Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

మల్ల యోధులకు క్రికెటర్ల మద్దతు

నెలపై నుంచి ఆందోళన చేస్తున్న మహిళా మల్ల యోధుల వ్యవహారంలో నేడు రెండు గొప్ప పరిణామాలు సంభవించాయి. కురుక్షేత్రలో ఈ మల్లయోధులకు మద్దతుగా మహా పంచాయత్‌ జరిగింది. రెండో వేపున డబ్బులున్న క్రికెట్‌ ఆసాముల్లో కొందరు ఆలస్యంగానైనా స్పందించారు. కానీ 1983లో ప్రపంచ క్రికెట్‌ కప్‌ విజేతలైన క్రీడాకారుల బృందం ఆందోళన చేస్తున్న మహిళా మల్ల యోధులను సమర్థించారు. ఆలోచనా పరులైన వారు ఈ దేశంలో ఇంకా పూర్తిగా అంతం కాలేదని వీరి ప్రకటన రుజువు చేసింది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన మల్ల యోధులను రోడ్డు మీద ఈడ్చుకెళ్లడంతో తమ మనసు వికల మైందని వీరు ఆవేదన వ్యక్తంచేశారు. ఆందోళనచేస్తున్న మల్ల యోధులు తమ పతకాలను గంగానదిలో పారవేయాలని సంకల్పిం చడం దారుణమైన పరిస్థితి అని 1983లో విశ్వవిజేతలైన కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని క్రికెట్‌ బృందం సభ్యులు అనడం ఈ దేశంలో చైతన్యం ఇంకా మిగిలే ఉందని, చీము నెత్తురు ఉన్నవారు ఇంకా సజీవంగానే ఉన్నారని నిరూపితమైంది. ఏళ్ల తరబడి శ్రమించి, తపస్సుచేసి వీరు ఈ పతకాలు సంపాదించారు. అలాంటి పతకాలను గంగా నదిలో విసిరేయాలనుకోవడం చూస్తే వారి మానసిక ఆందోళన ఎంత తీవ్రమైందో అర్థం అవుతోందని వారు అన్నారు. ఈ పతకాలు కేవలం ఆ క్రీడాకారుల వ్యక్తిగతం కావు. ఇవి దేశ గౌరవానికి చిహ్నం. ఇలాంటి సమయంలో మల్ల యోధులు తొందరపడకూడదని ఈ క్రికెట్‌ బృందం విజ్ఞప్తి చేసింది. ఒలంపిక్‌ క్రీడాకారులు నీరజ్‌ చోప్రా, అభినవ్‌ భింద్రా మొదటి నుంచీ ఈ మల్ల యోధులకు అండగానే నిలబడ్డారు. విశ్వ విజేతలైన క్రికెట్‌ క్రీడాకారుల బృందం తాము నిజంగానే ఛాంపియన్లమని తెలియజెప్పింది. అసలైన ఛాంపియన్లకే ఇతర చాంపియన్ల బాధ అర్థం అవుతుంది. మహిళా మల్ల యోధుల మీద విరామం లేకుండా అవాకులు చెవాకులు పేలుతున్న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ కూడా ఒక ప్రముఖ దినపత్రికలో దీనికి సంబంధించిన వార్తను చూసి, క్రికెట్‌ వీరులు ప్రకటించిన మద్దతును గమనించి సిగ్గు పడుతున్నారో లేదో మాత్రం తెలియదు. అనునిత్యం అసత్యాలు పలికే వారికి ఇంత త్వరగా జ్ఞానోదయం అవుతుందని నమ్మడం కూడా అంత సులభంకాదు. మల్ల యోధులు పతకాలు సాధించడానికి ఏళ్ల తరబడి పాటు పడ్డారని, ఈ పతకాలు ఊరకే దక్కలేదని, నిజానికి అవి ఈ దేశం సాధించిన పతకాలు కనక తొందరపడి వాటిని గంగపాలు చేయొద్దని 1983 క్రికెట్‌ బృందంలోని కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, మదల్‌నాల్‌, భారత క్రికెట్‌ బోర్డు (బి.సి.సి.ఐ.) అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ లాంటి వారు విజ్ఞప్తి చేశారు. భారత కుస్తీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టుచేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. ఈ దేశంలో ఇంకా కోర్టులు ఉన్నాయిగా అని ప్రశ్నించారు. 1983లో కపిల్‌ దేవ్‌ నాయకత్వంలోని క్రికెట్‌ బృందం ప్రపంచ కప్‌ సాధించడంతోనే క్రీడా రంగంలో భారత్‌ సత్తా విశ్వమంతటికీ తెలిసింది. దేశంలో ఉన్న చట్టాలు మహిళా మల్ల యోధుల విషయంలో అమలు కావాలని కపిల్‌ దేవ్‌ కోరారు. మల్ల యోధుల గోడు వినిపించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వీరు చెప్పారు. మూడు నెలలుగా వీరు పోరాడు తున్నా విననట్టు నటించడం కుదరదని అన్నారు.
మరో వేపున బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌పై దాఖలైన ఎఫ్‌.ఐ.ఆర్‌.లో నమోదైన అంశాల వివరాలు కూడా బయటపడ్డాయి. వీటిని పరిశీలిస్తే లైంగిక వేధింపులకు అంగీకరిస్తే వారికి క్రీడా రంగంలో మంచి అవకాశాలు కల్పిస్తానని బ్రిజ్‌ భూషణ్‌ అన్నట్టు స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు ఆయన మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటో తెలియదు. అభ్యంతరమల్లా తమ పార్టీ వారు ఏంచేసినా వారిని రెక్కల కింద పెట్టుకుని కాపాడడమే బీజేపీ విధానం అని తేలిపోతూనే ఉంది. ఇంకోవైపు మల్లయోధుల పోరాటానికి మద్దతు ప్రకటించిన రైతులు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నెల తొమ్మిదవ తేదీలోగా బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే మల్ల యోధులను మళ్లీ జంతర్‌ మంతర్‌ తీసుకెళ్తామని రైతు నాయకుడు రాకేశ్‌ తికైత్‌ హెచ్చరించారు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించి బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని రాకేశ్‌ తికైత్‌ గట్టిగా కోరారు. లేకపోతే దేశవ్యాప్తంగా పంచాయత్‌లు నిర్వహించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిని, ప్రభుత్వంలోని ఇతరులను కూడా కలుస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో ఖాప్‌ పంచాయత్‌లు అన్నీ ఒకే మాట మీదే ఉన్నాయని ఆయన చెప్పారు. కురుక్షేత్రలోని జాట్‌ ధర్మశాలలో శుక్రవారం ఒక ఖాప్‌ పంచాయత్‌ జరిగింది. ఇందులో హర్యాణా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. గురువారం కూడా ఉత్తరప్రదేశ్‌లో ఒక ఖాప్‌ పంచాయత్‌ నిర్వహించారు. సుధీర్ఘ కాలం నుంచి పోరాడుతున్నా తమమాట ఎవరూ వినిపించుకోనందువల్ల ఈ మల్ల యోధులు ఆత్మస్థైర్యం కోల్పోయే స్థితికి వచ్చారు. వారి కుటుంబాలు కూడా భీతావహమై ఉన్నాయి.
తమ భవిష్యత్తును కూడా లెక్కచేయకుండా తమబిడ్డలు ఉద్యమం చేస్తున్నారని వారి తల్లిదండ్రులు అంటున్నారు. తాడో పేడో తేల్చుకునే దాకా పోరాటం కొనసాగిస్తా మంటున్నారు. అగ్రశ్రేణి క్రీడాకారిణి, పరుగులరాణి పి.టి.ఉష ఈ మల్లయోధులనే తప్పుపట్టినా అంత ర్జాతీయ ఒలింపిక్‌ సంఘం కూడా గత ఆదివారం పోలీసులు మల్ల యోధుల విషయంలో వ్యవహరించిన తీరును తీవ్రంగా దుయ్యబట్టింది. రైతు సంఘాలవారు షాంలీలో 11వ తేదీన పంచాయత్‌ నిర్వహించ నున్నారు. ఆ తరవాత 15నుంచి18 మధ్య హరిద్వార్‌లో పంచాయత్‌లు నిర్వహించాలని తలపెట్టారు. అప్పటికీ పరిష్కారం కుదరకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘మేం విజ్ఞాపన పత్రాలు అందజేస్తూనే ఉంటాం’’ అని తికైత్‌ రాజకీయ నాయకులకు స్పష్టంగానే చెప్తున్నారు. అప్పటికీ వినిపించుకోకపోతే ఎక్కడికక్కడ రాజకీయ నాయకులను నిలదీస్తామని అంటున్నారు. అయితే ఈ ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతుందని తికైత్‌ హామీ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇంత జరుగుతున్నా కేంద్ర క్రీడా శాఖ మంత్రికి చీమ కుట్టినట్టయినా లేదు. అడపాదడపా ఈ విషయమై మాట్లాడే స్మృతి ఇరానీ మల్లయోధులను అవమానిస్తూనే ఉన్నారు. ఎంత తీవ్రమైన ఆందోళన జరుగుతున్నా నోరు మెదపక పోవడం ప్రధానమంత్రి మోదీ నైజం. పరిస్థితి చేయిదాటిపోతే బాధ్యత ఎవరిదో ఆయనే సమాధానం చెప్పాలిగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img