Friday, April 26, 2024
Friday, April 26, 2024

బయట పల్లకీల మోత ఇంట ఈగల మోత

భారత ప్రజల అనుభవాల సారం విదేశాల అధిపతులకు అందడం లేదో, లేక విదేశీయులకు ప్రధానమంత్రి మోదీ అత్యంత ప్రీతి పాత్రుడు కావడానికి కారణం మనకు అంతుబట్టడం లేదో కాని నరేంద్ర మోదీ వ్యవహారం బయట పల్లకీల మోత ఇంట ఈగల మోత అన్నట్టుగా ఉంది. మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే ఆ దేశ ప్రధానమంత్రి ఆంథొనీ అల్బనిస్‌ మోదీ తనకు బాస్‌ అన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా మోదీ అత్యంత ఆదర్శప్రాయుడిగా కనిపిస్తున్నారు. అమెరికా ప్రధానంగా వ్యాపారం మీద ఆధారపడిన దేశం. భారత్‌లో కూడా వ్యాపారం జోరుగా సాగుతోందన్న అభిప్రాయం విదేశీయులకు, ప్రధానంగా ఆ దేశాధిపతులకు కల్పించడానికి మోదీ ఏ అవకాశాన్నీ వదిలిపెట్టరు. కానీ మోదీ మీద స్వదేశీయులకే గురికుదరడం లేదు. మొన్న మొన్నటి దాకా ప్రధానమంత్రి మోదీకి విశేషమైన జనాదరణ ఉండేది. ఆయన ఎక్కడ సభలో ప్రసంగించినా వచ్చిన జనమో, తెచ్చిన జనమో కుప్పతెప్పలుగా వచ్చేవారు. ఆయన ఎన్నికల సభలు ఫలితాలను తారుమారు చేయగలిగేవి. కానీ ఇటీవలి కాలంలో మోదీ ప్రభ ఎంతో కొంత మసకబారింది. ఆయన ఆరోహణా క్రమం కాస్తా అవరోహణా క్రమంగా మారుతోందేమోనన్న అనుమానమూ కలుగు తోంది. మొన్న మొన్నటి దాకా మోదీ ఎన్ని అవకతవక నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు కిమ్మనలేదు. తుగ్లక్‌ లాంటి నిర్ణయాలు తీసుకోవడం మోదీకి జన్మత: అబ్బిన లక్షణం అయి ఉంటుంది. లేకపోతే మొదటిసారి పెద్దనోట్ల రద్దు ఘోరంగా విఫలమైనా మొన్నటికి మొన్న మళ్లీ రెండువేల రూపాయల నోట్లను వెనక్కు తీసుకోవాలని ఎందుకు అనుకుంటారు. మోదీ ప్రభ ఇప్పటికీ వెలుగుతున్నట్టయితే బీజేపీ సర్వశక్తులు ఒడ్డినా, మోదీ-అమిత్‌షా కాలికి బలపంకట్టుకుని కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా కర్నాటకప్రజలు ఓడిరచరుగా! విదేశీఅధినేతలు మోదీ పలుకు బడిని, హావభావాలను, నటనాచాతుర్యాన్ని చూసి మురిసి పోతున్నట్టే ఆ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు కూడా ఇంకా మోదీ మీద వెర్రి అభిమానం తగ్గలేదు. మోదీ ఏ దేశానికి వెళ్లినా ఆ దేశాల ప్రజలు హారతులు పట్టిన సందర్భం అయితే లేదు కాని ప్రవాస భారతీయులు మాత్రం మోదీ సభలకు దండిగా వస్తూనే ఉన్నారు. మోదీ ప్రచారంలో పెడ్తున్న భారత అభివృద్ధి పంథా గురించి విదేశీ అధిపతులకు వాస్తవం తెలిసే అవకాశంగానీ, తెలుసుకోవాలన్న ఆకాంక్ష గానీ ఉన్నట్టు లేదు. మోదీతో బుజం బుజం కలిపితే తమకూ ఆయన కీర్తి సుగంధం ఎంతో కొంత అంటుతుందనుకుంటున్నట్టు ఉన్నారు. దేశంలోని వ్యాపార వర్గాలకు మోదీ వినిపించే అభివృద్ధి కథలు నచ్చడంలో ఆశ్చర్యం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ జాంబవంతుని అంగలతో దూసుకెళ్తోందని మోదీ చేస్తున్న ప్రయత్నం ఎంత అసత్యమైనా మోదీ తమకు అనుకూల ఆర్థిక విధానాలను అనుసరిస్తారు కనక వ్యాపార వర్గాలు మోదీ కీర్తిగానంలో మునిగి తేలుతుంటారు. భారత్‌లో వ్యాపారావకాశాలు అపారంగా ఉన్న మాట వాస్తవమే. అపారమైన దేశ జనాభానే ఆర్థికాభివృద్ధికి స్వాగత ద్వారాలు తెరవగలుగుతుంది. 1980లు, 1990లలో చైనా ఉన్న పరిస్థితిలో భారత్‌ ప్రస్తుతం ఉంది. ఒక రకంగా చూస్తే చైనా నాయకత్వానికి ప్రస్తుతం భారత్‌కు ఉన్న అవకాశాలు అసూయ కలిగిస్తున్నాయన్నా ఆశ్చర్యంలేదు. భారత్‌కు జి 20 దేశాల అధ్యక్ష స్థానం ఈ ఏడాది దక్కడంలో గుండెలు బాదుకోవలసిన మహత్తరత ఏమీ లేదు కానీ అదీ ఇతరదేశాలకు కంటగింపుకావడానికి ఆస్కారం ఉంది. అంతర్జాతీయంగా చైనా ప్రభ తగ్గుతున్న కొద్దీ భౌగోళిక రాజకీయాలలో చైనాకు ఉన్న స్థానం కూడా పలచబడక తప్పదు. ఈ పరిస్థితుల్లో భారత ప్రధాన మంత్రి ఎవరు అన్న దానితో నిమిత్తం లేదు. అది మోదీ అయినా, రాహుల్‌ గాంధీ అయినా లేదా ఏ పుల్లయ్యో, మల్లయ్యో అనినా చైనా లాంటి దేశాల స్పందన ఇప్పుడున్న దానికన్నా ఎంత మాత్రం భిన్నంగా ఉండేది కాదు. ఈ దశలో భారత్‌ ఎదుగుదల అనివార్యం కనక ఎవరు ప్రధాన మంత్రి అన్నది అంత ప్రధానమైంది కాదు. కానీ మోదీ రాట్నం చుట్టూ తిరిగే ఈగ కనక అన్నీ తన ఘనతే అని చాటి చెప్పుకునే చాకచక్యం ఉన్నవాడు కనక ఉన్న పరిస్థితి నుంచి అపారంగా లబ్ధి పొందుతున్నాడు. ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నప్పుడు మన ఆర్థికాభివృద్ధి ఎన్నదగిందిగానే ఉండేది. కానీ జీడీపీలో ఒక్క దశాంశం పెరిగినా ఎగిరి గంతేసి అట్టహాసానికి పాల్పడే లక్షణం మన్మోహన్‌ సింగ్‌కు లేదు. మోదీ పరిస్థితి అలా కాదు. ఆయనకు ఏదైనా ప్రచారం తరవాతే. తన పలుకు బడిని పెంచుకోవడానికి, తన వ్యక్తిగత కీర్తి ఆకాశాన్నంటేలా చూడడానికి ఏ అవకాశాన్ని ఆయన వదులుకోరు. కానీ మోదీ పరిస్థితి స్వదేశంలో భిన్నంగాఉంది. ప్రజలు ఆయన పాలనలోని దుష్ప్ర భావాలను క్రమంగా గ్రహిస్తున్నారు. ఆయన కలల బేహారి అన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. సామాన్య జనజీవితమే మోదీ ప్రచార ఆర్భాటంలోని డొల్లతనాన్ని బయట పెడ్తున్నాయి. ప్రజల దైనందిన జీవితాల తీరుతెన్నులు ఎన్నికలలో వారి నిర్ణయాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కర్నాటక ఎన్నికలలో జరిగింది అదే. త్వరలో మరో మూడు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఎదురైనా దిగ్భ్రాంతి చెందవలసిన అగత్యం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ స్వదేశంలో ఉన్న రోజులకన్నా విదేశీ పర్యటనలో గడిపిన రోజులే ఎక్కువేమో అనిపించేది. మోదీ స్వదేశం తిరిగి వస్తే అదో పెద్ద వార్త అయ్యేది. అయితే ఇటీవల కొద్ది సంవత్సరాలుగా మోదీ విదేశీయాత్రలు మందగించాయి. ఈ మధ్యే మళ్లీ ఆయన విదేశాలకు పయనమయ్యారు. అందువల్ల ఈ పర్యటన జనందృష్టిని ఆకర్షించడంలో వింతేమీలేదు. అయితే నిరంతరం రెక్కలుకట్టుకుని విదేశాల్లో సంచరించి నంత మాత్రాన చుక్కలు నేలరాలే అవకాశం ఏమీ ఉండదు. మోదీ భవిష్యత్తును తేల్చేది విదేశాల్లో ఆయనకు ఉన్న పలుకుబడో, కీర్తో కాదు. దేశ వాసులు ఆయన పాలననుంచి ఏ మేరకు లబ్దిపొందుతున్నారు, ఎంత సంతృప్తి పడ్తున్నారు అన్నదే అంతిమంగా మోదీని ఒడ్డుకు చేర్చడానికో మరో పరిణామానికో దోహదం చేస్తుంది. విదేశీ పర్యటనల వల్ల మోదీ వ్యక్తిగత కీర్తి పెరిగితే దేశవాసులకు ఒరిగేది ఏమీ ఉండదు. ఆయన విదేశీ పర్యటనలు దేశానికి ఏ మేరకు ఉపకరించాయన్నదే అసలు ప్రశ్న.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img