Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చర్చలు అసంపూర్ణం

ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి మొదలై అయిదు రోజులు గడిచిన తరవాత రెండుదేశాల మధ్య బెలారస్‌ సరిహద్దులో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని, ఇతర అన్ని డిమాండ్లపై ఒప్పందం జరగాలని రష్యా కోరింది. క్రిమియా, డాన్‌బాస్‌ల నుండి రష్యా బలగాలు వైదొలగాలని, యుద్ధం విరమించాలని ఉక్రెయిన్‌ కోరింది. వీటిపైన ఏ పరిష్కారం కుదరలేదు. యుద్ధంమాత్రం కొనసాగుతూనే ఉంది. అణ్వాయుధాల వ్యవహారం చూసే అధికారులను పుతిన్‌ అప్రమత్తం చేయడం ఉక్రెయిన్‌ను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్నే కలవర పరిచింది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఆ ప్రాంతంలో ఇంత భీకరమైన యుద్ధం జరగడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌ అధినేత ఒలోదిమిర్‌ జెలెన్‌స్కీ చర్చలకు అంగీకరించడానికి ఈ బెదిరింపూ కారణం అయిఉండవచ్చు. ఇప్పటికే రాజధాని కీవ్‌లో ఉక్రెయిన్‌ బాగానష్టపోయింది. తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఉక్రెయిన్‌ ప్రజలు ఆయుధపాణులు కావడం ఈ వ్యవహారంలో మరో గుణాత్మకమైన మార్పు. ఖర్కీవ్‌ నుంచి రష్యా సేనలను తరిమికొట్టామని ఉక్రెయిన్‌ చెప్పుకుంటోంది. కానీ, సోమవారం కూడా ఖర్కీవ్‌లో రష్యా సైన్యం దాడులు కొనసాగించిందన్న వార్తలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉండడం కూడా పుతిన్‌ చర్చలకు అంగీకరించడానికి కారణం కావచ్చు. అయితే ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చాలావరకు వైమానికదాడులకే పరిమితంఅయింది. అయితే పదాతి దళాలను రష్యా మోహరిస్తోం దనడానికి రష్యా సేనలు మూడున్నర కిలో మీటర్ల మేర బారులు తీరాయన్న సమాచారమూ ఉంది. యుద్ధంలో ఏ పక్షాన జననష్టం ఎంత ఉందో నికరంగా చెప్పడం ఎటూ సాధ్యం కాదు. కానీ ఉక్రెయిన్‌లో కొన్ని వందల మంది మరణించినట్టు వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఉక్రెయిన్‌ పౌరులను అడ్డం పెడ్తోందని రష్యా ఆరోపించింది. బెలారస్‌ సరిహద్దులో చర్చలకు మొదట జెలెన్‌ స్కీ నిరాకరించారు. దాడిజరగడానికి ముందే అక్కడ రష్యాసేనలను మోహరించి నందువల్ల ఆయన ఈ వైఖరి అనుసరించారు. ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం కారణంగా వేలాది మంది తలదాచుకోవడానికి యుద్ధ ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వెళ్లిపోతున్నారు. చాలామంది పోలెండ్‌ వెళ్తున్నారు. నాలుగు లక్షల మంది పోలెండ్‌ చేరి ఉంటారని అంచనా. హంగరీ, రొమేనియా, మోల్దోవా, స్లొవేకియాలోకూడా జనం తలదాచుకుంటున్నారు.
రష్యాను ఒంటరిని చేయడానికి అమెరికా నాయకత్వంలో నాటో కూటమి ప్రయత్నిస్తోంది. రష్యాను ఆర్థికంగా దెబ్బ తీయడానికి అమెరికా, దానికి వత్తాసు పలికే దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అలాగని ఉక్రెయిన్‌కు బాహాటంగా మద్దతు ఇచ్చిన ఉదాహరణలూ లేవు. యూరప్‌ దేశాలు మాత్రం కావలసినన్ని ఆయుధాలు సమకూరుస్తామని చెప్పాయి. యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తామని అన్నాయి. ఇంకో వేపు రష్యా ధోరణికి నిరసనగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. రష్యాలోనూ ఇలాంటి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అయిదు వేలమందిని రష్యా ప్రభుత్వం అరెస్టు చేయవలసి వచ్చిందంటే పుతిన్‌ ధోరణిని వ్యతిరేకించే వారికి కొదవలేదని అర్థం అవుతూనే ఉంది. పరిస్థితి గందరగోళంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల భారత ప్రభుత్వం ఎటూ మొగ్గకుండా తటస్థ వైఖరి అను సరించి సరైన నిర్ణయమే తీసుకుంది. సోమవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలోనూ భారత ప్రభుత్వం తటస్థ వైఖరినే అవలంబించింది. రష్యా సుదీర్ఘకాలంగా మనకు సన్నిహితంగా ఉంటోంది. కానీ ‘‘దురాక్రమణ’’ను సమర్థించడం సాధ్యమయ్యే పని కాదు. అదే సమయంలో అమెరికాతో రాసుకు పూసుకు తిరగడానికి మోదీ ప్రభుత్వం ఎక్కడ లేని ఉత్సాహం కనబరుస్తున్నా ఉక్రెయిన్‌ను సమర్థించి రష్యాతో తగువు తెచ్చుకోవడమూ భారత్‌కు ప్రయోజనకరం కాదు. అందుకే మోదీ ప్రభుత్వం తటస్థ వైఖరి అనుసరించింది. పుతిన్‌ స్వయంగా మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడినా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మాత్రమే హిత వచనాలు పలికారు. అయితే ఉక్రెయిన్‌మీద రష్యాదాడి పుతిన్‌ హఠాత్తుగాతీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఉక్రెయిన్‌లో దాదాపు 20వేల మంది విద్యార్థులున్నారు. అవసరమైతే విద్యార్థులను రప్పించడానికి ముందే ప్రణాళిక రూపొందించవలసింది. పోలెండ్‌లో భారత విద్యార్థుల మీద దాడి జరిగిన తరవాత మోదీ ప్రభుత్వం పోలెండ్‌తో సహా ఉక్రెయిన్‌ పొరుగు దేశాలకు కేంద్ర మంత్రులను పంపించాలని సముచిత నిర్ణయమే తీసుకుంది. కానీ ఈ పరిస్థితిని ముందే ఊహించడం పరిణత ప్రభుత్వలక్షణం. చైనా విస్తరణవాద ధోరణిని నిలవరించవలసిన పరిస్థితిలో మోదీ ప్రభుత్వం వాస్తవాన్ని కప్పి పుచ్చడానికే ప్రయత్నిస్తోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలను వెనక్కు పిలిపించిన తరవాత దక్షిణాసియా ప్రాంతంలో భౌగోళికరాజకీయాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల అటు రష్యాను, ఇటు అమెరికాను కాదనుకునే పరిస్థితి భారత్‌కు లేదు. అలా కాకుండా ఎటో ఒక వేపు మొగ్గే అవకాశం అంతకన్నాలేదు. మునుపటి సోవియట్‌ యూనియన్‌ ఉన్నప్పుడూ ఆ దేశంతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1971లో అప్పటి తూర్పు పాక్సిస్తాన్‌లో ప్రజల ఆకాంక్షలను మనం సమర్థించినప్పుడు యుద్ధం ఆపాలని అమెరికా ఎంతఒత్తిడి చేసిందో ఎలా విస్మరించగలం. పాకిస్తాన్‌కు అండగా యుద్ధనౌకలను పంపాలని కూడా అమెరికా పథకంవేసింది. అంతకు ముందే సోవియట్‌ మనకు పెట్టనికోటలా నిలిచింది. కానీ ఇప్పుడు ఉన్న భౌగోళిక రాజకీయ సమీకరణల దృష్ట్యా ఏదో ఒక పక్షం వహించే అవకాశం లేదు. అమెరికాతో మైత్రి మీద గతంలోనూ ఇప్పుడూ బీజేపీ ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉన్నా మనకు భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేస్తున్నది రష్యానే.
దేశ ప్రయోజనాల పరిరక్షణే విదేశాంగ విధానానికి గీటు రాయి. అందువల్ల ఏదో ఒక పక్షం వహించడం సాధ్యమయ్యే పని కాదు. రష్యా-ఉక్రెయిన్‌ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం యుద్ధం నివారించడంలో ఘోరంగా విఫలమైంది. షరా మామూలుగా ఐక్యరాజ్య సమితి అస్తిత్వమే సందేహాస్పదంగా తయారైంది. ఐక్యరాజ్య సమితి ఇంతవరకు ఏ యుద్ధాన్ని నివారించలేక పోయింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య వివాదంలో అమెరికా నాయకత్వంలోని నాటో క్షుద్ర పాత్ర బహిర్గతమైంది. రష్యా చుట్టూ నాటో పాగా వేయాలన్న ఆలోచనే లేకపోతే పుతిన్‌కు యుద్ధానికి దిగవలసిన అగత్యమే ఉండేది కాదు. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు తమవేనని పుతిన్‌ వాదించడం వెనక రష్యా జాతీయతను ఆవహన చేసే ప్రయత్నం దాచినా దాగని సత్యం. తాము ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రోత్సహిస్తామని పశ్చిమ దేశాలు చెప్పే సుద్దుల పస ఏమిటో బహిరంగ రహస్యమే. ఎలాగైనా రష్యాను లొంగదీయాలన్న కుటిల యత్నాలకు అమెరికా, పశ్చిమ దేశాలు మానుకోకపోతే పరస్పరం ఆధారపడక తప్పని స్థితిలో మిగిలేది అశాంతే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img