Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

స్వయం విధ్వంసక కాంగ్రెస్‌

రాజస్థాన్‌లోని ఉదయ పూర్‌లో చింతన్‌ శిబిరం నిర్వహించి సంస్థాగత సంస్కరణలకు సిద్ధంగా ఉందన్న అభిప్రాయం కలి గించిన కాంగ్రెస్‌ షరా మామూలుగా రాజ్యసభకు అభ్యర్థులను నిర్ణయించే క్రమంలో పాత పద్ధతిలోనే వ్యవహరించింది. అంటే పార్టీని పునరుజ్జీవింప చేయడానికి వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్‌ వినియోగించుకోకుండా మళ్లీ అధిష్ఠానానికి విధేయులుగా ఉండే వారినే రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. కొత్త ఆలోచనలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే తాహతు కాంగ్రెస్‌కు లేవని మరోసారి రుజువైంది. మే 13 నుంచి 15 దాకా ఉదయ్‌పూర్‌లో చింతన్‌ శిబిరం నిర్వహించినప్పుడు కాంగ్రెస్‌ ధైర్యంగా నిర్ణ యాలు తీసుకునే సాహసం చేయకపోయినా కొన్ని నియమాలు పెట్టు కుంటున్నట్టు కనిపించింది. ఒక కుటుంబంలో ఒకరికే స్థానం అన్న సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు పాటించనే లేదు. యు.పి.ఎ. హయాంలో ఆర్థిక, హోం శాఖల లాంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన పి. చిదంబరం కుమారుడు కార్తీ లోకసభ సభ్యుడుగా ఉన్నప్పటికీ మళ్లీ పి. చిదంబరానికి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి ఆయన గతంలో లాగా మహారాష్ట్ర నుంచి కాక తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి రాజ్య సభకు పోటీ చేయనున్నారు. రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగు తున్న దశలో అనుభవజ్ఞులైన చిదంబరం లాంటి వారు రాజ్యసభలో ఉండ వలసిన అవసరాన్ని కాదనలేం. కానీ చింతన్‌ శిబిర్‌ ప్రతిపాదన అటకెక్కి నట్టేగదా. అలాగే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రమోద్‌ తివారీని రాజస్థాన్‌ నుంచి రాజ్య సభకు పంపాలనుకుంటున్నారు. ఆయన కూతురు ఆరాధనా మిశ్రా ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ్యులుగా ఉన్నారు. తివారీ విషయంలోనూ ఒక కుటుంబానికి ఒకే పదవి అన్న నియమాన్ని పక్కన పెట్టారు. 2020లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసి పార్టీని ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని గుర్తు చేసిన 23 మంది బృందంలో ఉన్న సీనియర్‌ నాయకులు ఆనంద్‌ శర్మ, గులాం నబీ ఆజాద్‌కు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావించినట్టుంది. తిరుగుబాటు బావుటా ఎగురవేసినందుకు వారిని మినహాయించి ఉంటారేమో. కానీ సోనియా గాంధీకి ఎప్పటికప్పుడు రాజకీయ సలహాలిచ్చే బృందంలో వారికి స్థానం కల్పించారు. అసమ్మతి వ్యక్తం చేసిన జి-23 బృందంలోని వారిని బుజ్జగించడానికి సోనియా గాంధీ ఇటీవల వారితో చర్చోపచర్చలు జరిపారు. తిరుగుబాటు దార్లను అందరినీ మినహా యించారా అంటే అదీ లేదు. ముకుల్‌ వాస్నిక్‌ వంటి వారు ముందు అసమ్మతి వ్యక్తం చేసినా తరవాత విధేయత ప్రకటించినందుకు అవకాశం ఇచ్చినట్టున్నారు. కాంగ్రెస్‌ రాజ్యసభకు పోటీ చేసే 10 మంది జాబితా ప్రకటిస్తే అందులో ఏడుగురు తమ రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేసేవారే. రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది. స్థానికులను రాజ్యసభ అభ్యర్థులుగా నియమిస్తే ఆ ప్రభావం శాసనసభ ఎన్నికల మీద కూడా ఉండేదేమో. అక్కడ మూడు రాజ్యసభ సీట్లు గెలవడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఉంది. ఆ ముగ్గురూ ఇతర రాష్ట్రాల వారే కావడం కాంగ్రెస్‌ మునుపటి పద్ధతులను మార్చు కోవడానికి సిద్ధంగా లేదని రుజువైంది.
కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా హర్యానాకు చెందిన వారు. కానీ ఆయనను రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయిస్తున్నారు. ఆయన రాహుల్‌ గాంధీకి సన్నిహితులంటారు. అజయ్‌ మాకెన్‌ దిల్లీకి చెందిన వారు కాగా ఆయనను హర్యానా నుంచి పోటీ చేయిస్తున్నారు. హర్యానాకే చెందిన సూర్జే వాలా బదులు అజయ్‌ మాకెన్‌కు అవకాశం ఇవ్వడం వెనక కారణం లేకపోలేదు. అంటే సుర్జేవాలాకు సొంత రాష్ట్రంలోనే అనుకూల పరిస్థితులు లేవనే. భూపేందర్‌ సింగ్‌ హూడాను కాదని సోనియా గాంధీ కానీ, రాహుల్‌ గాంధీకానీ హర్యానాలో ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితి లేదన్న మాట. దీన్నిబట్టి స్థానిక నాయకులు బలంగా ఉన్న చోట అధినాయకత్వం మాట ఏ మాత్రం చెల్లదని అర్థమవుతోంది. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, ప్రమోద్‌ తివారీలో ఎవరూ ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు. ముకుల్‌ వాస్నిక్‌ మహారాష్ట్రకు, ప్రమోద్‌ తివారీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. రాజస్థాన్‌లో అప్పుడే రుసరుసలు మొదలైనాయి. రాజస్థాన్‌ లో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ సచిన్‌ పైలెట్‌ నాయకత్వంలో తిరుగుబాటు వర్గం బలంగా ఉంది. సచిన్‌ పైలెట్‌కు ముఖ్య మంత్రి కావాలన్న ఆశ ఉంటే అధిష్ఠానం అప్పుడు అశోక్‌ గెహ్లాట్‌కు అవ కాశం ఇచ్చినప్పటి నుంచి సచిన్‌ పైలెట్‌ అసంతృప్త జీవిగానే మిగిలి పోయారు. తిరుగుబాటు వర్గాన్ని బుజ్జగించడానికి రాజ్యసభ ఎన్నికలలో ఉన్న కొంత అవకాశాన్ని కూడా కాంగ్రెస్‌ వదులుకుంది. కవి ఇమ్రాన్‌ ప్రతాప్‌ ఘర్హీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. ఆయనకు అవకాశం ఇస్తే ముస్లింలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుందన్న అంచనా సరైందే కానీ ఆయనను మహారాష్ట్ర నుంచి రంగంలోకి దింపుతున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఆయన లోకసభకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. తమకు అవకాశం రానందుకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా, సినీ నటి నగ్మా బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఖేరా నిజానికి సత్తాగల అధికార ప్రతినిధి. టీవీ చర్చల్లో బీజేపీని ఎదిరించడానికి ఆయన బాగా ఉపకరిస్తారు. కానీ అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీనివల్ల పార్టీకోసం చిత్త శుద్ధితో పాటు పడే వారికి అవకాశాలు ఇవ్వరన్న అభిప్రాయం కలగవచ్చు. ఏ ఎన్నికలలోనైనా విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ధైర్యంగా ప్రకాశ్‌ జవదేకర్‌, ఓ.పి.మాథుర్‌, దుశ్యంత్‌ గౌరం, వినయ్‌ సహస్రబుద్ధే, శివ ప్రతాప్‌ శుక్లా, ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, సయ్యద్‌ జఫర్‌ ఇస్లాంకు అవకాశం ఇవ్వకుండా సాహసోపేతంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌లో ఆ చేవ కనిపించడం లేదు. ఈ సారి తనకు ఎటూ కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం లేదని కనిపెట్టిన కపిల్‌ సిబల్‌ ముందే జాగ్రత్త పడి సమాజ్‌ వాదీ పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ కంటే రాజ్యసభ సభ్యత్వమే ప్రధానం అన్న ఆత్మ జ్ఞానాన్ని సిబల్‌ దండిగా ప్రదర్శించారు. విశ్వాస పాత్రులను చేరదీసే క్రమంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ఏ మాత్రం ప్రజా బలం లేని వారిని భుజాన వేసుకుంటోంది. కాంగ్రెస్‌ను పీడిస్తున్న అసలు రుగ్మత ఇదే. గుడ్డిలో మెల్ల ఏమిటంటే పవన్‌ ఖేరా కాంగ్రెస్‌ను వదిలి వెళ్లే ఛాయలేమీ ఇప్పటికి కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img