Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

రామ్‌దేవ్‌పై మండిపడ్డ సుప్రీంకోర్టు

ఎంతగా మందలించినా యోగా గురువు రామ్‌ దేవ్‌ బాబా వైఖరి మారనందువల్ల సుప్రీంకోర్టు బుధవారం ఆయనపై మండి పడిరది. రామ్‌ దేవ్‌ బాబా, ఆయన సహచరుడు ఆచార్య బాలకృష్ణ ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలు జారీ చేయడాన్ని నిలిపి వేయకుండా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు వారిద్దరి మీద కోర్టు ధిక్కార నేరం మోపవలసి వస్తుందని హెచ్చరించింది. వారిద్దరినీ రెండుసార్లు కోర్టుకు పిలిపించింది. రామ్‌దేవ్‌ బాబా నిండు కొలువులో చేతులెత్తి క్షమించమని అనేక సార్లు ప్రాధేయపడ్డా సుప్రీంకోర్టు మన్నించలేదు. పతంజలి ఆయుర్వేద సంస్థ జనాన్ని తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలు జారీచేయడం ఆపలేదు. బుధవారం రామ్‌దేవ్‌ బాబా మరో సారి క్షమాపణ కోరుతూ అర్జీ పెట్టుకున్నారు. ‘‘మేం గుడ్డి వాళ్లం కాదు. ఈ విషయంలో ఉదారంగా ఉండదలచు కోలేదు’’ అని న్యాయమూర్తులు హిమాకోహ్లీ, అమానుల్లా కరాఖండీగా చెప్పేశారు. ‘‘ఈ క్షమాపణలన్నీ కాగితాలకే పరిమితం. పెడదారి పట్టించే వ్యాపార ప్రకటనలు జారీ చేయబోమని హామీ ఇచ్చి మళ్లీ అదే పని చేస్తున్నారు. వారు ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నట్టుంది’’ అని న్యాయమూర్తులు కటువైన వ్యాఖ్యలు చేశారు. రామ్‌ దేవ్‌ బాబా ప్రచార కాంక్ష ఎంత తీవ్రమైందంటే తమ క్షమాపణలు అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయక ముందే ఆ విషయం మీడియాకు తెలియజేశారు. ఈ అంశం కోర్టు దృష్టికి వచ్చే దాకా వీరిద్దరూ కోర్టుకు ప్రమాణపత్రం అందజేయడం తమ బాధ్యత అని భావించలేదు. మంగళవారం సాయంత్రం ఏడున్నర దాకా వారి క్షమాపణ అత్యున్నత న్యాయస్థానానికి అందలేదు కానీ మీడియాకు మాత్రం అందింది. ‘‘ఇది బలీయమైన ప్రచారకాంక్ష కన్నా మరేమీ కాదు’’ అని న్యాయమూర్తులు కటువుగానే చెప్పారు. పతంజలి ఆయుర్వేద సంస్థ తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్తగి రామ్‌ దేవ్‌ బాబాను సమర్థిస్తూ వారు పంపిన క్షమాపణ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి అందిందో లేదో తను చెప్పలేను కానీ తామైతే పంపించామని వాదించారు. ప్రమాణ పత్రం అందజేయడంలో కూడా దగా చేస్తున్నారు అని న్యాయమూర్తి అమానుల్లా వ్యాఖ్యానించక తప్పలేదు. ప్రమాణపత్రంలో రాసిన ‘‘పొరపాటు’’ అన్న మాట చాలా చిన్నదని న్యాయమూర్తి అమానుల్లా అన్నారు. ఈ క్షమాపణ పత్రం మనస్ఫూర్తిగా సమర్పించినట్టు లేదు అన్నప్పుడు రామ్‌ దేవ్‌ తరఫు న్యాయవాది ‘‘ఇంకా ఏం చేయాలి. ఏం చేయమంటే అది చేస్తాం. రామ్‌ దేవ్‌ అస్తమానం కోర్టులకెక్కే మనిషి కాడు. జనం తప్పులు చేస్తుంటారు’’ అన్నారు. సీనియర్‌ న్యాయవాది అయి ఉండి ఇలా మాట్లాడడం ఆశ్చర్యకరమే. ‘‘మేం ఉత్తర్వులు జారీ చేసిన తరవాత కూడా కేవలం క్షమాపణ చెప్పడంతో సరిపోదు. దీని పర్యవసానాలు రామ్‌ దేవ్‌, బాలకృష్ణ అనుభవించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘‘ఇది బాహాటంగా చట్టాన్ని అతిక్రమించడమే. పెడదారి పట్టించే వ్యాపార ప్రకటనలు నిలిపివేయాలని ఉత్తరాఖండ్‌ అధికారులు ఆదేశించినప్పుడు హై కోర్టు మా మీద కఠిన చర్య తీసుకోకూడదు అన్న సాకు చూపించారు. ఇది మీ (రామ్‌ దేవ్‌) ప్రవర్తన ఎలాంటిదో తెలియజేస్తోంది’’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిందటిసారి విచారణ సమయంలో రామ్‌ దేవ్‌ బాబా విషయంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా తీవ్రంగా పరిగణించింది. రామ్‌ దేవ్‌ బాబా పెడదారి పట్టించే వ్యాపార ప్రకటనలు విడుదల చేస్తున్నప్పటికీ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఇది సుప్రీంకోర్టుకు ఆగ్రహ కారణమైంది. ఆయన మీద చర్య తీసుకోని లైసెన్సులు జారీ చేసే ముగ్గురు అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. రామ్‌ దేవ్‌ బాబా ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఎడా పెడా వ్యాపార ప్రకటనలు జారీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. రామ్‌ దేవ్‌ బాబా విడుదల చేసిన వ్యాపార ప్రకటనలపై 2011లో మంత్రిత్వశాఖ ఉత్తరాఖండ్‌ లైసెన్సులు ఇచ్చే అధికారం ఉన్న వారికి ఓ లేఖ రాసింది. రామ్‌ దేవ్‌ కంపెనీ దానికి ఓ జవాబు పడేసింది. లైసెన్సులు ఇచ్చే అధికారులు ఏ చర్యా తీసుకోకుండా రామ్‌ దేవ్‌ కు కేవలం ఓ హెచ్చరిక జారీ చేసి సరిపుచ్చారు. 1954 నాటి ప్రమాదకర ఔషధాల చట్టం ప్రకారం హెచ్చరిక జారీచేసే అవకాశమే లేదని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ తంతు ఒకసారి కాదు ఆరుసార్లు జరిగింది. అయినా లైసెన్సు ఇచ్చే అధికారి కిమ్మనలేదు. ఆ తరవాత ఆ స్థానంలోకి వచ్చిన అధికారిదీ అదే తంతు. అందుకని ఆ ముగ్గురు అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని న్యాయమూర్తులు అన్నారు. ‘‘లైసెన్సు ఇచ్చే అధికారులు తప్పుడు వ్యాపార ప్రకటనలు జారీచేసే వారితో కుమ్మక్కు అయ్యారు’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై చాలా తీవ్రమైన అభిశంసనే. రామ్‌ దేవ్‌ తో పాటు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా దగా చేస్తోంది అని న్యాయమూర్తులు అన్నారు. ‘‘మీరు కేవలం తపాలా కార్యాలయంలా వ్యవహరిస్తున్నారు. మీరు న్యాయ సలహా అయినా తీసుకోకపోవడం సిగ్గు చేటు’’ అని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తులు ఘాటుగా మందలించవలసి వచ్చింది. ‘‘పతంజలి ఆయుర్వేద కంపెనీతో కుమ్మక్కై మీరు ప్రజల జీవితంతో చెలగాటమడుతున్నారా’’ అని ప్రశ్నించారు. ఆ దశలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది చర్య తీసుకుంటాం అనడం న్యాయమూర్తులకు మరింత కోపం తెప్పించింది. ‘‘మీరు చివరకు నిద్ర లేచారన్న మాట. ఓ చట్టం ఉంది’’ అని న్యాయమూర్తి హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో రామ్‌ దేవ్‌ బాబా కంపెనీ మందులు వాడిన నిర్భాగ్యులు ఎంతో మంది ఉండి ఉంటారు. రామ్‌ దేవ్‌ కాకుండా మరెవరైనా ఇదేపని చేసి ఉంటే ఇంతే నిష్క్రియాపరంగా ఉండేవారా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. లైసెన్సులు ఇచ్చే వ్యవస్థ కుంభకర్ణ నిద్రలో ఉందని కూడా న్యాయమూర్తులు అభిశంసించారు. రామ్‌ దేవ్‌ కు చెందిన దివ్య ఫార్మసీ ఇచ్చిన సమాధానం అహంకార పూరితంగా ఉందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 2018 నుంచి ఇప్పటిదాకా పని చేసిన ఆయుర్వేద, యూనానీ అధికారులందరూ కోర్టుకు సమాధానం చెప్పాలని కూడా ఆదేశించారు. రామ్‌దేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ స్వయంగా కోర్టుకు హాజరు కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని, వారు విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారని కూడా న్యాయస్థానం గుర్తు చేసింది. వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. మోదీ ప్రభుత్వం అండ చూసుకునే రామ్‌ దేవ్‌ విర్రవీగుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img