Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కాంగ్రెస్‌లో రాజీనామాల వెల్లువ

మూడేళ్ల కింద జ్యోతిరాదిత్య సింధియాతో మొదలైన కాంగ్రెస్‌ నాయకుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైవీర్‌ షేర్గిల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జైవీర్‌ సింగ్‌ 39 ఏళ్ల యువ నాయకుడు. కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్‌ తరఫున అధికార ప్రతినిధిగా కనిపించడమే మానేశారు. అది ఆయనలో రగులుతున్న అసంతృప్తికి సంకేతం. అయినా అధిష్ఠానవర్గం ఆయన అసంతృప్తినిని తొలగించడానికి చేసిందేమీ లేదు. నిష్క్రియా పరత్వానికి కాంగ్రెస్‌ ప్రతీకగా మారి పోయింది. కాంగ్రెస్‌ లో ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్న తీరు ఆధునిక భారతంలో యువతరం ఆకాంక్షలకు అనువుగా లేదన్నది జై వీర్‌ షేర్గిల్‌ ప్రధాన ఆరోపణ. ‘‘కాంగ్రెస్‌ నిర్ణయాలు తీసుకుంటున్న తీరు ప్రజోపయోగకరంగా కానీ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా కానీ ఉండడం లేదు. కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల దృష్టితోనే సకల నిర్ణయాలూ జరిగిపోతున్నాయి. వాస్తవ పరిస్థితులకు కాంగ్రెస్‌ నాయకత్వ నడవడికకు బొత్తిగా పొంతనలేదు. ఈ పరిస్థ్తిని నేను నైతికంగా అంగీకరించలేను. అలాంటి పార్టీలో పని చేయలేను’’ అని జైవీర్‌ సింగ్‌ షేర్‌ గిల్‌ సోనియా గాంధీకి రాసిన లేఖలో తెలియజేశారు. పార్టీలో నానాటికీ పెరిగిపోతున్న వ్యక్తి ఆరాధన తనకు మింగుడు పడడం లేదని కూడా ఆయన దాపరికం లేకుండానే సోనియాకు రాసిన లేఖలో తెలియజేశారు.
కాంగ్రెస్‌ నుంచి వెళ్లి పోతున్న వారికి అనేక కారణాలు ఉండవచ్చు. అధికార పక్షంలో చేరితే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందనుకుని వెళ్లే వారూ ఉండొచ్చు. అలాంటి ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్‌ అస్తవ్యస్త పని తీరుతో సరిపెట్టుకోలేని వారూ పార్టీని వీడే వారిలో ఉన్నారు. తాజాగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ రాజీనామా చేయకపోయినా తమ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రక్రియ సారధ్య సంఘ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించారు. ఈ నియామకాలు కాంగ్రెస్‌ అధినాయకత్వం విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏక పక్షంగా చేసేసిందన్నది వారి ఫిర్యాదు. ఏకపక్షంగా వ్యవహరించడం కాంగ్రెస్‌ నాయకత్రయానికి అలవాటై పోయింది. నాయకత్వం తమ గుప్పెట్లోంచి జారవిడుచుకోవడం సోనియా గాంధీకి, ఆమె సంతానం రాహుల్‌ గాంధీకి, ప్రియాంకా గాంధీకి ఏ మాత్రం ఇష్టం ఉన్నట్టు లేదు. కాంగ్రెస్‌ అధినాయకత్వం అంటే ఈ ముగ్గురే. ఈ ముగ్గురిలో సోనియా గాంధీ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగానైనా ఉన్నారు. రాహుల్‌ గాంధీది మాజీ అధ్యక్ష హోదానే. 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆయన ఆ బాధ్యతలు మళ్లీ మోయడానికి సిద్ధంగా లేరు. కానీ ప్రధానమైన నిర్ణయాలు, రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలకు దిశా నిర్దేశం, తగవులు పరిష్కరించడం మొదలైన పనులన్నీ ఆయనే చక్కబెడ్తారు. ప్రియాంకా గాంధీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు. ఆమెకు ఉన్న బాధ్యతల రీత్యా చూస్తే ఆమె కార్య కలాపాలు ఉత్తరప్రదేశ్‌ కే పరిమితమైనవి. ఉత్తర ప్రదేశ్‌ లో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం తరవాత ఆమె ఉత్తరప్రదేశ్‌ వ్యవహారాలను కూడా పట్టించుకున్న ఉదంతాలే కనిపించడం లేదు. రాహుల్‌ గాంధీ మీద ముందు నుంచే పాక్షికంగా పనిచేసే రాజకీయ నాయకుడు అన్న ఆరోపణలు ఉన్నాయి. వారాలు, నెలల తరబడి ఆయన విదేశాలకు వెళ్లిపోతారు. ఆ సమాచారం వెళ్లే ముందూ, వెళ్లిన తరవాత జనానికి తెలియదు. అయితే కాంగ్రెస్‌ వాణి వినిపించడానికి వ్యక్తిగా రాహుల్‌ ఎన్నదగిన ప్రయత్నమే చేస్తున్నారు. రాఫెల్‌, పెగాసస్‌ లాంటి అంశాల మీద ఆయన దాదాపు ఒంటరి పోరాటం చేశారు. మోదీని నిలదీయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కానీ అపరిపక్వ నాయకుడు అన్న ముద్ర మాత్రం ఆయన చెరిపేసుకోలేక పోతున్నారు. సోనియాగాంధీ సాధారణంగా అసూర్యంపశ్య లాగే ఉండిపోతారు. పార్లమెంటు సమావేశాలకైతే హాజరవుతారు తప్ప మిగతా సమయంలో ఆమె ఎన్నడూ జనం మధ్యకు రారు. సీనియర్‌ నాయకులకూ ఆమె దర్శనభాగ్యం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. ఆమె అనారోగ్యం దీనికి ప్రధాన కారణం కావచ్చు. వచ్చే నెలలో ఏ.ఐ.సి.సి. మహాసభల్లోనైనా నాయకత్వం గురించి నికరమైన నిర్ణయం తీసుకుంటారన్న ఆశ కనిపించడం లేదు. నాయకత్వం సోనియా కుటుంబ పరిధి దాటడం ఆ కుటుంబానికే కాదు ఇతర కాంగ్రెస్‌ నేతలకూ ఇష్టం ఉన్నట్టు లేదు. కాంగ్రెస్‌లో నాయకులకు కొరత లేదు. కానీ వారిలో ఏకశ్రుతి పూజ్యం. ఆ కుటుంబం నాయకత్వం లేకపోయినా, అండ లేకపోయినా కాంగ్రెస్‌ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్న భయం కాంగ్రెస్‌ వారిని పీడిస్తోంది.
రాజీనామాల వరస మాత్రం కొనసాగుతూనే ఉంది. సింధియా తరవాత జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ కు సలాం కొట్టారు. వీరిద్దరూ బీజేపీలో చేరిపోయారు. అలా పార్టీ ఫిరాయించునందుకు ఆ ఇద్దరికీ బాగానే గిట్టుబాటైంది. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుంటే జితిన్‌ ప్రసాద ఉత్తరప్రదేశ్‌ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇటీవలే అశ్వినీ కుమార్‌, ఆర్‌.పి.ఎన్‌. సింగ్‌, కపిల్‌ సిబ్బల్‌ పార్టీని వీడి వెళ్లారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు 23 మంది సరిగ్గా రెండేళ్ల కింద అంటే 2020 ఆగస్టులో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు. పార్టీ వ్యవహార సరళిని నిలదీశారు. ఇందిరాగాంధీ కుటుంబానికి చెందినవారినికాకుండా ఇతర నాయకులెవరికైనా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తప్ప కాంగ్రెస్‌కు జవజీవాలు సమకూరవని నిర్మొహమాటంగానే తెలియజేశారు. జి 23 బృందం నాయకులను పిలిపించి సోనియా మాట్లాడిన మాట వాస్తవమే అయినా వారు లేవనెత్తిన అంశాలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కనిపించలేదు. అసమ్మతి వాదులను బుజ్జగించడానికే నాయకత్వం పరిమితం అవుతోంది. వరసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో, ఇటీవల శాసనసభ ఎన్నికలలో బీజేపీ చేతిలో పరాభవం జరిగినా దిద్దుబాటు చర్యల ఊసే లేదు. ఒక్క పంజాబ్‌లో మాత్రమే ఆమ్‌ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. జి 23 నాయకులు ఇటీవల కూడా సమావేశమై చర్చించారంటున్నారు. ఈలోగా చికిత్స కోసం సోనియా బుధవారం విదేశాలకు వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్‌, ప్రియాంక కూడా బయలు దేరారు. ఈ ముగ్గురు ఎప్పుడు తిరిగొస్తారో కూడా తెలియదు. వారు అందుబాటులో లేనప్పుడు బాధ్యులు ఎవరో తెలియదు. వచ్చే నెల జరగనున్న ఏ.ఐ.సి.సి. సమావేశానికి దిశా నిర్దేశం ఎవరు చేస్తారో, కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుందో లేదో కూడా అంతుబట్టదు. రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేని దశలో సోనియా గాంధీనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా ఎన్నుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img