Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంగ్రెస్‌ ఆధిపత్య ధోరణి

చింత చచ్చినా పులుపు చావలేదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ నిరూపిస్తున్నారు. గత సెప్టెంబర్‌ ఏడో తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర దిల్లీలో తొమ్మిది రోజుల విరామం తరవాత మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. 3500 కిలోమీటర్లు సాగవలసిన ఈ యాత్ర మరో నెలరోజులపాటు సాగవచ్చు. దక్షిణాదిలో, మహారాష్ట్రలో రాహుల్‌ భారత్‌ జోడోయాత్రకు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే కనిపించడంతో ఇక తమకు ఎదురులేదని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నట్టున్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే రాహుల్‌గాంధీయే ప్రతిపక్షాల తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అని ఏకపక్షంగా ప్రకటించేశారు. భారత్‌ జోడో యాత్రవల్ల కాంగ్రెస్‌లో కొత్త ఆశలు అంకురిస్తున్న విషయం నిజమే కావచ్చు. రాహుల్‌ గాంధీ వ్యవహార సరళిలో మార్పుతీసుకురావడానికి కూడా ఈ యాత్ర తోడ్పడి ఉండవచ్చు. కునారిల్లిపోయిన కాంగ్రెస్‌ జవజీవాలు సంతరించుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టవలసిన పనిలేదు. కానీ ఇదంతా తమ ఘనతేనన్నట్టు కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు అత్యాశో, అత్యుత్సాహమో ప్రదర్శిస్తున్నారు. కన్యాకుమారిలో రాహుల్‌ ఈ యాత్ర ప్రారంభించినప్పుడు దాదాపు ఒంటరే. యోగేంద్ర యాదవ్‌ లాంటి కొద్దిమంది సామాజిక కార్యకర్తలు, యాత్ర పొడవునా భాగస్వాము లవుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రమే ఆయనతోపాటు యాత్ర ప్రారంభించారు. అయితే దారిపొడవునా అనేకమంది ప్రముఖులు ఈ యాత్రలో భాగస్వాములైనందువల్ల ఈ యాత్రకు విశ్వసనీయత సమకూరింది. తమిళనాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో మైత్రిఉన్న రాజకీయపార్టీల నాయకులు రాహుల్‌తోకలిసి అడుగువేయడం కూడా కలిసొచ్చింది. ప్రస్తుతం ఈ యాత్ర కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకు బొత్తిగా బలంలేని ప్రాంతాలద్వారా సాగవలసి ఉంది. అంటే ఇప్పుడు కొనసాగబోయే యాత్రలో యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాలకు ఉన్నపట్టు చాలా స్వల్పం. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షంలో భాగమైన అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌ వాదీపార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ), జయంత్‌ చౌదరి నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెప్పుకోదగ్గ బలమే ఉంది. ఇంకా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నాయకత్వం లోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రాబల్యంఉన్న బెంగాల్‌ద్వారా ఈ యాత్ర సాగవలసి ఉంది. ఈ విభిన్న రాజకీయపక్షాల మద్దతు సమకూరాలని రాహుల్‌గాంధీ కోరుకోవడంలో తప్పు లేదు. అందుకే ఆయన వివిధ ప్రతిపక్షాల నాయకులకు యాత్రలో కలిపి అడుగువేయాలని కోరుతూ లేఖలు రాశారు. కానీ ఏ రాజకీయపార్టీ ఈ ఆహ్వానాన్ని మన్నించిన దాఖలాలు లేవు. ఇది రాజకీయయాత్ర కాదని, దేశాన్ని సమైక్యం చేయడానికి ఉద్దేశించిందేనని కాంగ్రెస్‌ ఎంతగా వాదించినా ఈ యాత్ర వెనకాల ఉన్న లక్ష్యాల మర్మం గ్రహించనివారు ఎవరూలేరు. రాజకీయ పార్టీలకు మాత్రమే కాకుండా అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు కూడా రాహుల్‌ శిబిరం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే స్పందన అంత ఉత్సాహకరంగా లేకపోవడానికి ఈ యాత్రలో ఇమిడిఉన్న రాజకీయ లక్ష్యమే ప్రధాన కారణం. ఒక్క కశ్మీర్‌లో మాత్రం మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(పి.డి.పి.), ఫరూఖ్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మాత్రం కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది. 

తమిళనాడులో డి.ఎం.కె., మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వం లోని శివసేనవర్గం, పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌.సి.పి.) లాగా పి.డి.పి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌కు మిత్రపక్షాలేమీ కావు. యు.పి.ఎ.లో భాగస్వామ్య పక్షాలు తప్ప మిగతా పార్టీలు రాహుల్‌ యాత్రకు మద్దతు ఇవ్వడానికి సుముఖంగా లేవు. బుధవారం బెంగాల్‌లో రాహుల్‌యాత్ర ప్రవేశించినా మమతా బెనర్జీ బాహాటంగా స్వాగతంచెప్పే అవకాశాలు ఏమీలేవు. తమిళనాడులో ఈ యాత్ర సాగినప్పుడు కనిపించని మక్కల్‌ నీధి మయ్యం నాయకుడు, ప్రసిద్ధ సినిమా నటుడు కమల్‌హాసన్‌ మాత్రం దిల్లీలో రాహుల్‌కు మద్దతు పలికారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నామ మాత్రమైన బలంకూడా లేదని సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానాలు పంపిన కాంగ్రెసే అనేక ప్రతిపక్షాలనుంచి ఆశించిన స్పందన రానందువల్ల ఇష్టం ఉన్న వారు పాల్గొనవచ్చు లేకపోతే లేదు అని మునుపటి అహంకార పూరిత ధోరణినే ప్రదర్శించడం ఆశ్చర్యంగాఉంది. ఇది ప్రతిపక్షాల యాత్ర కాదని కూడా అంటున్నారు. ఈ యాత్ర జాతీయ సమైక్యత కోసమని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందని కాంగ్రెస్‌ నాయకులు వాదిస్తున్నారు. కాంగ్రెస్‌ గంగానది లాంటిదని వచ్చేవారు వస్తారు, రాని వారు రారని బింకం ప్రదర్శిస్తున్నారు. నిజమే కావచ్చు. కానీ ఇంతవరకు భారత్‌ జోడో యాత్రకు సమకూరిన మద్దతు కాంగ్రెస్‌లో సంతృప్తి కలిగిస్తే అభ్యంతర పెట్టవలసింది ఏమీలేదు. అది మోదీ పరిపాలనపై పేరుకు పోయిన విముఖతవల్లే అని గుర్తుంచుకోవాలి. కానీ కాంగ్రెస్‌లో అపరిమితమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు సమన్వయంతో పనిచేయాలని రాహుల్‌ స్వయంగా గత శనివారం అన్నారు. బీజేపీని ఓడిరచాలన్న అభిప్రాయం ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఉండొచ్చు. అధికారంమీద ఆశవల్ల ఆ భావన కాంగ్రెస్‌లో మరింత ఎక్కువగా ఉండొచ్చు. కానీ చాలారోజుల నుంచి మోదీ వినాశకరమైన పాలనను అంతం చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌ తదితరులు చెప్తున్నా కాంగ్రెస్‌ స్పందించనే లేదు. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సంపూర్ణమూ కాదు, ఫలితమూ లేదు అని ప్రతిపక్షాల నాయకులు వాదిస్తున్న దశలో కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి సానుకూలతా కనిపించడం లేదు. భారత్‌ జోడో యాత్రకు లభిస్తున్న మద్దతుకారణంగా కాంగ్రెస్‌లో ఆశలు చిగురిస్తే తప్పు పట్టవలసిన పనిలేదు కాని ఆధిపత్య ధోరణి మోదీకే ఉపకరిస్తుంది. ఎలాంటి పనులు చేయకూడదో బీజేపీని చూసి నేర్చుకున్నానంటున్న రాహుల్‌ ప్రతిపక్ష ఐక్యతకు మొన్నటిదాకా ఎందుకు చొరవ తీసుకోలేదో సమాధానం చెప్పాలిగా! కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ కనక మోదీని ఓడిరచాలన్న చిత్త శుద్ధి ఉంటే ప్రతిపక్ష ఐక్యతకు ఏ ప్రయత్నమూ చేయకుండా కాస్తంత మద్దతు సమకూరినట్టు కనిపించ గానే అగ్రస్థానం తమదేనంటే అర్థం ఏమిటి?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img