Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ఎన్నికల్లేకపోతే జనం పస్తే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి. ఆయన నోటి వెంట ఏ మాటైనా వెలువడితే దాని ప్రభావం ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా కనిపించి తీరుతుంది. పైగా ఆయన మాటల గురి ఒక వేపు లక్ష్యం మరో వేపూ ఉండొ చ్చు. ఇటీవల ఆయన రేవడీలు (ఉచితాలు, తాయిలాలు) ఎంత అపకారం చేస్తాయో చెప్పారు. ఆయన ఈ మాట అన్న రాజకీయ సందర్భాన్ని బట్టి చూస్తే గుజరాత్‌ లాంటి రాష్ట్రాలలో కాలు మోప డానికి ప్రయత్నిస్తున్న దిల్లీ ముఖ్యంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించే ఉచితాల మీద దాడి చేస్తున్నట్టు కనిపించి ఉండవచ్చు. కానీ ఉచి తాలవల్ల అనర్థం అన్న మోదీ మాట ప్రభావం ఈ నెల నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని 15 కోట్ల మంది ప్రజల మీద పడబోతోంది. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో రేషన్‌ కార్డులున్న కుటుంబాలకు గోధుమలు, బియ్యం ఉచితంగా దొరికేవి. కరోనా మహమ్మారి కాటేసిన కాలంలో ఉచితంగా ఆహార ధాన్యా లు సరఫరా చేసే విధానం అమలులోకి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరవాత ఈ ఉచిత ఆహార ధాన్యాల సరఫరాకు స్వస్తి చెప్పాలను కున్నారు. కానీ గత ఫిబ్రవరి-మార్చిలో శాసన సభ ఎన్నికలు ఉన్నందువల్ల ఈ గడువు పొడిగించారు. వచ్చే నెల నుంచి అయిదు కిలోల ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ ఆగిపోతుంది. ఉచితంగా గోధుమలు, బియ్యం సరఫరా చేయడం ఆగస్టు నుంచి నిలిపి వేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెల రేషన్‌ సెప్టెంబర్‌లో అందుతుంది. ఇక మీద రేషన్‌ కార్డులున్న వారు కిలో గోధుమలు రెండు రూపాయలు, కిలో బియ్యం మూడు రూపాయలు ఇచ్చి కొనాల్సిందే. బియ్యం, గోధుమల ఉచిత సరఫరా ఆపివేసినా నెలకు ఒక లీటర్‌ వంట నూనె, కిలో ఉప్పు, కిలో శెనగలు మాత్రం ఉచితంగానే అందిస్తారట. ఉత్తరప్రదేశ్‌లో రేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాలు 3 కోట్ల 60 లక్షల మంది. వీరిలో అంత్యోదయ పథకం కిందకు వచ్చే కుటుంబాలు దాదాపు మూడు కోట్లు ఉంటాయి. స్థిరమైన ఆదాయం లేని కుటుంబాలకు అంత్యోదయ రేషన్‌ కార్డులు ఇస్తారు. అంటే నిరు పేదలకు ఈ సదు పాయం ఉంటుంది. అంత్యోదయ పథకం కింద రేషన్‌ కార్డు ఉన్న వారికి నెలకు కిలో రెండు రూపాయల చొప్పున 14 కిలోల గోధుమలు, కిలో మూడు రూపాయల చొప్పున 21 కిలోల బియ్యం అందుతాయి. మామూ లు రేషన్‌ కార్డులున్న వారికి కిలో రెండు రూపాయల చొప్పున రెండు కిలోల గోధుమలు, కిలో మూడు రూపాయల చొప్పున మూడు కిలోల బియ్యం అందుతాయి. ఉచిత రేషన్‌ సరఫరా నిలిపివేసి నందువల్ల ఎక్కు వగా ఇబ్బంది పడేది రోజు కూలీలే. కరోనా కష్ట కాలంలో, ఎన్నికల పుణ్య మా అని ఉచిత రేషన్‌ అందినందువల్ల చాలా కుటుంబాలు బతుకు వెళ్ల దీయడం కొంతైనా సులభం అయింది. కరోనా సమయంలో ఉపాధి కోల్పో యిన వారిలో చాలా మందికి మళ్లీ పని దొరకడమే లేదు. ఇలాంటి వారు ఉచిత రేషన్‌ ఆగిపోయినందువల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది. ఉపాధి లేనందువల్ల ఆదాయం ఉండదు కనక తక్కువ ధరకే అయినా రేషన్‌ దుకాణంలో ఆహార ధ్యాన్యాలు కొనగలిగే పరిస్థితి లేదు.
మరో వేపు అతివృష్టి, అనావృష్టి రెండూ రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తి, మరి కొన్ని చోట్ల అనావృష్టివల్ల పంటలు చేతికి అందలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న రైతుల మనుగడ కూడా ఉచిత రేషన్‌ ఆగిపోతే దుర్లభమే అవుతుంది. నిజానికి 2021 జులై ఆఖరుకల్లా ఉచిత ఆహార ధాన్యాల సరఫరా నిలిపి వేయాలని యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం భావించినా ఆ ప్రతిపాదన వెనక్కు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టం జరిగింది కనక, కరోనా సమయంలో కోల్పోయిన ఉపాధి అనేక మందికి ఇప్పటికీ మళ్లీ దొరకలేదు కనక ఉచిత ఆహార ధాన్యాల సరఫరా కొనసాగిస్తే సముచితంగా ఉండేది. ఎన్నికల సమ యంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయోగించిన చిట్కాలు ఎల్ల కాలం కొనసాగవుగదా. మోదీ హయాంలో ఓట్లు రాల్చని ఏ పథకమూ ప్రజాప్రయోజనం కోసం నిరంతరంగా సాగదు. ఏ ప్రభుత్వం ఎవరికైనా ఏ సదుపాయమైనా ఉచితంగానో, తక్కువ ధరకో అందిస్తోంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఆ పథకంవల్ల ఓట్లు రాలాలి. ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టడానికి ఉపకరించాలి. కనీసం తమది జన సంక్షేమా నికి కట్టుబడి ఉందన్న భ్రమైనా కల్పించగలగాలి. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పట్లో ఎన్నికలు లేవు. రెండవసారి వరసగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తరు ణంలో ఇక ఓటర్లతో పనేముంటుంది? సంక్షేమ రాజ్యం, ప్రజా సంక్షేమం అన్న మాటలను రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎన్నికలలో ప్రయోజనం పొందడానికే వాడుతుంటాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వాలు ఉచితంగానో, సబ్సిడీ ధరకో తక్కువ ధరకో అందించినా దానివల్ల జనం పరిస్థితి మెరుగు పడడానికి దోహదం చేయాలి. ప్రజలు వాళ్ల సొంతకాళ్ల మీద నిలబడడానికి ఇలాంటి పథకాలు కొంతకాలం ఊతకర్రల్లా మాత్రమే ఉపయోగపడాలి. కానీ ప్రభుత్వాలు రూపొందించే ఏ సంక్షేమ పథకమైనా రాజకీయ లబ్ధి లక్ష్యంగానే ఉంటుంది తప్ప అసలైన జనాభ్యుదయానికి లేశమంత కూడా ఉపకరించదు. ప్రజల పరిస్థితి మారనంత కాలం ఉచితాల కోసం నోరు తెరుచుకుని ఎదురు చూడడమూ ఆగదు. ఇలాంటి పథకాల ఆధారంగా స్వావలంబన సాధించా మన్న భరోసా గత ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూ కలగనేలేదు. ప్రజల ఆర్థిక స్థితి మారకపోగా ఆత్మాభిమానం కూడగట్టుకునే అవకాశమే రాలేదు. దీన్నిబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రూపొందించడంలోనే మౌలికమైన లోపం ఉందనిపిస్తోంది. ఊతకర్రల అవసరం శాశ్వతంగా ప్రజలకు ఉండ కూడదు. కానీ అవి అనవసరమయ్యే రూపంలో ప్రభుత్వాలు వాటిని తయా రు చేయవు. ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి బతికే అవసరం ఉన్నన్నాళ్లే తమ వాగ్దానాలకు చెలామణి ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కోసం దశాబ్దాల తరబడి ప్రభు త్వ ఖజానా నుంచి పెడ్తున్న ఖర్చు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే పనికి వస్తొంది. ఆ సహాయం అవసరమైన వారు నిలదొక్కు కోవడానికి, ఆ తరవాత స్వయం శక్తి మీద నిలబడడానికి ఏ మాత్రం ఉపకరించడం లేదు. జన జీవనం మెరుగుపడాలన్న భావన ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఉచితాలు ఓట్లు లాగ డానికి ఎరగా వాడుకోవడం మినహా మరో లక్ష్యం లేనంత కాలం సంక్షేమం అసాధ్యమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img