Friday, May 3, 2024
Friday, May 3, 2024

దిల్లీలో రాష్ట్రపతి పాలన?

మద్యం విధానం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయి జైలులో ఉన్నారు. అరెస్టు అయిన తరవాత కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తానంటున్నారు. జైలు నుంచి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇది అపూర్వమైన పరిస్థితి. పదవిలో ఉండగా అరెస్టయినన ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కేజ్రీవాల్‌ ఒక్కరే. ముఖ్యమంత్రులుగా ఉన్న వారిని ఇంతకు ముందు కూడా అరెస్టు చేశారు. కానీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు తప్పదని తెలిసిన తరవాత రాజీనామా చేశారు. కానీ కేజ్రీవాల్‌ ఇప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. మద్యం కేసులో ఆయన దోషిగా తేలితే రాజీనామా చేయక తప్పకపోవచ్చు. ఆయన జైలులో ఉన్నప్పటికీ నిందితుడే. అందువల్లే ఆయన రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. దిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన మనీశ్‌ సిసోడియా 13నెలలకు పై నుంచి జైలులోనే ఉన్నారు. జైలుకెళ్లిన కొన్నాళ్లకు ఆయన రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్‌ ఇప్పటికీ జైలులో ఉన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను కూడా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) అరెస్టు చేసింది. ఆరు నెలలు జైలులో ఉన్న తరవాత అత్యున్నత న్యాయస్థానం ఆయనను ఇటీవల బెయులుపై విడుదల చేసింది. ఆయన మీద ఇ.డి. మోపిన ఆరోపణలను సుప్రీంకోర్టు తుత్తినియలు చేసింది. అంతకు ముందు సంజయ్‌ సింగ్‌కు బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ నిరాకరిస్తే ఆయన సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకుని బెయిలు మీద విడుదలయ్యారు. మొన్న తనను ఇ.డి. అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ పెట్టుకున్న అర్జీ కూడా అదే న్యాయమూర్తి దగ్గర విచారణకు వెళ్లింది. తనను ఇ.డి.అరెస్టు చేయడం అక్రమం అని కేజ్రీవాల్‌ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసింది కూడా ఆమే. అయితే ఈ పిటిషన్‌ లో కేజ్రీవాల్‌ బెయిలు మంజూరు చేయాలని కోరలేదు కనక బెయిలు ప్రస్తావనే రాలేదు. కేజ్రీవాల్‌ మీద ఇ.డి. మోపిన ఆరోపణలలో వాస్తవం ఉందని న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ అభిప్రాయ పడ్డారు. కేజ్రీవాల్‌ బెయిలు కోరలేదు కనక ఆ న్యాయమూర్తిని తప్పు పట్టడానికి వీలు లేక పోవచ్చు. కానీ సుప్రీంకోర్టు ఇ.డి. వ్యవహారాన్ని తప్పు పట్టిన సందర్భాలను ఆ న్యాయమూర్తి పట్టించుకున్నట్టు లేదు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేజ్రీవాల్‌ నాయకత్వంలో 2015 నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలో ఉంది. కేంద్రంతో సహా అనేక చోట్ల తమ ప్రభుత్వాలు కొనసాగుతున్నప్పుడు దిల్లీలో తమకు అధికారం లేకపోవడాన్ని మోదీ నాయకత్వంలోని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. లెఫ్టినెంట్‌ గవర్నరుగా ఎవరున్నా కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. ఇది మోదీ సర్కారు ప్రమేయంతోనే అని చెప్పక్కర్లేదు. ఎలాగైనా సరే దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి మోదీ సర్కారు వేయని ఎత్తులేదు. పన్నని పన్నాగం లేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రులకు, శాసనసభ్యులకు భారీగా డబ్బు ముట్ట చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్న వార్తలు వచ్చాయి. ఇప్పటిదాకా కేజ్రీవాల్‌ అనుచరులెవరూ లొంగక పోవడం బీజేపీకి గొంతు దిగడం లేదు. మద్యం కుంభకోణం జరిగిందా లేదా, అందులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులకు డబ్బు ముట్టిందా లేదా అనేది ఇంకా తేలాల్సే ఉంది. సిసోడియాను, సంజయ్‌ సింగ్‌ ను, సత్యేంద్ర జైన్‌ ను అరెస్టు చేసి కేజ్రీవాల్‌ కు ఇ.డి. నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోక పోవడంతో కేంద్ర ప్రభుత్వ అహం దెబ్బ తిన్నది.
దిల్లీ ప్రభుత్వాన్ని త్వరలో బర్తరఫ్‌ చేయవచ్చునని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిషి అంటున్నారు. దిల్లీకి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో అనేక పాలనాధికారాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. కానీ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తానని కేజ్రీవాల్‌ భీష్మించుకు కూర్చోవడం కేంద్రాన్ని దిక్కు తోచని స్థితిలో పడేస్తోంది. అరెస్టు అయితే జైలు నుంచి పరిపాలించకూడదని రాజ్యాంగంలో ఏ నిబంధనా లేదు. కేజ్రీవాల్‌ ను జైలు నుంచి పరిపాలించకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్లను న్యాయస్థానాలు ఒకటికి రెండుసార్లు తోసి పుచ్చాయి. అది పరిపాలనకు సంబంధించిన అంశం కనక తాము జోక్యం చేసుకోబోమని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త దార్లు వెతుకుతోంది. ఒకటి: లెఫ్టినెంట్‌ గవర్నరుకు ఉన్న అధికారాలను వినియోగించేట్టు చేయడం. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా ఇప్పటికే అలాంటి సంకేతాలు ఇస్తున్నారు. జైలు నుంచి పరిపాలించకుండా చూస్తానని ఆయన దిల్లీ ప్రజలకు భరోసా ఇచ్చేశారు. రెండు: ఆమ్‌ ఆద్మీ పార్టీని ముక్కలు చేయడం. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు సభ్యులున్నారు. వీరిలో అయిదుగురు కేజ్రీవాల్‌ ను అరెస్టు చేయడంపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. వారి మౌనం వెనక బీజేపీ కుట్ర ఉండొచ్చు. మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన విధించడం కన్నా ప్రతిపక్ష పార్టీల చట్టసభల సభ్యుల్ని కొనేయడం, బాహాటంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. గోవా, మధ్య ప్రదేశ్‌ లో ఇంతకు ముందు జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనం. రాష్ట్రపతి పాలన విధిస్తే కేవలం ఆ ప్రభుత్వాలు పోతాయి. కానీ ఆమ్‌ ఆద్మీ పార్టీ సమైక్యంగా ఉంటే మళ్లీ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం ఖాయం అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమ అదుపాజ్ఞల్లో ఉన్న వారే అయినందువల్ల ఆయన ద్వారానే వ్యవహారం నడుపుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీని దెబ్బ తీయడానికే బీజేపీ నాయకత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుంది. అదే సమయంలో ఆ పార్టీని ఛిద్రం చేయాలని చూస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ ఎమ్మెల్యే పదవికే కాక ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీని వెనక కచ్చితంగా బీజేపీ హస్తం ఉండి ఉంటుంది. ముఖ్యమంత్రిని జైలుకు పంప గలిగినప్పుడు, మంత్రులు రాజీనామా చేయక తప్పని పరిస్థితి కల్పించగలిగినప్పుడు, వారిని జైలులో పెట్టగలిగినప్పుడు అంతిమంగా రాష్ట్రపతి పాలన విధించడం అసాధ్యమైంది కాకపోవచ్చు. కానీ బీజేపీ లక్ష్యం దిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మాత్రమే కాదు. ఆమ్‌ ఆద్మీ పార్టీని సర్వనాశనం చేయడం. అది ఏ రూపంలో జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img