Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బధిర శంఖారావం

ప్రజాస్వామ్యం అన్న మాటకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్వచనం, అధికారపక్షంగా ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధమైన నిర్వచనం చెప్పడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అలవాటై పోయింది. ప్రజాస్వామ్యం అంటే అధిక సంఖ్యాక (మెజారిటీ) వర్గం మాట చెల్లుబాటు కావడం ప్రభుత్వాలు ఏర్పడడానికి ఉపకరించేదే తప్ప అల్పసంఖ్యాకులుగా ఉన్న వారి మాట వినగూడదని కాదు. నిజానికి అల్పసంఖ్యాక వర్గాల అభిప్రాయాన్ని పరిగణించడమే అసలైన ప్రజాస్వామ్య లక్షణం. కానీ చట్టసభల్లో ఏ పార్టీకి విపరీతమైన మెజారిటీ ఉన్నా ఆ పార్టీ ప్రభుత్వాలు, నాయకులు ప్రతిపక్షాలను ఖాతరు చేయని సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయి. సమా జంలో ఆఖరి పంక్తిలో ఉన్న వారి సంక్షేమం కోసం పాటుపడడం సంక్షేమ రాజ్యం అంతిమ లక్ష్యం కూడా. కానీ చట్టసభల్లో ఉన్న మెజారిటీ ఆధారంగా ప్రభుత్వ నిధులతో అమలు చేసే కార్యక్రమాలకు అధికార పార్టీ రంగు పుల మడం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. దీనికి న్యాయస్థానాలు అడ్డు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో అయితే ప్రభుత్వ పథకాలవల్ల ప్రయోజనం పొందే వారికి వారి బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం కదా ప్రజలకు ఇక ఇబ్బందేమిటి, మాకు అనుగుణంగా నడుచుకోవాలి కదా అని వాదించడం కేంద్రంలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ చూస్తున్నాం. నేరుగా నగదు బదిలీవల్ల లబ్ధిదార్లకు అందవలసిన డబ్బు మధ్యలో దారి మళ్లడం ఆగిపోయి దుర్వినియోగం చాలా వరకు తగ్గిందనే అనుకోవాలి. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రజలకు ఏదో ప్రత్యేక మేలు చేస్తున్నట్టు కాదు. ప్రభుత్వం నుంచి సదుపాయాలు అందుకోవడం ప్రజల హక్కు. ఓట్లు సంపాదించే దృష్టితో జనాకర్షక పథకాలు అమలు చేసే రోజులు ఒకప్పుడు ఉండేవి. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలూ అనుసరిస్తు న్నందువల్ల జనాన్ని ఆకర్షించడానికి కొత్త మార్గాలు అన్వేషించవలసిన అవసరం వచ్చింది. అందులో భాగమే ఇదివరకే అమలవుతున్న పథకాలకు ఒకటో రెండో అంశాలు కొత్తగా జోడిరచి కొత్త పథకం కింద అమలు చేసి జనాదరణ ఆశించడం. ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే జనానికి ఇంకా లోటేమిటి, మాకే విశ్వాస పాత్రులుగా ఉండాలన్న ధోరణి అధికార పక్ష నాయకులలో పెరిగిపోతోంది. అందుకే ప్రజాందోళనలను పట్టించుకోవడం లేదు. దీనికి ఉత్తమ ఉదాహరణ దిల్లీ సరిహద్దుల్లో పది నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన. ప్రధానమంత్రి మోదీ ఈ విషయమై స్పందించడం తన బాధ్యత కాదనుకుంటారు. అల్పసంఖ్యాకవర్గాల మీద మూక దాడులు చేసి హత్య చేయడం మొదలైన హేయమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా మోదీ పెదవి విప్పరు. ఒక వేళ విప్పిన సందర్భాలు ఒకటో రెండో ఉన్నా వాళ్లను ఎందుకు చంపుతారు కావాలంటే నన్ను చంపండి అంటారు. పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలు పెరగడం రోజువారీ వ్యవహారం అయింది కనక ప్రజలు కూడా అలవాటు పడిపోయినట్టున్నారు. ‘‘ప్రజలు తిరగబడడం లేదంటే దానర్థం ప్రజలకు ఇబ్బందులు లేవని కాదు, బండబారిపోయారు. అంతే.’’ అన్నారు బెర్ట్రండ్‌ రసెల్‌. ఈ మాట ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతుంది.
ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే వంత పాడడం నేర్చుకున్నాయి. కేంద్రంతో సఖ్యంగా ఉంటే కాసిన్ని నిధులు విదల్చకపోతారా, మన మీద ఉన్న కేసులను అటకెక్కిస్తారు కదా అన్న ఆశే ఈ ధోరణికి కారణం. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పాలనలో నగదు బదిలీ మేరకు ప్రజల్లో సంతృప్తి ఉండొచ్చు. కానీ అనేక సమస్యల మీద జనం ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానమంత్రి మోదీని ఆదర్శంగా తీసుకుని చాలా వరకు నోరు మెదపకుండానే ఉండిపోతారు. సంక్షేమ పథకాలు, నగదు బదిలీ లాంటివి జనానికి ఊరట కలిగించవచ్చు. కానీ తెలియకుండానే ధరల పెరుగుదల జనం నడ్డి విరుస్తోంది. దీని మీద ప్రతిపక్షాలు అడపాదడపా ఆందోళన చేస్తూనే ఉన్నా ఫలితం ఏమీ కనిపిం చడం లేదు. ఇవి కాక కేంద్రంలో ప్రభుత్వ ఆస్తులను నగదుగా మార్చడం మొదలు లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలని సైతం ప్రైవేటీకరించే కిరాతకమైన విధానాలు దీర్ఘ కాలికంగా ప్రజలపై భయంకరమైన ప్రభావం చూపుతాయి. మన రాష్ట్రంలోని ఉదాహరణే తీసుకుంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచన తెలుగు వారిని కలవర పరచడమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బ తీస్తోంది. ఒక వైపున ప్రైవేటీకరించి తీరతాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే జగన్‌ ప్రభుత్వం మాత్రం లాంఛనంగా శాసనసభలో తీర్మానం ఆమోదించి ఆ తరవాత కిమ్మనదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా ఆందోళన కొనసాగు తోంది. ఆ కర్మాగారంలో ప్రధానమైన కార్మిక సంఘాలు మూడిరటితో పాటు మొత్తం మూడు డజన్ల కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ కలిసికట్టుగానే ఉద్యమిస్తున్నాయి. అందులో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు కూడా ఏదో ఒక స్థాయిలో పాల్గొంటున్నాయి. కానీ కేంద్రం అడ్డగోలుగా ప్రైవేటీ కరించే ధోరణిని, అడ్డగోలు విధానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంటులో వ్యతిరేకించదు. వామపక్షాలు మాత్రమే సూత్రబద్ధమైన పోరాటం చేస్తుంటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఉద్యమించడంలో సీపీఐతో పాటు వామపక్ష పార్టీలే భీకరమైన పోరాటాలు చేశాయి. ఇప్పుడు ప్రైవేటీకరించే ప్రతిపాదనను ఎదుర్కోవడంలో భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర వామపక్షాలే నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాయి.
సెప్టెంబర్‌ 11 నుంచి మొదలుపెట్టి వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు, కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే కార్మిక స్మృతి, నడ్డి విరిచే ధరలు మొదలైన అంశాలపై సీపీఐ వీరోచితమైన పోరాటం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, ఆందోళనలు జరిగాయి. కానీ ప్రభుత్వం ఉలకదు పలకదు. ఈ జనాందోళనలో సీపీఐ జాతీయనాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రజలనుంచి మంచి స్పందన కనిపించింది. 200 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణోద్యమం లోనూ సీపీఐ నిర్ణయాత్మక పాత్రే పోషిస్తోంది. మరో వేపున అమరావతినే రాజధానిగా ఉంచాలని అయిదువందల రోజులుగా కొనసాగుతున్న ఉద్యమంలో సీపీఐ పాత్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. ప్రజాపోరాటాల ఆధారంగా ఇటీవల అగ్రీగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారం కావడం మొదలైంది. ఈ ఉద్యమమూ సీపీఐ నాయకత్వంలో జరిగిందే. కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు విడివిడిగానూ ఉమ్మడిగానూ అనేక ప్రజాసమస్యల మీద ఉద్యమిస్తూనే ఉన్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వినిపించుకునే నాథుడే కరవయ్యాడు. కానీ ఒల్లని ప్రభుత్వాన్ని ఓటుతో, పాలకపక్షాలు దాన్ని అసాధ్యం చేసినప్పుడు పిడికిలిపోటుతోనైనా గద్దె దించే అధికారం ప్రజలకు ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించని ప్రభుత్వాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. ప్రజోద్యమాలు బధిర శంఖారావాలుగా మిగిలిపోవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img