్ని అర్జీలు అంది నందు వల్ల అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎం.ఎం. ఖాన్విల్కర్‌ సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి కార్యక్రమానికి కళ్లెంవేశారు. 2021 జనవరిలో సుప్రీం కోర్టు విధించిన ఆంక్ష తొలగిపోయింది. ఈ ఏడాది మార్చి 30న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కొత్తభవనానికి తుదిమెరుగులు దిద్దే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారంటున్నారు. దీనికి సంబంధించి పక్కన ఎవరూ లేకుండా మోదీ ఒక్కడి ఫొటోలు, వీడియోలు వెలువడ్డాయి. లోకసభస్పీకర్‌ గానీ, ఇతర ఉన్నతాధికారులు కానీ ఆ చుట్టు పక్కల ఎక్కడా కనిపించలేదు. మోదీ మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఫొటోలు, వీడియోలు తీశారు.
వచ్చే ఆదివారం (28వ తేదీ) కొత్త పార్లమెంటుభవనం ప్రారంభిస్తారు. అదే రోజు సావర్కర్‌ జన్మదినం. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించిన దాఖలాలు ఇప్పటి దాకా ఐతే లేవు. అందువల్ల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్‌, మరికొన్ని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. దేశం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కుంటున్న సమయంలో 2,11,000 కోట్ల రూపాయల అప్పులు తల మీద కత్తిలా వేలాడుతున్నప్పుడు రెండువేల కోట్లు ఖర్చుపెట్టి కొత్త పార్లమెంటు భవనం, తదితర భవనాల నిర్మాణం అవసరమా అన్న ప్రశ్నకు ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక సమాధానం అయితే లేదు. దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టదశలో ఉన్నప్పుడే నర్మదా నది తీరంలో 182 మీటర్ల ఎత్తైన సర్దార్‌పటేల్‌ విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయలు వెచ్చించింది. దీని ప్రచారంకోసం మరో రూ.2.64కోట్లు ఖర్చుపెట్టారు. దాన్ని కూడా మోదీనే ఆవిష్కరించారు. అహ్మదాబాద్‌లోని సర్దార్‌పటేల్‌ క్రికెట్‌స్టేడియం దేశంలోకెల్లా విశాలమైంది. దానికి మరమ్మతులు చేశారు. అందులో భాగంగా సర్దార్‌ పటేల్‌ పేరు మాయమై నరేంద్రమోదీ స్టేడియంగా రూపాంతరం చెందింది. పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి, కాదు మోదీ ప్రారంభించడంలో ఔచిత్యం ఏమిటో ఎంత తరచిచూసినా అంతుబట్టదు. న్యాయంగా అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించాలి. ఎందుకంటే భారత పార్లమెంటు అంటే కేవలం భవనం కాదు. మన పార్లమెంటు అంటే రాష్ట్రపతి, పార్లమెంటు ఉభయ సభలు. అలాంటిది రాష్ట్రపతి ప్రమేయం లేకుండా కొత్త భవనం ప్రారంభోత్సవం జరిగిపోవడంఅంటే కేవలం ద్రౌపది ముర్మును అవమానించడమే కాదు. పార్లమెంటు వ్యవస్థను, రాష్ట్రపతి వ్యవస్థను కూడా అవమానించడమే. ప్రధానమంత్రి మోదీకి ఉన్న ప్రచారార్భటం అందరికీ తెలిసిందే.
ఆయన వేషధారణమీద అపారమైన డబ్బు ఖర్చవుతుంది. ఈ ఖర్చంతా ప్రభుత్వఖజానాలోంచి చెల్లించాల్సిందే. ఆయన నూతన పార్లమెంటు భవనం పనులు ఎంతవరకు పూర్తి అయినాయో తనిఖీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల మానవ మాత్రులు ఎవరూ కనిపించని మాట వాస్తవమే. కానీ ఎవరికీ కనిపించకుండా ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లో ఎక్కడో పొంచిఉండి ఫొటోలుతీశారుగా! మోదీ అప్పుడప్పుడు హిమాలయాల్లోకి వెళ్లి ధ్యానంచేస్తున్న ఫొటోలుసర్వవ్యాప్తం అవుతుంటాయి. అప్పుడూ పరిసరాల్లో ఎవరూ ఉండరు. ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకోవ డానికి వెళ్తుంటారు. అప్పుడూ ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉండా ల్సిందే. కానీ వారు కనిపించకుండానే తమ విధులు నిర్వహిస్తారు కాబోలు! తన తల్లి తనకు రూపాయి పావలాఇచ్చారని మోదీ గొప్పగా చెప్పుకుంటారు. ఆమెకు మోదీభోజనం తినిపిస్తున్న చిత్రాలూ విరివిగానే ప్రచారంలో పెడ్తారు. తనను ఫొటోలు తీస్తున్నప్పుడు ఎవరు అడ్డం వచ్చినా మోదీ సహించరు. కొన్ని సందర్భాలలో అడ్డం వస్తున్నారనుకునే వారిని మోదీ స్వయంగా పక్కకుతోసేస్తారు. మోదీకిఉన్న కీర్తికాంక్ష అద్వితీయ మైంది. ‘‘నేనొక్కడిని, నా మీద ఇంతమంది దాడి చేస్తున్నారు చూడండి’’ అని పార్లమెంట్‌ సాక్షిగా మోదీ ఆక్రోశించారు. నిజమే ఆయన ఎవరితోనూ ఎందులోనూ, ఎప్పుడూ భాగస్వామి అయిన దృష్టాంతమే ఉండదు. ఆయనొక్కడే మరి. ఆయన ప్రచార కాంక్ష ముందు అన్నీ బలాదూరే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img