Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆఖరి ఆశాకిరణం

డి.వై.చంద్రచూడ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తరవాత ఇటీవలి కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో చేస్తున్న ప్రసంగాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించే ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు అన్న భరోసా కలిగిస్తున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురూతూనే ఉన్నారు. ప్రధానంగా కొలీజియం వ్యవస్థ మీద విమర్శలు సంధిస్తున్నారు. కానీ ఇప్పుడు చట్టం ప్రకారం అమలులో ఉన్నది కొలీజియం వ్యవస్థేనని మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ కూడా అంటున్నారు. అనేకమంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలంతో పోలిస్తే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం 2024 నవంబర్‌ 10 దాకా ఉంది. అంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరవాత కూడా ఆయన కొన్ని నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. అందువల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడడానికి ఆయన ఏ మేరకు పాటు పడతారో గమనించవలసి ఉంది. రాజకీయ ప్రభావం చూపించే అనేక వ్యాజ్యాలను సుప్రీంకోర్టు తేల్చవలసి ఉంది. ఎన్నికల బాండ్ల కేసుపై విచారణ జరగాల్సి ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ అత్యుత్సాహాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్‌ అయిదున విచారణ జరగవలసి ఉంది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థల విరాళాల వ్యవహారం కూడా సుప్రీంకోర్టు పరిశీలించవలసి ఉంది. మోదీ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసం అవుతున్నాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య సౌధం రాయి రాయి విడగొట్టడంలో మోదీ సర్కారు నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలన్నీ మోదీ సర్కారు ఆత్మకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ కత్తి ప్రసిద్ధులైన ప్రతిపక్ష నాయకుల తలమీద వేలాడుతూనే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అధికారపక్షం అడుగులకు మడుగులొత్తడం మొదలై చాలాకాలమే అయింది. పార్లమెంటులో కార్యకలాపాలు కొనసాగడమే అబ్బురం అయిపోయింది. మీడియాలో ఎక్కువ భాగం మోదీ సర్కారు కీర్తిగానంలో తలమునకలై ఉంది. ఏపక్షం అధికారంలో ఉన్నా ప్రశ్నించే తత్వాన్ని పరిరక్షించుకోవలసిన మీడియా విచిత్రంగా ప్రశ్నలన్నింటినీ ప్రతిపక్షాలవేపే సంధిస్తోంది. న్యాయవ్యవస్థను కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని మోదీ సర్కారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ దశలో న్యాయవ్యవస్థను పరిరక్షించే ప్రధాన న్యాయమూర్తి ఉన్నారన్న ఆశ మిణుకుమిణుకుమంటోంది. 

న్యాయస్థానాలలో విచారణకువచ్చే కేసుల్లో ఎక్కువభాగం ప్రభుత్వానికి సంబంధించినవే అయిఉంటాయి. అలాంటి స్థితిలోనూ రాజ్యాంగ నిర్దేశాలను పాటిస్తూ అవసరమైతే ప్రభుత్వ పక్షాన్ని గట్టిగా నిలదీసే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. లేకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు పోరాడడం ఒక ఎత్తు. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను సుప్రీంకోర్టు ఏ మేరకు పరిరక్షిస్తోంది అన్నది మరో ఎత్తు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజల హక్కుల పరిరక్షణ గురించి గట్టిగానే మాట్లాడారు. ఆయన మాటలు అధికార పక్షం గొంతులో పచ్చి వెలక్కాయలా తయారయ్యాయి. చట్టబద్ధ పాలన గత చరిత్ర పుటల్లో కలిసిపోయే స్థితిలో ఉంది. విమానమెక్కిన కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరాను విమానంలోంచిదింపి మరీ అరెస్టు చేశారు. కానీ సుప్రీంకోర్టు మూడు గంటల వ్యవధిలోనే ఆయనను నిర్బంధించడానికి వీలులేదని చెప్పింది. అంతే కాకుండా పవన్‌ఖేరా మీద దాఖలైన ఎఫ్‌.ఐ.ఆర్‌.పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌, అసోం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారం ఇంకా ముగియలేదు. కానీ న్యాయం ఇంకా మిగిలే ఉందన్న ఆశా కిరణం కనిపించింది. కానీ ఇంతకు ముందు బెయిలు ఇవ్వడానికి చాలా ఉదంతాలలో విముఖంగా ఉన్న సుప్రీంకోర్టు ఇప్పుడు కాస్త ఉదారంగానే బెయిలు మంజూరు చేస్తోంది. గత పది పన్నెండు రోజులలో ప్రధాన న్యాయమూర్తి నాలుగు చోట్ల ప్రసంగించారు. ప్రతిచోటా భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛగురించి మాట్లాడారు. పౌర హక్కులను ప్రభుత్వం అణచివేయకూడదనీ హెచ్చరించారు. దాపరికంలేని విధానం గురించీ చర్చకు తెరలేపారు. రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కీలకాంశాలన్నింటిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో సీల్డ్‌ కవర్లో అందిస్తే వాటన్నింటినీ అంగీకరించేవారు. రాఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందన్నప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ చేసిన పని సీల్డ్‌ కవర్‌ను అంగీకరించడమే. దానికి తోడు రాఫేల్‌ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించిందని ప్రభుత్వం వాదిస్తే గొగోయ్‌ నోరు మెదపకుండా ఒప్పేసుకున్నారు. చంద్రచూడ్‌ ఈ పద్ధతిని నిరాకరించారు. సీల్డ్‌ కవర్‌లో సమాచారం ఇస్తే నిర్దిష్ట వ్యాజ్యంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో ఆ వ్యాజ్యంతో సంబంధం ఉన్న అవతలి పక్షానికి సమాచారం ఎలా అందుతుంది అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నిలదీశారు.
2015లో కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకంకోసం జ్యుడీషియల్‌ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. పార్లమెంటు ఉభయసభలూ దీన్ని ఆమోదించాయి. రాష్ట్రపతి సంతకం కూడా చేసినందువల్ల దానికి చట్ట ప్రతిపత్తి వచ్చింది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కేహార్‌ హయాంలోఈ న్యాయమూర్తుల నియామక కమిటీ చెల్లదని తీర్పు చెప్పేశారు. అప్పటినుంచే మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మీద కత్తి కట్టినట్టు ప్రవర్తించడం మొదలైంది. అలాంటి బిల్లు మళ్లీ తీసుకొచ్చే ఉద్దేశం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. కానీ కొలీజియం వ్యవస్థను తూర్పారబట్టడం మాత్రం మానలేదు. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించే విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మోదీ సర్కారుకు కళ్లెం వేసింది. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలకందం అయినప్పుడు ఎన్నికల కమిషన్‌ అధిపతులను ప్రభుత్వం తనంత తాను నియమిస్తే ఆ కమిషన్‌ కు స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించింది. అందుకే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషన్‌ అధిపతులను నియమించాలని కరాఖండిగా చెప్పింది. ఇది మోదీ గుండెలో శూలంలా దిగింది. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులుగా నియమించడానికి 12 పేర్లు సూచిస్తే కేంద్ర ప్రభుత్వ ఎనిమిదిమంది నియామకాన్నే ఖరారు చేసింది. అలాగే 35 పేర్లు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫార్సు చేస్తే అందులో అయిదుగురి పేర్లను ప్రభుత్వం తొక్కి పెట్టింది. కొలీజియం వీలైనంత దాపకరికం లేకుండా పనిచేయడానికి ప్రధాన న్యాయమూర్తి పాటుపడ్తున్నారు. ఒక ర్యాంకు ఒకే పింఛన్‌ అన్న సైనికుల వ్యవహారంలో కూడా సీల్డ్‌ కవర్లో సమాచారం ఇవ్వడాన్ని చంద్రచూడ్‌ ఆమోదించలేదు. తన పదవీకాలం ముగిసేదాకా ప్రధాన న్యాయమూర్తి ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్య సౌధంలో ఒక్క స్తంభం అయినా పదిలంగా ఉందన్న భరోసా ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img