Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రైలు ప్రమాదంపై క్షుద్ర రాజకీయాలు

ఘోరాతి ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటైన బాలసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురై 275 మంది మరణించిన విషాదకరసమయంలో కూడా మోదీప్రభుత్వం క్షుద్ర రాజకీయాలనే అనుసరిస్తోంది. ముందు 288మంది మరణిం చారన్నారు. మృతుల ఖాతాలో పడ్డ 13 మంది సజీవంగా ఉన్నందుకు సంతోషించాలో లేక ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేనందుకు పరితపించాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిరది. పరిపాలనా సంబంధమైన కనీస ధర్మాలను పాటించడం కూడా ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉన్నట్టు లేదు. ఈ ప్రమాదం గురించి అధికారికమైన దర్యాప్తు ప్రారంభమైనా కాక ముందే నేరం ఎవరి మీదకో తోసేయాలన్న ఆత్రుత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముందే ప్రధానమంత్రి మోదీ ప్రకటించేశారు. అంటే ఎవరినో బలిచేయాలని ముందే నిర్ణయించుకున్నట్టే కదా. వ్యవస్థాగత లోపాలు ఉన్నాయా లేవా అనే విషయం మీద కనీస ఆలోచనచేసే ఉద్దేశం మోదీకి లేదని రుజువైంది. మరో వేపున రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రమాదానికి మూల కారణం ఏమిటో తెలిసిందంటున్నారు. కానీ ఆ మూల కారణం ఏమిటో మాత్రం వెల్లడిరచడానికి నిరాకరించారు. దీన్నిబట్టే ప్రభుత్వం ఈ విషాదకరమైన సంఘటనను ఏ దృష్టితో చూస్తోందో అర్థం అవుతోంది. అలాంటప్పుడు దర్యాప్తు అవసరం ఏమి ఉంటుందో! ఇంకోవేపు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కావాలని రైల్వే బోర్డు చెప్తోంది. ప్రమాదానికి కారణం ఏమిటో ఇప్పటి వరకు కచ్చితంగా తెలియదు. ఇది మానవ తప్పిదం అయినా కావచ్చు. లేదా సాంకేతికమైంది అయినా కావచ్చు. నాసిరకం సాంకేతికను అనుసరించడం ప్రభుత్వ బాధ్యత కాకుండాపోదు. తూర్పు తీరం నుంచి దక్షిణ తీరాన్ని కలిపే ఆ మార్గంలో ‘‘కవచ్‌’’ సాంకేతికత లేకపోవడం దారుణం. ప్రమాదాలు జరిగినప్పుడల్లా రైల్వేశాఖ మంత్రులు రాజీనామా చేయడం మహా అయితే నైతిక బాధ్యత వహించడం అవుతుంది. కానీ భవిష్యత్తులో ఇంత ఘోర ప్రమాదాలను నివారించడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. నైతిక బాధ్యత తీసుకోవడం మోదీ సర్కారుకు అలవాటులేని వ్యవహారం. రైళ్లు ఢీకొనడాన్ని నిరోధించే ‘‘కవచ్‌’’ వ్యవస్థ లేకపోవడానికీ ఈ ప్రమాదానికి సంబంధం లేదని కూడా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏకపక్షంగా తేల్చేశారు. ఈ మార్గంలో ‘‘కవచ్‌’’ వ్యవస్థ లేకపోవడానికి మాత్రం రైల్వే శాఖ మంత్రి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రధానమంత్రి మోదీ మాటలను చూసినా, రైల్వే మంత్రి సన్నాయి నొక్కులను గమనించినా ఈ ప్రమాదానికి వ్యవస్థాపరమైన లోపాలులేవని దబాయించే ప్రయత్నమే కనిపిస్తోంది. ‘‘భారత రైళ్లు పట్టాలు తప్పడం’’ పై 2022లో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సమర్పించిన నివేదికలోని అంశాలను కూడా ఈ ప్రభుత్వం పరిగణించడానికి సిద్ధంగా లేదు. ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే హిందువులు ఆ పక్కనే ఒక మసీదు ఉందనీ, ప్రమాదం జరిగింది శుక్రవారం అని వాదించి నెపాన్ని ముస్లింల మీదకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మృతులలో ముస్లింలు కూడా ఉన్నారన్న కనీస ఇంగితజ్ఞానం అయినా లేకపోవడం ముస్లింలపై విద్వేషం ఎంతగా పాతుకు పోయిందో అన్న వాస్తవానికే సంకేతం. ఈ వాదనను రైల్వేశాఖ మంత్రి ఖండిరచిన దాఖలాలు లేకపోవడం మరీ విచిత్రం. నిజానికి ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్నది మసీదు కాదు, ఇస్కాన్‌ దేవాలయం అని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రాధా రమణ్‌ దాస్‌ కుండబద్దలు కొట్టేశారు. ఆ తరవాత అయినా రైల్వే శాఖ మంత్రికి ఈ దుష్ప్రచారాన్ని ఖండిరచాలన్న ఆలోచనే తట్టలేదు. 

ఈ ప్రమాదానికి భద్రతా వ్యవస్థల లోపం కారణం అని ప్రభుత్వ పక్షం అంగీకరించడం లేదు. రైలు పట్టాలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించవలసిన బాధ్యత రైల్వేశాఖదే అయినా ప్రభుత్వం ఆ వాస్తవాన్ని అంగీకరించడం లేదు. అత్యంత వేగంగా నడిచే వందే భారత్‌ రైళ్ల మీదే ఎక్కువ దృష్టి పెడ్తున్నారు తప్ప ఉన్న రైలు మార్గాలను సురక్షితంగా ఉంచే బాధ్యత విస్మరిస్తున్నారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం అన్న సూక్తిని మాత్రం నిత్యం వల్లిస్తూనే ఉంటారు. ఈ ప్రమాదంలో మానవ తప్పిదం కూడా ఉంటే ఉండొచ్చు కానీ వ్యవస్థలో లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యవస్థను చక్కదిద్దే దృష్టి ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ప్రచార ఆర్భాటంతోనే కాలం గడపడానికి, గోరంత పనిచేసి కొండంతా ప్రచారం చేయడానికే మోదీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సిగ్నల్‌ వ్యవస్థను దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విషయంలో చేసిన హెచ్చరికలను మోదీ సర్కారు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. రవాణా, పర్యాటక, సంస్కృతి అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా రైల్వేల భద్రతపై చేసిన సిఫార్సులను నిర్లక్ష్యం చేస్తున్నారని దాపరికం లేకుండానే చెప్పింది. బాలసోర్‌ ప్రమాదం జరగడానికి కొద్ది గంటల ముందే రైల్వేమంత్రిత్వ శాఖలో కూడా రైల్వే భద్రతపై చర్చ దాటవేశారు. 2017-18, 2020-21 మధ్య జరిగిన ప్రమాదాల్లో అధికభాగం రైలు మార్గాలలో లోపాలు, ఇంజినీరింగ్‌ లొసుగులు, నిర్వహణా లేమివల్లే అని కాగ్‌ నివేదిక ఘోషించింది. అయినా ప్రభుత్వానికి పట్టలేదు. భారత రైల్వేలలో 3 లక్షల 11 వేల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో రైళ్లు నడిపే లోకో పైలెట్లతో సహా అన్ని స్థాయిల్లో ఉన్న సిబ్బందిపై పనిభారం విపరీతంగా పెరిగింది. దీనికి బాధ్యత ప్రభుత్వానిది కాదా? అనేక రైల్వే జోన్లలో కనీస మానవ వనరులు కూడా కరవే. సీబీఐ విచారణ జరిపించాలని కోరడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే. నేరాలను దర్యాప్తు చేయడానికి ఉద్దేశించిన సీబీఐ సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలపై దర్యాప్తు చేయదు అన్న ధ్యాస మోదీ సర్కారుకు లేక కాదు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐ దర్యాప్తు రాగం ఎత్తుకున్నారు. 2016లో కాన్పూర్‌లో రైలు ప్రమాదం జరిగి 150 మంది మరణిస్తే అప్పటి రైల్వేమంత్రి జాతీయ దర్యాపు సంస్థకు నిగ్గుతేల్చే బాధ్యత అప్పగించారు. ఈ దర్యాప్తులో తేలింది ఏమీలేదు. 2018లో ఎన్‌.ఐ.ఎ. దర్యాప్తు మానేసింది. కనీసం చార్జిషీట్‌ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ప్రస్తావన తీసుకు రావడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే. మసిపూసి మారేడుకాయ చేయడమే ఈ ప్రభుత్వ నైజం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img