Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

రాహుల్‌ చుట్టూ రాజకీయం

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిందన్నందుకు మోదీ సర్కారు అగ్గిమీద గుగ్గిలమైంది. విదేశీగడ్డపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని కనీసం నలుగురు కేంద్ర మంత్రులు రాహుల్‌ గాంధీమీద రేసుకుక్కల్లా విరుచుకుపడ్డారు. ఆసంఘటనే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడానికి ఆఖరి ఘట్టమైంది. ఆయన లోకసభలో ప్రసంగించిన వెంటనే సూరత్‌ లోని ఓ కింది కోర్టు ఆయన మీద అనేక ఏళ్ల కిందటి కేసును తవ్వి తీసి పరువు నష్టానికి పాల్పడ్డారని రూఢ చేసి రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయన లోకసభ సభ్యత్వం రద్దయింది. ఇన్ని జరిగినా సరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి విదేశీ గడ్డ మీద కూడా నిజం మాత్రమే చెప్తానని రాహుల్‌ ప్రతినబూనినట్టు కనిపిస్తోంది. రాహుల్‌ అమెరికాలో ప్రవాస భారతీయులను, అమెరికా న్యాయ కోవిదులను కలుసుకుంటున్నారు. ‘‘నిజమైన ప్రజాస్వామ్య’’ దృక్పథాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు ‘‘సర్వ జ్ఞాన సంపన్నులమని’’ భావిస్తున్నారు అని రాహుల్‌ అన్నారు. ఇంగ్లాడ్‌ లో పర్యటించినప్పటిలా కాకుండా అమెరికా పర్యటనలో మోదీ సర్కారుమీద నేరుగా విమర్శ నాస్త్రాలు సంధించకుండా అన్యాపదేశంగా వ్యంగ్యాస్త్రాలు సంధించే పద్ధతి ఎన్నుకున్నట్టున్నారు. మోదీని అవమానించే క్రమంలో రాహుల్‌ దేశాన్నే అవమానిస్తున్నారని బీజేపీ నాయకులు ఆక్రోశిస్తున్నారు. దీని కోసం అనువైన రీతిలో వీడియోలు, యూట్యూబ్‌ కార్యక్రమాలూ రూపొందిస్తున్నారు. రాహుల్‌ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రాహుల్‌ నడవడికను నిశితంగా పరిశీలిస్తే ఆయన క్రమంగా ప్రతిపక్ష కూటమికి నాయకుడిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకు ముందంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ప్రచారావరణనంతటినీ విస్తరించి ఉండేవారు. ఇప్పుడు రాహుల్‌ ఆ స్థానానికి చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రధానమంత్రి మోదీని దుయ్యబట్టే వారికి కొదవలేదు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కె.సి.ఆర్‌.)అవకాశం వచ్చినప్పుడల్లా మోదీని తీక్షణంగా విమర్శిస్తున్నారు. మమతా బెనర్జీ అయితే మోదీని బోనెక్కించడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. వాగ్బాణాలు అయితే మరీ తీవ్రంగానే కాక నిర్ద్దిష్ట అంశాల మీద ఉంటున్నాయి. ఫెడరల్‌ విధానాన్ని మోదీ చిన్నాభిన్నం చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ కు, నరేంద్ర మోదీకి మొదటి నుంచి ఉప్పు-నిప్పు సంబంధాలే ఉన్నాయి. ప్రతిపక్షాల తరఫున గొంతెత్తే వారు, ప్రతిపక్ష ఐక్యత కాంక్షించేవారు చాలా మందే ఉన్నారు. నితీశ్‌ కుమార్‌, శరద్‌ పవార్‌లాంటి వారు ప్రతిపక్షాలను ఏకంచేయడానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నారు. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొడ్తూ సాగుతున్న మోదీ పరిపాలనపై ప్రజలకు మొహం మొత్తినట్టుంది. ఇటీవల వెలువడ్డ కొన్ని సర్వేలు మోదీ ప్రభావం జారుడు బండ మీద ఉందంటున్నాయి. రాహుల్‌ పలుకుబడి నెమ్మదిగానైనా పెరుగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం కాంగ్రెస్‌ తో పాటు రాహుల్‌ ప్రతిష్ఠను కూడా గణనీయంగా పెంచింది. మోదీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో మాత్రమే పలుకుబడి ఉంది. దేశమంతా ఆ పార్టీలను, వాటి నాయకులను పట్టించుకునేవారు చాలా తక్కువ. ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికీ దేశ వ్యాప్తంగా ఉన్న ఆదరణ నామ మాత్రం. కానీ మమత, కేజ్రీవాల్‌, కె.సి.ఆర్‌. తమకు తోచిన రీతిలో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేశారు. ఫలితం పరిమితమే కావచ్చు. నితీశ్‌ కుమార్‌, శరద్‌ పవార్‌ లాంటి వారి ప్రయత్నాలు మరింత విస్తృతమైనవి. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి (మునుపు టి.ఆర్‌.ఎస్‌.) కు ఆ పార్టీలకు బలమున్న రాష్ట్రాలలో కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. అందువల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో జత్తు కలపడం ఈ పార్టీ నేతలకు ఇష్టం లేదు. కానీ మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదురించాలంటే ఆ లక్ష్యం ఉన్న పార్టీలన్నీ ఒక్క తాటిమీదకు రావలసిందే.
అనేక ప్రతిపక్ష పార్టీలకు రాహుల్‌ నాయకత్వంపై అపనమ్మకం ఉండేది. కానీ భారత్‌ జోడో యాత్ర తరవాత రాహుల్‌లో పరిణతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి ప్రతిపక్ష కూటమికి నాయకుడెవరు అన్న విషయం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఖరారు కావలసిన అగత్యం ఎంత మాత్రం లేదు. తక్షణావసరం నాయకత్వం ఎవరిది అన్నది కాదు. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఎంత పటిష్ఠమైన ఐక్యత సాధ్యమవుతుందా అన్నదే ప్రధానం. ఒక వాస్తవం మాత్రం అంగీకరించి తీరాలి. దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్నది కాంగ్రెస్‌ కు మాత్రమే. ఇందులో తరతమ భేదాలు ఉండొచ్చుగాక. మోదీ మీద రాహుల్‌ సంధిస్తున్న విమర్శలకు తాళలేక బీజేపీ నాయకులు, మోదీ భక్తులు, మొత్తం బీజేపీ యంత్రాంగం మోదీని సమర్థించే ప్రయత్నం కన్నా రాహుల్‌ను తూర్పారపట్టడం మీదే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ బలహీనంగానే ఉందన్న విషయం రాహుల్‌ గ్రహించకపోలేదు. కానీ కాంగ్రెస్‌ నాయకుడిగా రాహుల్‌ మీద విశ్వాసం క్రమానుగతంగా పెరుగుతోంది. కర్నాటకలో విజయం రాహుల్‌ ఎన్నికలలో గెలిపించ గలరు అన్న భరోసా కలగజేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఉన్న శక్తి చాలా నామ మాత్రమైంది. కానీ ఆ పరిస్థితీ మార్పు మార్గం పట్టినట్టుంది. రాహుల్‌ న్యూయార్క్‌, వాషింగ్టన్‌ కూడా వెళ్లాల్సి ఉంది. అప్పుడూ ఆయన ధోరణిలో మార్పు ఏమీ ఉండకపోవచ్చు.
మరో ఇరవైరోజుల్లో మోదీ కూడా అమెరికాలో పర్యటించవలసి ఉంది. అప్పుడు మోదీ రాహుల్‌ విమర్శలకు బదులివ్వ కుండా ఉండలేరుగా. విదేశీగడ్డపై మన దేశంలో ప్రజాస్వామ్యం పలచబడిరదని లండన్‌లో ప్రకటించినందుకు రాహుల్‌ను తప్పుబట్టిన వారు మోదీ అమెరికా వెళ్లినప్పుడు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటుంటే ఏమంటారో చూడాల్సిందే. అప్పుడు వారి నీతి సూత్రాలు ఏ గాటకు కట్టేస్తారో గమనించాలి. విదేశీగడ్డమీద దేశ రాజకీయాలు ప్రస్తావించడం మోదీకి రాహుల్‌ అనివార్యం చేశారు. ఆయన వేస్తున్న ప్రతి అడుగూ ఈ మధ్య కాలంలో మోదీ బండారం బయట పెట్టడానికే వినియోగించు కుంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 33.8 శాతం మందీ బీజేపీకి అనుకూలంగా ఉంటే , బీజేపీకి మద్దతిస్తున్న షిండే వర్గానికి 5.5 శాతం జనం మద్దతు ఉంది. కాంగ్రెస్‌ కు మహారాష్ట్రలో పెద్ద బలమూ లేదు. వ్యవస్థాలేదు. ఆయినా 19.9 శాతం మద్దతు ఇస్తున్నారు. ఎన్‌.సి.పి.కి 15.3 శాతం మంది, ఉద్ధవ్‌ నాయకత్వంలోని శివసేనకు 12.5 శాతం మద్దతు ఉంది. అంటే రాహుల్‌ గాంధీ రాజకీయ సమీకరణకు కేంద్ర బిందువుగా మారుతున్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img