Friday, May 3, 2024
Friday, May 3, 2024

సరిహద్దు సమస్యపైనా అసత్యాలే

మూడు నాలుగేళ్ల నుంచి చైనా నెమ్మది నెమ్మదిగా మన సరిహద్దులోకి చొచ్చుకు వస్తోంది. వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమిస్తోంది. అక్కడ రోడ్లతో సహా అనేక రకాల నిర్మాణాలు కొనసాగిస్తోంది. అయినా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ అంశంపై అసలు పెదవే విప్పరు. ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ ఇప్పుడు కొత్తగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాటల మధ్య ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. వీరి మాటల్లో ఏకరూపత ఏమైనా ఉంటే అది నిజాన్ని దాచిపెట్టడంలో మాత్రమే కనిపిస్తుంది. గత తొమ్మిదవ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లఖింపూర్‌ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రదాన్‌ బరువా తరఫున ఎన్నికల ప్రచారంచేస్తూ భారత చైనా మధ్య సరిహద్దులో కొనసాగుతున్న గందరగోళ పద్ధతిని తనదైన శైలిలో ప్రస్తావించారు. ‘‘చైనా మన భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేక పోయింది. నరేంద్ర మోదీ ఇంతటి పటిష్ఠ పరిపాలన అందిస్తారు’’ అన్నారు. చైనా అసలు మన భూభాగంలోకి చొచ్చుకు రాకపోతే ఒక్క అంగుళం నేలనైనా ఆక్రమించలేదని చెప్పడంలో పరమార్థం ఏమిటో! విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జ ైశంకర్‌ మాత్రం ‘‘చైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ. నేనేం చేయగలను. మనది చైనా కన్నా చిన్న ఆర్థిక వ్యవస్థ. మనకన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థతో ఎలా తలపడగలం? ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన అంశం’’ అన్నారు. జై శంకర్‌ చైనా మన భూభాగంలోకి చొచ్చుకు రాలేదని కానీ, దూసుకు రాలేదని కానీ ప్రస్తావించకుండా ఆ దేశంతో తలపడే శక్తి మనకు లేదన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందన్న కచ్చితమైన రుజువులున్నా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవం అంగీకరించడం లేదు. చైనా లడాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమించిందన్న సమాచారం 2020 జూన్‌ లో అందింది. చైనా దళాలతో జరిగిన ఘర్షణలో మన 20 మంది సైనికులు నేలకొరిగారు. అనేక మంది భారత సైనికులను చైనా బందీలుగా పట్టికెళ్లింది. అదే సమయంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘వారు మన భూభాగంలోకి చొచ్చుకు రానూ లేదు. మన నిఘా శిబిరాలను స్వాధీనం చేసుకోనూ లేదు’’ అని ఆ సమావేశంలో చెప్పారు. మన జవాన్లు 20 మంది ప్రాణాలు అర్పించారు. వారికి మన దళాలు గుణపాఠం చెప్పాయి అన్నారు. ‘‘మన భూభాగంలోకి ఎవరు చొరబడలేదు లేదా చొరబడి లేరు’’ అన్న మోదీ మాటలు ఆ రోజుల్లో బాగా ప్రచారంలోకి వచ్చాయి. ‘‘మన భద్రతా దళాలకు ఇప్పుడు ఒకేసారి అనేక రంగాలలోకి దూకే సామర్థ్యం ఉంది’’ అని కూడా అన్నారు. ఆ మరుసటి నెలలోనే అంటే 2020 జులైలో వ్యూహాత్మక వ్యవహారాలలో నిపుణుడైన కల్నల్‌ అజయ్‌ శుక్లా సరిహద్దులోని సైనికులను ఉటంకిస్తూ చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఉపసంహరించుకోవడానికి నిరాకరించింది అన్నారు. హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా హైట్స్‌ లో 1500 మంది భారత సైనికులు పోరాడుతున్నారు అని కూడా తెలియజేశారు. చైనా అప్పటికే రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిందని అన్నారు. అంటే ఈ రెండు చోట్లా ఘర్షణ జరుగుతోందనేగా. చొచ్చుకు వచ్చిన భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లడానికి చైనా నిరాకరిస్తోందనేగా! మాజీ సైనికాధికారుల వాదనను మోదీ ప్రభుత్వం అప్పుడు ఖండిరచలేదు. పైగా 2020 జూన్‌ కు ముందున్న చోటికి వెనక్కు వెళ్లాలని చైనాకు చెప్పడానికి కమాండర్ల స్థాయిలో 21 విడతల చర్చలు జరిగాయి. ఏ సమస్య లేకపోతే చర్చల అవసరమేమిటో!
గల్వాన్‌ లో ఘర్షణ జరగక ముందు నాటి స్థితికి రావడానికి చైనాతో చర్చలు జరుగుతున్నాయని భారత సేనాధిపతి గత ఫిబ్రవరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ చర్చల్లో సానుకూల పరిణామం ఏమీ కనిపించలేదు. ఏ గొడవా లేకపోతే చర్చలు ఎందుకు? వెయ్యి చదరపు కిలోమీటర్ల భారత భూభాగం చైనా అధీనంలోకి వెళ్లింది అని 2020 ఆగస్టులోనే గూఢచార శాఖ మోదీకి తెలియజేసింది. అయినా ఆయన చైనా చొరబడలేదనే ఇప్పటికీ వాదిస్తున్నారు. గల్వాన్‌ లోయలో 20చ.కి.మీ.లు, పోంగాంగ్‌త్సోలో 65 చ.కి.మీ.లు, చుశాల్‌లో 29 చ.కి.మీ.లు చైనా అధీనంలోకి వెళ్లిందని సైనికాధికారులు చెప్పారు. మాజీ కల్నల్‌ అజయ్‌ శుక్లా చెప్పిందీ ఇదే. చైనా చొరబాటువల్ల మన పశువుల కాపర్లు గోగ్రా ప్రాంతంలోకి వెళ్లలేకపోతున్నారు. దీన్ని మోదీ ప్రభుత్వం ఖండిరచలేదు. 2023 జనవరిలో ఏటా జరిగే పోలీసు డైరెక్టర్‌ జనరళ్ల సమావేశంలో లేప్‌ా పోలీసు సూపరింటెం డెంట్‌ ఒక పత్రం సమర్పిస్తూ మొత్తం 65 గస్తీ పాయింట్లు ఉంటే ఇప్పుడు 26 పాయింట్లు మన అధీనంలో లేవని చెప్పారు. ఇక్కడ భారత భద్రతా దళాలు గస్తీ తిరగనందువల్ల చైనా తిష్ఠ వేసింది. అంటే చైనా ప్రతిఘటనవల్ల మన దళాలు గస్తీ తిరగలేక పోతున్నాయి. గత జనవరి నుంచి వాస్తవాధీన రేఖవద్ద మన పశువుల కాపర్లను చైనా పశువులను మేపుకోనివ్వడం లేదు. ఈ వార్తలను సైతం మోదీ ప్రభుత్వం ఖండిరచలేదు. చైనా చొరబడలేదన్న రాగమే ఆలపిస్తోంది. 2022 ఫిబ్రవరిలో బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ నేరుగా సమాధానం ఇవ్వకుండా 1962 నుంచి 38,000 చ.కి.మీ.ల భూభాగాన్ని ఆక్రమించింది అని డొంక తిరుగుడు సమాధానం చెప్పి నెహ్రూను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు. గత తొమ్మిదవ తేదీన అమిత్‌ షా చేసిన ప్రయత్నమూ అదే. 1962 లో చైనా యుద్ధ సమయంలో నెహ్రూ అస్సాం ప్రజలను గాలికి వదిలేశారు అన్నారు. మోదీ హయాంలో చైనా ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు అని దబాయించారు. వాస్తవాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దేశ సరిహద్దు, భద్రత విషయంలోనూ అబద్ధాలు చెప్పగలగడం మోదీ సర్కారు ప్రత్యేకత. విదేశాంగ మంత్రి చైనా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది కనక మనం ఎలా తలపడగలము అంటే అమిత్‌ షా, మోదీ హయాంలో ఒక్క అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదు అని అమిత్‌ షా వాస్తవాలను కప్పి పుచ్చి మోదీ భజనలో నిమగ్నమై పోతారు. ఇటీవలి కాలంలో పొరుగు దేశాలను ప్రస్తావించేటప్పుడైనా చైనా ఊసెత్తడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img