Friday, May 17, 2024
Friday, May 17, 2024

అరకు పార్లమెంటు పరిదిలో సాగునీరు,త్రాగునీటి సమస్యతోపాటు రోడ్ల నిర్మాణపరిష్కారానికి ప్రాదాన్యత నిస్తా 


* ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు 
* వేల కోట్ల రూపాయలతో విశాఖ- రాయపూర్, రాజమండ్రి- విజయనగరం రహదారుల నిర్మాణం 
* సాలూరు బైపాస్ రోడ్డు పూర్తిచేసా: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 

విశాలాంధ్ర – పార్వతీపురం : అరకు పార్లమెంటు పరిధిలో సాగునీరు, త్రాగునీరు సమస్యలతో పాటు రోడ్ల నిర్మాణ సమస్యల పరిష్కారానికి ప్రాదాన్యత ఇస్తామని, పార్వతీపురం మన్యంప్రాంతంలో ఏనుగుల సమస్య పరిష్కారం చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని టిడిపి,బిజెపి, జనసేన, ఉమ్మడి ప్రచార సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడినని, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.తాను వ్యవసాయరంగంలోనూ జలవనరుల సంరక్షణకు చేసిన కృషికిగాను 9డాక్టరేట్లు పొందినట్లు తెలిపారు తాను కేంద్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేశానని, అప్పట్లో నాలుగు సార్లు సందర్శన కూడా చేశానన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు కలగానే మిగిలిపోయింది అన్నారు. మోడీ హయాంలోనే భారతదేశం ఎనలేని అభివృధ్ది చెందినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డిఎ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పారు.ఈప్రాంతంలో విశాఖపట్నం- రాయపూర్ జాతీయరహదారి విస్తరణ పనులకు 35వేల కోట్లు రూపాయలు మంజూరుచేసి పనులు చేయడం జరుగుతుందన్నారు. దీంతోపాటు రాజమండ్రి-విజయనగరం రోడ్డును కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా 22వేల కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అరకు నియోజకవర్గంలోని సాలూరు బైపాస్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేయడం జరిగిందన్నారు. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అమెరికా అభివృద్ధి చెందినదేశంగా, రిచ్ కంట్రీగా చెప్పడానికి ప్రధాన కారణం అక్కడ ఉండే రోడ్లేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టిడిపి,బిజెపి,జనసేనకూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. అరకు ఎంపీగా పోటీచేస్తున్న కొత్తపల్లి గీతను, పార్వతీపురంఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బోనెల విజయ్ చంద్రను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన ఉపన్యాసాన్ని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అనువాదం చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఇంచార్జి ఎం.పరుశురాంరాజు, జిల్లా బిజెపిఅధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నేతలు బి శివన్నారాయణ, పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జి, కొత్తకోట తిరుపతిరావు, భానోజీరావు, సొండి సంజీవి మాస్టారు,సాలూరు మాజీఎమ్మెల్యే ఆర్ పి భంజదేవ్, కురుపాం టీడీపీ నేత వీరేష్ దేవ్,జనసేననేత పాలూరు బాబు, టిడిపినేతలు ద్వారపురెడ్డి శ్రీదేవి, గొట్టాపు వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖనుండి పార్వతీపురం హెలికాప్టర్ ద్వారా విచ్చేసిన కేంద్రమంత్రి గడ్కరీ ప్రచార సభకు పెద్దఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img