Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఎన్నికల బాండ్లపై మోదీ నోటి వాటం

ఎన్నికల బాండ్లు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమైనవని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచి గత ఫిబ్రవరి 15న అనుమానాలకు తావు లేకుండా తీర్పు చెప్పినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ తీర్పును పరోక్షంగా తప్పు పడుతూనే ఉన్నారు. ఎన్నికల బాండ్ల పథకమే లేకపోతే ఎన్నికల వ్యవస్థలో నల్ల ధనం ఏరులై పారుతుందని కడవల కొద్దీ కన్నీళ్లు కూడా కారుస్తున్నారు. ఇది కచ్చితంగా సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయాన్ని సవాలు చేయడమే. ఆ తీర్పును పాటించాలన్న ఉద్దేశం బీజేపీకి ఏ కోశానా ఉన్నట్టు లేదు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మూడోసారి అధికారం దక్కితే ఎన్నికల బాండ్ల పథకాన్ని మరో రూపంలో తీసుకొచ్చినా ఆశ్చర్య పడనక్కర్లేదు. ప్రధానమంత్రి మోదీతో అంతగా సఖ్యత లేదనుకుంటున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబోలె సుప్రీంకోర్టు తీర్పు తరవాత కూడా రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల పథకాన్ని గట్టిగా సమర్థిస్తూనే ఉన్నారు. ఏ ముఖ్యమైన అంశం మీదా నోరు విప్పే అలవాటు లేని ప్రధానమంత్రి కూడా అన్యాపదేశంగా సుప్రీంకోర్టును తప్పు పట్టారు. బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంలో ఎన్నికల వ్యవస్థలో నల్లడబ్బు పాత్ర లేకుండా చేయడమేనని ఇల్లెక్కి అరిచి మరీ చెప్పారు. అధికారంలో ఉన్న గత పదేళ్లుగా ఎన్నడూ మీడియా ముందుకు రాని ప్రధానమంత్రి అప్పుడప్పుడూ తనకు ఇష్టమైన, లేదా తనను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగరు అని నమ్మకం ఉన్న పత్రికలకో, మీడియా సంస్థల ప్రతినిధులకో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ‘‘రాజ్యాంగ విరుద్ధమైన’’ ఎన్నికల బాండ్ల పథకాన్నీ సమర్థించడానికి మళ్లీ మోదీ అదే మార్గం ఎన్నుకున్నారు. ప్రభుత్వానుకూలమైన ఎ.ఎన్‌.ఐ. వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాండ్లను గట్టిగా సమర్థించారు. నల్ల ధనాన్ని అదుపు చేయడమే ఈ బాండ్ల ఉద్దేశమని గట్టిగా వాదించారు. నల్ల ధనాన్ని అదుపు చేయడానికి ఎన్నికల బాండ్లే శరణ్యమని తాము ఎప్పుడూ చెప్పలేదని, ఏ పథకంలోనైనా లోపాలు ఉండొచ్చునని, వాటిని సరిదిద్దుకోవచ్చునని ఎ.ఎన్‌.ఐ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తెలియజేశారు. నిజాయితీగా ఆలోచిస్తే ఈ పథకాన్ని వ్యతిరేకించడం పొరపాటని అందరూ గ్రహిస్తారని కూడా ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పారు. ప్రతిపక్షాలను విమర్శించడం మోదీకి సర్వ సాధారణమైన అంశమే కానీ ఈ విమర్శల అసలు లక్ష్యం ప్రతిపక్షాలు కాదని ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టును దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం అవుతూనే ఉంది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు సమకూరిన మొత్తంలో జ్యేష్ఠ భాగం అంటే 85 శాతం పైగా బీజేపీ ఖాతాలోకే వెళ్లిందని సుప్రీంకోర్టు తీర్పు తరవాత దఫ దఫాలుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.బి.ఐ.) వెల్లడిరచిన సమాచారం ద్వారా స్పష్టం అయింది. నష్టాల్లో మునిగిన కంపెనీలు, పేరుకు మాత్రమే అస్తిత్వంలో ఉన్న డొల్ల కంపెనీలు భారీగా బీజేపీకి ఎన్నికల బాండ్లు సమర్పించుకున్నాయన్న వాస్తవం బీజేపీకి నిద్ర పట్టకుండా చేసింది. తమ బండారం బయట పడ్డందుకు ఆ పార్టీకి దిమ్మ తిరిగినట్టయింది. వివిధ కంపెనీల మీద ముందు దర్యాప్తు సంస్థలు దాడిచేసిన తరవాత రాజకీయ పార్టీలకు విరాళాలు ముట్ట చెప్పాయన్న అంశాన్ని మోదీ చాలా చాకచక్యంగా వినియోగించుకుని ప్రతిపక్షాల మీద దాడికి దిగారు. ఇలా దాడికి గురైన 16 సంస్థలు ఇచ్చిన విరాళాల్లో 37 శాతం మాత్రమే బీజేపీకి అందాయని, మిగతా 63 శాతం ప్రతిపక్ష పార్టీల ఖజానాలోకి వెళ్లాయని మోదీ అంటున్నారు. ఈ మాట నిజమే అనుకున్నా మోదీ ప్రతిపక్ష పార్టీలు అంటున్నవి ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నవే. అంటే అసలు ఎన్నికల బాండ్ల పథకమే అధికారంలో ఉన్న పార్టీలు విరాళాలు దండుకోవడానికి అనువుగా రూపొందించదన్న వాస్తవాన్ని మోదీ వాటంగా కప్పిపుచ్చారు.
ఎన్నికల బాండ్ల పథకం నిజానికి సఫలమైందని, దీనివల్ల ఏ పార్టీకి ఏ కంపెనీ, లేదా ఎవరు ఎంతెంత విరాళం ఇచ్చారో తెలుసుకోవడానికి ఉపయోగపడిరదని ‘‘రాజ్యాంగ విరుద్ధమైన’’ పథకాన్ని మోదీ సమ్మతించారు. అంటే సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టినట్టే. ‘‘ఎన్నికలలో నల్లడబ్బు పాత్ర చాలా ప్రమాదకరమైందన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఎన్నికలలో అన్ని పార్టీలు, అభ్యర్థులూ డబ్బు ఖర్చు పెడ్తాయి. మా పార్టీ కూడా ఖర్చు పెడ్తుంది. ఖర్చు పెట్టాలంటే ఆ డబ్బు ప్రజల దగ్గర తీసుకోవలసిందే. ఎన్నికలలో నల్ల డబ్బు ప్రమేయం లేకుండా చేయడానికి నేను ఓ ప్రయత్నం చేసి ఎన్నికల బాండ్లు తీసుకొచ్చాను. ఈ చిన్న దారి కనిపించింది. ఇది పూర్తిగా లోప రహితమైన పద్ధతి నేను ఎన్నడూ చెప్పలేదు’’ అని మోదీ ఎ.ఎన్‌.ఐ.కి ఇచ్చిన ఇంటర్‌ వ్యూలో గొప్పగా చెప్పుకున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు సమర్థించిన కొన్ని పక్షాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయని మోదీ విమర్శలకు దిగారు. 2016లో రూ.1,000, రూ.2,000 విలువగల పెద్ద నోట్లను రద్దుచేసి నల్ల ధనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశామని గొప్పగా చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ పెద్ద నోట్లే ఎక్కువగా తరలించేవారని కూడా అన్నారు. రద్దుచేసినవాటిలో రూ.500 నోట్లున్నాయి. నల్ల డబ్బును అదుపు చయడానికే పెద్ద నోట్లను రద్దు చేశామని మోదీ చెప్పుకున్నారు. విచిత్రం ఏమిటంటే పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు అసలు రూ.2,000 నోట్లు లేనేలేవు. అవి ఆ తరవాతే చెలామణిలోకి వచ్చాయి. అంటే పెద్దనోట్లు రద్దు చేస్తున్నామని చెప్పి అంతకన్నా పెద్ద నోట్లను మోదీ చెలామణిలోకి తేవడంలోని తర్కం ఏమిటో లోతుగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు లేని 2000 రూపాయల నోట్లను ప్రస్తావించడం ఏమరుపాటుగా జరిగిన అంశం కాదు. అది మోదీ అబద్ధ ప్రచారంలో భాగం. దాదాపు చెలామణిలో ఉన్న నోట్లన్నీ రిజర్వు బ్యాంకుకు తిరిగి వచ్చాయి. ఇందులో తెల్లవేవి? నల్లవేవి? ఈ ప్రశ్నలకు గత ఏడేళ్లుగా సమాధానం లేదు. చెక్కు రూపంలో విరాళాలు స్వీకరించాలనుకున్నాం కానీ విరాళాలు ఇచ్చేవారు ఈ చెక్కులు ఎవరిచ్చారో తెలిసిపోతుంది కనక ఇతర పార్టీలు తమ మీద అక్కసు పెంచుకోవఛ్ఛు కనక ఈ పద్ధతిని వ్యతిరేకించడంతో విరాళాలు ఎవరు ఎవరికి ఇచ్చారో తెలియని రీతిలో ఎన్నికల బాండ్ల విధానాన్ని రూపొందించామని మోదీ అడ్డంగా వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఈ విధానం దాపరికం లేనిది ఎలా అయిందో? సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే అది ఎన్నటికీ నిజం బయట పడేదే కాదు. తనకు అవసరమనుకున్నప్పుడు మోదీ ధారాళంగానే మాట్లాడతారు. అయితే అందులో అబద్ధాలే ఎక్కువ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img