Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటుతో అవినీతిపరులపై వేటు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎన్నికల అక్రమాలతో భారత ప్రజాతంత్రం నిలువెల్లా విలవిల్లాడుతోంది. ఎన్నికలంటే ధనస్వామ్య దాదాగిరీయే అన్నంతగా తయారైంది. సార్వత్రిక సమరానికి అభ్యర్థిత్వాల ఖరారు ఘట్టాన అసంతుష్టుల వీరంగం… పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కరిమింగిన వెలగపండేనని చాటుతోంది. వలస పక్షులకు పెద్దపీట వేశారనీ, పొత్తు పేరిట త్యాగాలకు సిద్ధపడలేమనీ, భారీ మొత్తాలకు సీట్లు అమ్మేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలినుంచి పార్టీ కోసం కృషిచేసిన వారిని కాకుండా కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులను పిలిచి టికెట్‌ ఇవ్వడంపై అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి రగులుతోంది. ఆ రాష్ట్రం…ఈ రాష్ట్రం, ఆ పార్టీ…ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్నింటా ఈ భ్రష్ట రాజకీయ సంస్కృతి రాజ్యమేలుతున్నది. అన్నింటికీ మించి ధనస్వామ్య ధృతరాష్ట్ర కౌగిలిలో మన ఎన్నికల ప్రక్రియ నలిగిపోతున్నది. ఎన్నికల వ్యయానికి సంబంధించి కమిషన్‌ గీచిన లక్ష్మణ రేఖల్ని ఎవరూ లెక్కచేయని ఓ విషాదకర వాతావరణం నెలకొంది. ఫలితంగా దేశంలో స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారం లేని దుస్థితి నెలకొల్పింది. కొద్దిపాటి స్థాయీభేదాలతో అన్ని బూర్జువా పార్టీల్లోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. అంతకంతకూ ప్రకోపిస్తున్న ఈ జాఢ్యంతో సైద్ధాంతిక పునాది, శ్రేణుల్లో క్రమశిక్షణ నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నది. గెలుపు గుర్రాలను బరిలోకి దించే పేరిట ఏళ్లతరబడి పార్టీని నమ్ముకున్న, కృషిచేసినవారిని పక్కనబెట్టి డబ్బున్నవారికి టికెట్లు ఇస్తున్న రాజకీయ దివాలాకోరుతనం శ్రుతిమించుతోంది. ఓట్ల కొనుగోళ్లు, పెద్ద ఎత్తున మద్యం సరఫరా, రిగ్గింగ్‌కు పాల్పడగల రౌడీయిజం, సాంకేతికతని స్వార్థప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోగల సత్తా… ఉన్నవారినే అభ్యర్థులుగా అన్ని పార్టీలు రంగంలోకి దింపాయి. ఎన్నికల వ్యయం, ఆస్తుల వివరాలకు సంబంధించి అబద్ధపు ప్రమాణ పత్రాల సమర్పణతోనే ప్రజాప్రతినిధుల ప్రస్థానం మొదలవుతోంది. శాసనసభకు కనిష్ఠంగా రూ.20 లక్షలు, గరిష్ఠంగా రూ.40 లక్షల వరకూ, లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి కనిష్ఠంగా రూ.75 లక్షలు, గరిష్ఠంగా రూ.95 లక్షల వరకు ఖర్చుచేయవచ్చుననీ వ్యయ పరిమితుల్ని నిర్దేశించినా అభ్యర్థుల ఖర్చు కోట్లలోనే ఉంటోంది.
ప్రజాసేవకు నిబద్ధమై సమస్యల పరిష్కారానికి, పౌరశ్రేయస్సు పరిరక్షణకు కట్టుబడి పనిచేసే ఏ రాజకీయ పక్షమైనా… జనంలో పుట్టి, జనంతో మమేకమై ఎదుగుతుంది. సైద్ధాంతిక బలిమి, వ్యవస్థాగత నిర్మాణ నిర్వహణలో పాదర్శకత కలిగి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీల మాదిరిగా జనం కోసమే నిలబడుతాయి. కమ్యూనిస్టు పార్టీల్లో మాదిరిగా కార్యకర్తల నుంచే సత్తాగల నాయకుడి ఎదుగుదలకు దోహదపడే సంస్థాగత నిర్మాణ పటిమతో అలరారుతున్న పార్టీలు దేశంలో నేడెన్ని ఉన్నాయి? వ్యక్తిస్వామ్యానికి పాదుచేసి, వారసత్వ కుటుంబ ఆస్తిగా పార్టీని మార్చేసిన ఘనత మన నేతలకు దక్కుతుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక శాతం ఈ అవలక్షణాలనే పుణికిపుచ్చుకున్నాయి. పర్యవసానంగా దాదాపు అన్ని పార్టీల్లోనూ అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడుతోంది. పొద్దున పార్టీ తీర్థం పుచ్చుకొని, కండువా కప్పుకొన్న ఆసామికి సాయంత్రానికల్లా టికెట్‌ ఖరారవుతోంది. సచ్ఛీలత, నిబద్ధత అంటూ మడికట్టుకు కూర్చుంటే చేతికి చిప్పేనని తలపోస్తున్న వాళ్లూ, అటువంటి వారిని ప్రోత్సహిస్తున్న నేతల పుణ్యమా అని… వలసలు, గోడదూకుళ్లు జోరందుకున్నాయి. రాజకీయాలంటేనే జంపింగ్‌లు, ఎన్నికలంటేనే వెన్నుపోట్లు మామూలే అనే పరిస్థితి దాపురించింది. తాను అంతవరకూ తెగతిట్టిపోసిన పార్టీ అయినా సరే ఎన్నికల వేళకు గెలుపు అవకాశాలు ఉన్నాయనుకుంటే చాలు…చొక్కాలు మార్చినట్లు పార్టీలనే మార్చేసే నయా రాజకీయ సంతతి పుట్టుకొస్తోంది. అదే విధంగా ప్రధాన పార్టీలు కూడా వారిని అక్కునచేర్చుకుంటున్నాయి. దీంతో రాజకీయాల్లో నైతికత అనేది నేతిబీర చందంగా మారిపోయింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని నాయకులు చేస్తున్న విషప్రచారం రాజకీయ వాతా వరణాన్ని కలుషితం చేస్తోంది. నాయకులు ఓటర్లలో విద్వేషాలు రగిలించడం విచారకరం. ఎన్నికల వేళ నానారకాల ప్రలోభాల ఎరలతో ఓటర్ల చెవిలో పువ్వులు పెట్టి, కులమతాల కత్తిపోట్లతో సమాజాన్ని చీల్చి అధికారంతో ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా ఉడాయించే దౌర్భాగ్య వాతావరణం నేడు కళ్లకు కడుతోంది. దాన్ని పటాపంచలు చేయగలిగిన సత్తా ఓటర్లపైనే ఉంది. ప్రజల చేతిలో ఓటు అనే వజ్రాయుధం ఉంది. ఒక పౌరుడిగా ఆ ఓటును అమ్ముకున్నంత కాలం చేటు తప్పదు. ఓటు అమ్ముకోవడమంటే తలతాకట్టు పెట్టడమేనన్న నిజాన్ని ప్రతి పౌరుడూ గుర్తించి తీరాలి. ఓటు కోసం ఓటరుకు గోరంత విదిలించి అధికారంలోకి వచ్చాక కొండంత సంపాదించుకునే వారి కుయుక్తులను ఓటర్లు తిప్పికొట్టాలి. అయిదేళ్ల కాలవ్యవధిలో ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేస్తారన్న నమ్మకంతో ఓ అభ్యర్థికి అధికారం కట్టబెట్టే గురుతర బాధ్యత…ఓటు! ఆ బాధ్యతను జాగ్రత్తగా నెరవేర్చకపోతే కష్టాలకడలిలో కూరుకుపోయేది సామాన్య జనమే. డబ్బులిచ్చి దాన్ని ఓ అభ్యర్థి కొనుగోలు చేయడమంటే, ప్రజాధనాన్ని అయిదేళ్ల పాటు లూటీ చేయడానికి లైసెన్సు పొందడమేనన్న వాస్తవాన్ని ఓటర్లు తెలుసుకోవాలి. సీసాకు, పైసాకు ఓటు అమ్ముకోవడమంటే పాలకులను నిగ్గదీసి ప్రశ్నించే అధికారానికి నీళ్లొదులుకోవడమే కాదు… ప్రజాస్వామ్యాన్ని కళంకిత పరచడమేనన్న వివేచన ఓటర్లలో కలిగితే` ధనబలమే ప్రధాన అర్హతగా పబ్బం గడుపుకొంటున్నవాళ్ల పప్పులు ఉడకవు. ప్రజా సేవకుడిగా ఉండాల్సినవాడు దోపిడీ దారుగా మారేందుకు సర్వహంగులూ కల్పిస్తున్న దుర్భర వాతావరణంలో నేడు మనం ఉన్నాం. ఇదే ప్రజాస్వామ్యమని మనల్ని మనమే మోసం చేసుకుం టున్నాం. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల వేళ… జాతి సంపదను బొక్కేసిన అవినీతి తిమింగలాలు, ఎన్ని వేలైనా గుమ్మరించి ఓటు కొనుగోలు చేయడానికి వస్తున్నారు. మళ్లీ ఓటు అమ్ముకుందామా! ఆలోచించండి!! ఓటుతో అవినీతి పరులపై వేటు వేయగలిగితే… వర్తమానాన్నే కాదు, భవిష్యత్తును కూడా కాపాడుకొన్నట్లే! ఆలోచించండి!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img