Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ మార్కు గుజరాత్‌ మంత్రివర్గం

విజయ్‌ రూపానీ గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసిన తరవాత భూపేంద్ర పటేల్‌ గత సోమవారం కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి మూడు రోజుల సమయం పట్టింది. మొదట బుధవారం కొత్త మంత్రివర్గ సభ్యులు ప్రమాణం స్వీకరిస్తారను కున్నారు. ప్రమాణ స్వీకారానికి రాజ్‌ భవన్లో సకల ఏర్పాట్లూ చేశారు. ఊరంతా బ్యానర్లూ వెలిశాయి. కానీ ఏ కారణం చెప్పకుండానే ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారానికి వాయిదా వేశారు. అందువల్ల ఆ బ్యానర్లు తొలగించారు. భూపేంద్ర పటేల్‌ మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో అందరూ కొత్త వారే. విజయ్‌ రూపానీ మంత్రివర్గంలో పని చేసిన ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌తో సహా ఎవరికీ స్థానం దక్కలేదు. మోదీ, షాకు ఉన్న ఆధిపత్యంవల్ల సీనియర్‌ నాయకులు కూడా నోరెత్తలేక పోతున్నారు. కానీ చాలామంది నాయకుల్లో అసమ్మతి మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అనేకమంది సీనియర్‌ నాయకులు ముఖ్యమంత్రి పదవిని ఆశించినప్పటికీ మోదీ, షా పెత్తందారీ ధోరణివల్ల భూపేంద్ర పటేల్‌ ను ముఖ్యమంత్రిగా అంగీకరించక తప్పలేదు. మంత్రిత్వ పదవుల కోసం బీజేపీ నాయకుల మధ్య అంతః కలహాలూ బహిరంగ రహస్యమే. మంత్రి వర్గ నిర్మాణం అంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇష్టానుసారం, ఆదేశాల ప్రకారమే జరిగింది. రూపానీ రాజీనామా చేయడానికి కారణాలైతే చెప్పలేదు కానీ ఆ కారణాలు ఊహకు అందనివి ఏమీ కావు. ఎన్నికలు సమీపించే సమయంలో ఆ ముఖ్య మంత్రుల పాలన మీద ప్రజలలో గూడు కట్టుకున్న అసమ్మతి తదుపరి ఎన్నికల మీద పడకుండా కొత్త వారిని ముఖ్యమంత్రిగా నియమించడం బీజేపీకి అలవాటైన వ్యవహారమే. కర్నాటకలో ఎడియూరప్పకు, ఉత్తరాఖండ్‌ లో తీరథ్‌కు ఉద్వాసన చెప్పడానికి వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉండడమే కారణం. గుజరాత్‌ ఎన్నికలు నిర్వహించ డానికి ఇంకా సంవత్సరంపైన సమయం ఉంది. కానీ వరసగా ఏడో సారి కూడా విజయం సాధించి రికార్డు నెలకొల్పాలన్నది మోదీ, షా ప్రయత్నం కనక రూపానీ చేత రాజీనామా చేయించారు. కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారన్న ముద్రతో రూపానీ తప్పు కోవలసి వచ్చింది. ఈ వైఫల్యం ఒక్క రూపానిదే కాదు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి కూడా కరోనా విషయంలో ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కానీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి వ్యవహార సరళి మీద మోదీ, అమిత్‌ షాకు ఎన్ని ఫిర్యాదులున్నా యోగీ ఆదిత్యనాథ్‌ను తొలగించే సాహసం చేయలేక పోయారు. అందువల్ల అక్కడ మాత్రం అగ్ర నాయకుల మాట చెల్ల లేదు.
రాజీనామా చేసిన తరవాత రూపానీ పెడసరంగా మాట్లాడడమే ఆయన అయిష్టంగా రాజీనామా చేశారనడానికి నిదర్శనం. మోదీ నాయ కత్వంలో గుజరాత్‌ అభివృద్ధి సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసి ఆయన తన అసమ్మతిని పరోక్షంగా వ్యక్తం చేశారు. అయితే మోదీ, షా ద్వయాన్ని ఎదిరించే ధైర్యం ప్రస్తుతానికి దేశంలో ఏ బీజేపీ నాయకుడికీ లేదు కనక అంతా సవ్యంగా సాగిపోతున్న భ్రమ కలిగించగలుగుతున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎన్నుకోవడానికి ఆ శాసన సభా పక్షాలకు అవకాశమే ఇవ్వడం లేదు. ఇది అచ్చంగా కాంగ్రెస్‌ కొనసాగించిన పద్ధతే. కాంగ్రెస్‌ను తూర్పారబట్టడానికి ఒక్క అవకాశం కూడా వదులుకోని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆచరణలో మాత్రం కాంగ్రెస్‌ పెడ ధోరణులను తు.చ. తప్పకుండా అనుసరిస్తుంది. గుజరాత్‌లోనూ అదే జరిగింది. రూపానీ మంత్రివర్గంలో ఉన్న వారెవరికీ స్థానం దక్కకపోవడంవల్ల అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా పెదవి విప్పి మాట్లాడే ధైర్యం, స్వేచ్ఛ ఎవరికీ లేకపోవడం బీజేపీ మార్కు ప్రజాస్వామ్యానికి మచ్చు తునక. రూపానీ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ కొత్త ముఖ్యమంత్రి అవు తారన్న ఊహాగానాలు బలంగానే వినిపించినా ఆయనకూ స్థానం దక్క లేదు. మొన్నటి దాకా శాసనసభ స్పీకర్‌గా ఉన్న రాజేంద్ర తివారీ ఆ పదవికి రాజీనామా చేసి మంత్రి అయిపోయారు. గుజరాత్‌ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం అయినందువల్ల వచ్చే ఏడాది చివరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడం బీజేపీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం. అందుకే ఇల్లలికి ముగ్గులు పెట్టినట్టు పాత మంత్రులెవరికీ అవకాశం ఇవ్వకుండా అందరినీ కొత్త వారినే మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. అసలు భూపేంద్ర పటేల్‌ ముఖ్యమంత్రి కావడమే ఆశ్చర్యం. ఆయన మొదటి సారి శాసనసభ్యుడైన వారు. గుజరాత్‌లో పటేళ్ల వర్గానికి ప్రాధాన్యం ఉండడం, పాటిదార్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని 2015లో హార్దిక పటేల్‌ నాయకత్వంలో మొదలైన ఆందోళన తీవ్ర రూపం దాల్చడం లాంటి పరిణామాలన్నీ పటేల్‌ వర్గం ఎంత ప్రధానమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవ కాశం వచ్చింది. పాటిదార్ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంవల్ల 2016లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉపకార వేతనాలు, సబ్సిడీలు ప్రక టించారు. 2016లోనే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజ ర్వేషన్లు కూడా కల్పించారు. కానీ 2018 ఆగస్టులో గుజరాత్‌ హైకోర్టు ఈ సదుపాయాన్ని కొట్టివేసింది. ఆ తరవాత మరో రెండేళ్లు పాటీదార్‌ ఉద్య మం కొనసాగింది. 2019లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించింది. ఈ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి ఎక్కారు. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చే దాకా ఏ విషయమూ తేలదు. కానీ పటేళ్ల మద్దతు సంపాదించడానికే భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిని చేశారు. అయితే రూపానీ మంత్రి వర్గంలో ఉన్న వారికి ఒక్కరికి కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనందు వల్ల అసమ్మతి బలంగానే వ్యక్తమవుతోంది. అందుకే కొత్త మంత్రివర్గ ప్రమాణం ఒక రోజు వాయిదా వేయవలసి వచ్చింది. మోదీ, షా ఆధిపత్య ధోరణివల్ల అంతర్గత ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అవకాశం లేకుండా చేయడంలో సఫల మవుతున్న మాట వాస్తవమే. కానీ ఈ పెత్తందారీ ధోరణివల్ల ఒక వేపు ప్రజలు ఎన్నుకున్న శాసనసభులకు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో ఏ పాత్రా ఉండడం లేదు. ఇది ప్రజాస్వామ్య నియమాలకు తిలోదకాలివ్వడమే. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నన్నాళ్లు ముఖ్య మంత్రుల ఎన్నిక జాడే లేదు. అంతా ఎంపిక వ్యవహారమే. కనీసం అప్పుడు అధిష్ఠానం పంపే సీల్డు కవర్‌ రాజకీయమైనా ఉండేది. ఇప్పుడు శాసన సభ్యులను మోదీ, షా కంటి సైగతోనే నిర్దేశించే నూతన ధోరణి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యాన్ని కాల రాయడం మాత్రమే కాదు. ఫెడరల్‌ విధానానికి ఏ మాత్రం అవకాశం లేకుండా కేంద్రీకృత పాలన కొనసాగించడమే. రాష్ట్ర స్థాయి నాయకులు కీలుబొమ్మలకన్నా హీనమైన స్థాయికి దిగజారిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img