Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మోర్బీ విషాదం

గుజరాత్‌ లోని మోర్బి పట్టణంలో మచ్చూ నది మీద ఉన్న 143 ఏళ్ల నాటి ఊయల లాంటి వంతెన ఆదివారం సాయంత్రం కూలిపోయింది. కనీసం 141 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వంతెనను మరమ్మతుల కోసం ఏడు నెలలపాటు మూసేసి వారం కిందట అంటే అక్టోబర్‌ 26న పున:ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణమేమిటో కనుక్కోవడానికి కచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ దుర్ఘటన గురించి జనం అంతా మరిచిపోయే సమయానికి నివేదిక వస్తుంది. ఇలాంటి సందర్భాలలో వాస్తవానికి బహు దూరంగా ఉండే నివేదికే బయటకు వస్తుంది. ప్రమాదానికి అసలు కారకుల ఆచూకీ ఆ నివేదికలో ఎంత తరచి చూసినా దొరకదు. పర్యాటకులను ఆకర్షించడం కోసం నిర్మించే ఇలాంటి వంతెనల మీద ఒకే సమయంలో ఎంత మంది ఉండొచ్చో ఓ లెక్క ఉంటుంది. దాని సామర్థ్యం మీద ఈ నివేదికలో వెల్లడిరచే అంచనాలు కనీసం భవిష్యత్తులోనైనా ఈ దారుణాలు జరగకుండా ఉపయోగపడకపోవడం మన ప్రత్యేకత. బాధితులను రక్షించడానికి, పునరావసం కల్పించడానికి ఏ లోటు చేయబోమని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ కోడి ఇంకా కూయలేదు కానీ పదిహేను రోజులకు ఒక సారి మోదీ గుజరాత్‌ లో పర్యటిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ప్రమాదం జరిగినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. మోర్బీ మాజీ పాలకుడు సర్‌ వాగ్జీ ఠాకూర్‌ మోర్బీ పాలకుల ప్రగతి శీల, శాస్త్రీయ పరిపాలనకు చిహ్నంగా ఈ వంతెనను నిర్మించారు. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తరా ఖండ్‌ లోని రాం-లక్ష్మణ్‌ రaూలాల నమూనాలో ఈ వంతెన నిర్మించారు. అప్పటికి యూరప్‌ లో అందుబాటులో ఉన్న మేటి సాంకేతికతను వినియోగించి నిర్మించారు. దీనికోసం అవసరమైన నిర్మాణ సామాగ్రి ఇంగ్లాండ్‌ నుంచి మూడున్నర లక్షల రూపాయలు పెట్టి తెప్పించారట. అప్పటి రాజ కుటుంబాల దర్బార్‌ గఢ్‌ రాజభవనాన్ని, నజర్‌ బాగ్‌ రాజభవనాన్ని కలపడానికి ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన 233 మీటర్ల పొడవు ఉంటుంది కానీ వెడల్పు కేవలం 1.25 మీటర్లే. అందువల్ల ఎక్కువ మంది ఒకే సారి ఆ వంతెన మీదకు వెళ్లడం ప్రమాదకరం. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగినప్పుడు నాలుగైదు వందల మంది వంతెన మీద విహార యాత్రకు వచ్చారట. ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేయించారు. గుజరాత్‌ కు చెందిన ఒరేవా అనే ప్రైవేటు కంపెనీ ఈ వంతెనను నిర్వహిస్తుంది. అవసరమైన మరమ్మతుల బాధ్యత కూడా ఆ సంస్థదే. అయితే ఒరేవా కంపెనీ నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్నది కాదు. నిజానికి ఒరేవా కంపెనీ గడియారాలు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లు తయారు చేస్తుంది. ఈ వంతెన నిర్వహణ తమ వ్యాపార నైపుణ్యాలకు సంబంధించింది కాదు గనక దేవ్‌ ప్రకాష్‌ సొల్యూషన్స్‌ అనే ప్రైవేటు కంపెనీ సహాయం తీసుకుంటుంది. ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేయించిన తరవాత కనీసం ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌ కూడా తీసుకోకపోవడం ప్రైవేటు కంపెనీల వ్యవహార సరళికి, వాటిని విచ్చలవిడిగా ప్రోత్సహించే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి తార్కాణం. గుజరాత్‌ నూతన సంవత్సరాదిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్‌ 26న ఈ వంతెనను ప్రారంభించేశారు. ఈ కంపెనీ కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం మరమ్మతులు మొదలైనవి చేయడానికి కనీసం ఎనిమిది నెలలనుంచి ఏడాదిపాటు మూసి వేసి ఉండాల్సింది. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకుండా పంచాంగాల ఆధారంగా గుజరాత్‌ సంవత్సరాది అని హడావుడిగా వంతెన మీదకు జనాన్నీ అనుమతించడం విచిత్రంగా ఉంది. పైగా ఈ వంతెన మరమ్మతులకు రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినందువల్ల ఒరేవా కంపెనీ టికెట్‌ డబ్బులూ వసూలు చేస్తుంది. పదిహేనేళ్ల పాటు టికెట్‌ ధర తమ ఇష్టానుసారం పెంచుకోవడానికి దయగల ప్రభువుల అనుమతి ఉంది.
రాజ్‌ కోట్‌ నుంచి లోకసభకు ఎన్నికైన బీజేపీ ఎంపీ మోహన్‌ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది ఈ దుర్ఘటనలో మరణించారు. అందులో అయిదుగురు బాలలు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. సహాయ, పునరావాస కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండడానికి దుర్ఘటన జరిగిన వెంటనే మోదీ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. సోమవారం సందర్శించారు. 2016 లో బెంగాల్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనే వివేకానంద ఫ్లై ఓవర్‌ కూలిపోయింది. అప్పుడు ప్రధానమంత్రి మోదీ బెంగాల్‌ ముఖ్యమంత్రిని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది దైవ ఘటన కాదు, మానవ తప్పిదం అని తూర్పారబట్టారు. మమతా బెనర్జీ కూడా తక్కువ తినలేదు. ఆ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కాంట్రాక్టు మంజూరు చేసింది వామపక్ష ఫ్రంట్‌ అధికారంలో ఉన్నప్పుడే కనక ఈ దుర్ఘటనకు వారిదే బాధ్యత అని దుమ్మెత్తి పోశారు. మరి గుజరాత్‌లో వంతెన కూలిపోవడానికి నెపం ఆయన ఎవరి మీద తోస్తారో తెలియదు. మోదీ నిరంతరం ఎన్నికల ప్రచార ఊపులోనే ఉంటారు. కనక అప్పుడు వివేకానంద ఫ్లై ఓవర్‌ కూలిపోవడం తృణమూల్‌ అక్రమ పరిపాలనను ఖండిరచడానికి దేవుడు ఇచ్చిన సంకేతం అన్నారు. ఇప్పుడూ అదే సూత్రాన్ని వర్తింప చేస్తే రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్‌ లో అధికారం చెలాయిస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీనే తప్పుబట్టాలా! విషాదకర పరిణామాలను కూడా ఎన్నికల ప్రయోజనాలకోసం వినియోగించు కోవడంలో దిట్ట అయిన మోదీ లాంటి వారు మినహా ఎవరూ అంతటి దుర్మార్గానికి పాల్పడరు. మానవ జీవితంలో విషాద సంఘటనలను కూడా పరిహసించే కుసంస్కారం అందరికీ ఉండదు కదా! కోల్కతా ఫ్లై ఓవర్‌ కూలిపోయినప్పుడు రెండు కన్నీటి బొట్లైనా కార్చాలి కదా అని మమతా బెనర్జీని ఎద్దేవా చేసిన మోదీ మోర్బీ వంతెన కూలి పోయిన తరవాత సహాయ, పునరావాస కార్యకలాపాల్లో లోటుఉందని అన్నారు తప్పితే కన్నీటిబొట్లు రాల్చిన దాఖలా లేదు.
గుజరాత్‌లో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వంలోని లోపాలు ఆయనకు ఎటూ కనిపించవు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌ మీదుగా వెళ్తున్న రాహుల్‌ను మోర్బీ దుర్ఘటనపై వ్యాఖ్యానించ మని కోరితే తాను ఈ దుర్ఘటనను రాజకీయం చేయబోనని కచ్చితంగా చెప్పేశారు. కాంట్రాక్టులు కేటాయించడంలో కమిషన్లకు ఆశ పడడం, బాహాటంగా అవినీతిని ప్రోత్సహించడం కేవలం బీజేపీ ప్రభుత్వాలకే పరిమితమైన వ్యవహారం కాదు. దాదాపు అన్ని ప్రభుత్వాలు అవినీతిని చేతులు చాచి ఆహ్వానిస్తూనే ఉంటాయి. మానవ తప్పిదాలను నివారించ డానికి ఏ ప్రభుత్వమైనా ఎందుకు శ్రద్ధ తీసుకోదో అంతుబట్టదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img