Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

సర్వ వ్యాప్త అరాచకం

ప్రత్యుర్థులవల్లో, ప్రభుత్వం నుంచో, పోలీసుల నుంచో, మరొకరినుంచో ప్రాణ భయం ఉన్నవారు జైలే సురక్షితం అనుకుంటారు. కానీ జైళ్లు కూడా సురక్షితంగా లేవు. జైళ్లల్లో ఎన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నా కుమ్ములాటలు, దాడులు, కొన్ని సార్లు హత్యలూ జరిగిపోతూనే ఉంటాయి. న్యాయస్థానాల్లోనూ భద్రత కరువే. దేశ రాజధాని దిల్లీలోని రోహిణి కోర్టులో ఆవరణలోనే కాదు సాక్షాత్తు విచారణ జరుగుతున్న కోర్టు హాలులో శుక్రవారం జితేందర్‌ జోగీ అనే ఓ ఖైదీని, ముఠా నాయకుడిని టిల్లూ గాంగ్‌ అనే మరో ముఠాకు చెందిన ఇద్దరు అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపారు. కోర్టు ఆవరణలోకి ఆయుధాలు తీసుకుని ఎలా ప్రవేశించగలిగారు అన్నవి చొప్పదంటు ప్రశ్నలే. వాటికి సమాధానాలు వెతకడం మొదలుపెడితే భద్రతా లోపాలు అడుగడుగునా కనిపిస్తాయి. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీని భద్రత లేనందువల్ల హతమార్చలేదు గదా. ప్రధానులకు, మాజీ ప్రధానులకు భద్రతకు కొదవ ఉండదు కదా. ప్రతీకార కాంక్ష ఎంతటి భద్రతా వలయాన్ని అయినా ఛేదించగలదని అనేక మంది రాజకీయ నాయకుల హత్యలు నిరూపించాయి. ప్రత్యర్థిని ఎలాగైనా మట్టుబెట్టాలన్న దృఢ సంకల్పం ఉంటే భద్రతా వలయాలు కూడా బలాదూరే. దిల్లీ కోర్టులో హత్యకు గురైన జితేందర్‌ జోగీ కరడుగట్టిన నేరస్థుడు, ముఠా నాయకుడు. ఆయనను విచారణ కోసం తీసుకొచ్చారు. ఇలాంటి వారిని కోర్టులో ప్రవేశపెడ్తున్నప్పుడు తగినంత భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా జితేందర్‌ జోగీకి ప్రత్యర్థి ముఠా అయిన టిల్లూ ముఠాకు చెందిన ఇద్దరు కోర్టు హాలులోకి న్యాయవాదుల వేషాల్లో వచ్చి జితేందర్‌ జోగీని హతమార్చారు. భద్రతా సిబ్బంది ఆ ఇద్దరు హంతకులను కడతేర్చడం రికార్డుల్లో రాసుకోవడానికి మాత్రమే పనికొచ్చే వివరం. లాయర్ల రూపంలో ఉన్న ఆ ఇద్దరూ జితేందర్‌ జోగీ మీద మూడు సార్లు కాల్పులు జరిపారు. జితేందర్‌ జోగీకి భద్రత కల్పించడానికి నియమితులైన ప్రత్యేక పోలీసు దళం వారు వారిద్దరినీ కాల్చి చంపారు. వారి విధి నిర్వహణలో లోపం ఉందనలేం. ఇంతకీ విచిత్రం ఏమిటంటే జితేందర్‌ జోగీ, టిల్లూ ఇద్దరూ కళాశాలలో ఉండగా ఒకప్పుడు మిత్రులే. హత్యలకు, దాడులకు పాల్పడే వారికి మిత్రులు, శత్రువులు అనే విచక్షణ ఉండదు. మొత్తం మీద 30 తూటాల దాకా పేలాయి. జితేందర్‌ జోగీ మీద అనేక నేరారోపణలున్నాయి. ఏడాది కాలంగా తీహార్‌ జైల్లో ఉన్నాడు. కోర్టులో ప్రవేశాల ద్వారాల దగ్గర మెటల్‌ డిటెక్టర్లు ఉంటాయి. అవి పని చేసి ఉండకపోవచ్చు. వాటి కన్నుగప్పి లోపలికి ప్రవేశించడానికి ‘‘కార్యదక్షులైన’’ హంతకులు ప్రత్యామ్నాయ మార్గం కనిపెట్టి అయినా ఉండొచ్చు. ఇవన్నీ ఆశ్చర్య పోవడానికి పనికొచ్చే మాటలే తప్ప నేర నిరోధానికి కాణీకైనా కొరగాలేదుగా! ఇంకా నయం, ఈ హత్యాకాండనంతా చిత్రించడానికి కోర్టు హాలులో కెమెరాలు పని చేశాయి. ప్రధాన నిందుతులూ ప్రాణాలతో లేరు కనక ఈ కెమెరాల్లో ఉన్న సమాచారం కూడా దర్యాప్తు నివేదికల పేజీలు నింపడానికి మాత్రమే ఉపయోగపడ్తుంది. భద్రతా దళాల వారు జరిపిన కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.
పోనీ జైళ్లన్నా సురక్షితంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అక్కడా దొమ్మీలు, హత్యలు, కారణం కనిపించని మృత్యువులు దండిగానే ఉంటాయి. గత మే 15వ తేదీన బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్‌ అన్సారీ ముఠాకు చెందిన ఓ వ్యక్తితో సహా ముగ్గురు ఖైదీలు చిత్రకూట్‌లోని రగౌలీ జైలులో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఈ హత్యల తరవాత ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ‘‘తక్షణం స్పందించి’’ ఇద్దరు జైలు అధికారులను సస్పెండ్‌ చేసింది. అన్షు దీక్షిత్‌ అనే ఖైదీ అలీ, కాలా అనే ఇద్దరిని కాల్చేశాడు. దీక్షిత్‌ను పోలీసులు కాల్చేశారు. లెక్క సమమై పోయిందిగా. నేరస్థుడికి శాస్తి జరిగినట్టే గదా! జైలులో ఉన్న వ్యక్తి దగ్గర తుపాకీ ఎక్కడిదో తెలుసుకోవడానికి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు కొంతమేర జరిగిన తరవాత నేరాలను ‘‘ఏ మాత్రం సహించని’’ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైలు సూపరింటెండెంటును, జైలర్‌ను సస్పెండు చేశారు. దీక్షిత్‌ అల్లా టప్పా నేరస్థుడేం కాదు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్‌ అన్సారీతో కుమ్మక్కై బీజేపీ శాసనసభ్యుడు కృష్ణానంద్‌ రాయ్‌ను మట్టు బెట్టాడు. ఈ హత్య వరస హత్యల్లో భాగం. బిహార్‌లో సమాచార హక్కుని విరివిగా ఉపయోగించుకుని ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి సమాచారం కోసం దాదాపు 90 దరఖాస్తులు చేసిన బిపిన్‌ అగర్వాల్‌ను బిహార్‌లోని తూర్పు చంపారన్‌ జిల్లాలోని హర్సిద్ధీలో శుక్రవారం కడతేర్చారు. హత్య చేసిన వారు సహజంగానే గుర్తు తెలియని వారే. మోటారు సైకిల్‌ మీద వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. బిపిన్‌ అగర్వాల్‌ తనకు ప్రాణాపాయం ఉందని అనుమానించి ఇటీవలే తనకు భద్రత కల్పించాలని అభ్యర్థించాడు కూడా.
క్రియాశీలమైన సమాచార హక్కు కార్యకర్తలను హతమార్చడం ఇది మొదటి సారేం కాదు. నిజం భయటపెట్టే వారు నిర్భయంగా వ్యవహరిస్తున్నామనుకుంటారు కానీ వారికి అడుగడుగునా ప్రాణ భయం పొంచే ఉంటుంది. జైళ్లల్లో ఉన్న ఖైదీలకు బయటకెళ్లే అవకాశం ఒక్కటే ఉండదు కానీ ధనబలమో, కండబలమో ఉంటే సకల సదుపాయాలు ఇట్టే అమరి పోతాయి. ఏ కొదవా ఉండదు. జైళ్లను నిర్వహించే వారు సైతం ఈ సమాజంలోని మనుషులే కదా. సమాజంలో వ్యక్తమయ్యే రుగ్మతలు వారికీ అంటుకుంటాయి. గత ఆగస్టు నాల్గో తేదీన తీహార్‌ జైలులోని 29 ఏళ్ల ఖైదీ అంకిత్‌ గుజ్జర్‌ కూడా జైలులోనే శవమై తేలాడు. గుజ్జర్‌ మీద బీజేపీ నాయకుడు విజయ పండిత్‌ను హతమార్చాడన్న ఆరోపణ ఉంది. గుజ్జర్‌ను జైలులో చితకబాదినందువల్లే మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలు అధికారులు ఆయనను పది వేలిమ్మన్నారట. ఆయన ఇవ్వనంటే బెదిరించారట. జైలు సిబ్బందిని బెదిరించి బతికుండాలను కోవడం అత్యాశే కదా. ఖైదీల దగ్గరికి తుపాకులు చేరతాయి. మొబైల్‌ ఫోన్లు చేరతాయి. వాటి చార్జర్లూ చేరతాయి. కత్తులూ కఠార్లూ చేరతాయి. జైలు సిబ్బంది చేయి తడిపితే జైలులోనూ ఏ కొరతా ఉండదు. అవినీతి మహత్యం అంటే ఇదే. జితేందర్‌ జోగిని చంపిన వారు నేరస్థులు కావచ్చు. న్యాయవాదుల వేషంలో కోర్టు హాలులోకి ప్రవేశించి ఉండవచ్చు. కానీ కోర్టుకు హాజరవుతున్న కన్హయ కుమార్‌ మీద దాడి చేసింది న్యాయవాదులే కదా. వారి మీద చర్య తీసుకున్న సమాచారం ఎవరిదగ్గరైనా ఉంటే ఆశ్చర్యపడాలి. దిల్లీలో పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటినే చిందరవందర చేయగలిగినప్పుడు సామాన్యులు ఒక లెక్కా. వర్ధిల్లుతున్నది అశాంతే కదా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img