Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

యుద్ధ రంగంలోకి ఇరాన్‌

ఆరు నెలలుగా పలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న యుద్ధ రంగంలోకి ఇరాన్‌ కూడా ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయిల్‌ ఏప్రిల్‌ ఒకటవ తేదీన సిరియాలోని డెమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌ దళాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు జనరల్‌ స్థాయి సైనికాధికారులు కూడా ఉన్నారు. అప్పుడే ఇరాన్‌ ఏదో ఒక రోజు పగ తీర్చుకుంటాం అని ప్రకటించింది. ఇరాన్‌ విప్లవ దళాలు శనివారం పర్షియన్‌ సింధు శాఖలో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉందంటున్న సరుకు రవాణా నౌక ఎంసీఎస్‌. ఏరిస్‌ ను ఇరాన్‌ నౌకాదళం ప్రత్యేక దళాలవారు స్వాధీనం చేసుకున్నారు. హెలీకాప్టర్ల మీంచి తాళ్ల సహాయంతో ఆ సరుకు రవాణా మీదకు దూకి ఆ నౌకను ఇరాన్‌ సముద్రజలాల వేపు పంపించారు. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ధ్రువీకరించింది. ఈ నౌకకు ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్నదని ఇరాన్‌ అంటోంది. ప్రపంచ వాణిజ్యానికి ఉపయోగపడే హోర్ముజ్‌ జలసంధి దగ్గర ఈ నౌకను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తీరంలో ఈ నౌకను స్థానిక అధికారులు స్వాధీనం చేసుకున్నారని సముద్రయాన భద్రతకు సంబంధించిన రెండు సంస్థలు ప్రకటించిన తరవాత ఆ వార్తను ఇరాన్‌ అధికారికంగా ధ్రువీకరించింది. గత ఏడాది అక్టోబర్‌ ఏడున ఇజ్రాయిల్‌ పలస్తీనియన్లకు ప్రాతినిధ్యం వహించే హమాస్‌పై యుద్ధం ప్రారంభించిన దగ్గర్నుంచి ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే వర్గాలకు, దళాలకు ఇరాన్‌ పరోక్షంగా సహాయం అందజేస్తోంది. కానీ ఇంతవరకు ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగలేదు. ఇప్పుడు ఇజ్రాయిల్‌తో సంబంధం ఉందంటున్న సరుకు రవాణా నౌకను స్వాధీనం చేసుకోవడంతో ఇరాన్‌ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అంబ్రే అనే భద్రతా సంస్థ ముగ్గురు వ్యక్తులు సరుకు రవాణా నౌక మీద దిగుతుండగా చూశామని తెలియజేసింది. హోర్ముజ్‌ జలసంధిలో నౌకలను స్వాధీనం చేసుకోవడానికి ఇరాన్‌ విప్లవ బలగాలు ఇలాగే హెలీకాప్టర్ల ద్వారా ఆ నౌకల మీదకు దిగిన ఉదంతాలు ఉన్నాయని ఆంబ్రే సంస్థ అంటోంది. నౌకల రాకపోకలను పరిశీలించే వెసెల్‌ ఫైండర్‌ డాట్‌ కాం, మెరైన్‌ ట్రాఫిక్‌ డాట్‌ కాం ఎం.ఎస్‌.సి. ఏరీస్‌ నౌకపై పోర్చుగీసు జెండా ఉందని చెప్తున్నాయి. ఈ రెండు వెబ్‌ సైట్లు పర్షియన్‌ సింధుశాఖలో నౌకల రాకపోకలను పరిశీలిస్తూ ఉంటాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న యెమెన్‌, లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని వివిధదళాలు ఇప్పటికే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో హమాస్‌కు మద్దతు ఇస్తూనే ఉన్నాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న యెమెన్‌లోని హైతి తిరుగుబాటుదార్లు ఎర్ర సముద్రంలో నౌకలమీద అనేకసార్లు డ్రోన్లతో దాడిచేశారు. హైతీలు గత నవంబర్‌లో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న గలాక్సీ లీడర్‌ అనే సరుకు రవాణా నౌకను స్వాధీనం చేసుకున్నారు. నౌకను స్వాధీనం చేసుకున్నప్పుడు బందీలుగా పట్టుకున్న వారిని ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇరాన్‌ ఇజ్రాయిల్‌తో పోరాడుతున్న హమాస్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయిల్‌ మీద ఆకస్మికంగా జరిగిన రాకెట్ల దాడితో తమకు సంబంధం లేదని చెప్తోంది. గత జనవరిలో ఓమన్‌ తీరంలో ఒక నౌకను ఇలాగే ఇరాన్‌ స్వాధీనం చేసుకుంది. అమెరికా తమ చమురు ‘‘దొంగిలిస్తోంది’’ అని ఇరాన్‌ వాదించింది.
డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద ఇజ్రాయిల్‌ దాడి చేసినప్పటి నుంచే ఇరాన్‌ ఎదురు దాడి ప్రారంభించవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ఇరాన్‌ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికాతో పాటు ఇతర గూఢచార సంస్థలు అంచనా వేశాయి. ఇరాన్‌ బహిరంగంగా యుద్ధ రంగంలోకి దిగితే ప్రస్తుత యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారక తప్పదు. పర్షియన్‌ సింధు శాఖలో ఉన్న అనేక దేశాలు అమెరికాకు వత్తాసు పలుకుతున్నప్పటికీ ఇరాన్‌ మినహా అన్నీ అరబ్‌ దేశాలే కనక యూదు ఉగ్రవాద రాజ్యం అయిన ఇజ్రాయిల్‌ మీద గుర్రుగానే ఉన్నాయి. జాతి సమస్య వచ్చేటప్పటికి ఈ దేశాలన్నీ ఏకమైనా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇరాన్‌ భూభాగం నుంచి యూదు రాజ్యం అయిన ఇజ్రాయిల్‌ మీద, దానికి మద్దతు ఇస్తున్న దేశాల మీద ఇరాన్‌ దాడికి దిగే అవకాశం ఉందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, బ్లూంబర్గ్‌ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ దాడి చేయవచ్చుననుకుంటున్నారు. ఇరాన్‌కు ఆయుధ సంపత్తికి కొదవ లేదు. రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణులు ఇరాన్‌ దగ్గర ఉన్నాయి. 1948లో ఇజ్రాయిల్‌ అవతరించిన దగ్గరి నుంచి ఇజ్రాయిల్‌ పలస్తీనియన్ల మీద, అరబ్బుల మీద దాడి చేస్తూనే ఉంది. గత అక్టోబర్‌లో హమాస్‌ రాకెట్లతో దొంగ దెబ్బ తీసిందని ఆరోపిస్తూ పలస్తీనియన్లను అంతమొందించే ప్రయత్నం చేస్తోంది. గాజా నగరాన్ని ఇప్పటికే సర్వ నాశనం చేసింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి రంజాన్‌ సందర్భంగా యుద్ధ విరామం పాటించాలని తీర్మానించినా ఇజ్రాయిల్‌ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇజ్రాయిల్‌ తీవ్రవాద రాజ్యంగా మారడానికి అవసరమైన ఆయుధ సంపత్తి సమకూరుస్తున్న అమెరికా ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూను సమర్థిస్తూనే ఉంది. ఇజ్రాయిల్‌కు అపారంగా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్‌ అక్రమ యుద్ధాన్ని ఆపమని కోరడం లేదు. ఇరాన్‌ ను మాత్రం యుద్ధ రంగంలోకి దిగకూడదంటోంది. ఒక వేళ ఇరాన్‌ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తోంది. హుటాహుటిగా యుద్ధం జరుగుతున్న ప్రాంతంలోని ఇజ్రాయిల్‌, అమెరికా దళాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. మధ్యధరా సముద్ర తూర్పు ప్రాంతంలోకి నౌకా విధ్వంసక యుద్ధ శకటాలను పంపించింది. అమెరికా దళాలకు రక్షణగా ఆయుధాలు పంపిస్తున్నామని అమెరికా చెప్పడం పచ్చి బూటకం. అసలు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో అమెరికా సైనిక దళాలకు పనేముంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. యుద్ధ రంగంలోకి దిగకుండా ఇరాన్‌ను నివారించడానికి స్విట్జర్లాండ్‌ ద్వారా అమెరికా సందేశాలు పంపుతోంది. ఇజ్రాయిల్‌, సౌదీ అరేబియా, ఖతార్‌ లాంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా దుష్ట పాత్రే లేకపోతే ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ విర్రవీగే అవకాశమే ఉండేది కాదు. యుద్ధం లేకపోతే ఆయన ఇప్పటికే పదవీచ్యుతుడయ్యే వాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img