Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శేష ప్రశ్నలు మిగిల్చిన జుబేర్‌ విడుదల ఉత్తర్వు

వివిధ మాధ్యమాలలో వచ్చే వార్తల్లో సత్యాసత్యాలను బేరీజు వేసి తేల్చి చెప్పే ‘‘ఆల్ట్‌ న్యూస్‌’’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబేర్‌ దాదాపు మూడు వారాలు జైలులో గడిపిన తరవాత సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడం, చీటికి మాటికి ఎవ రినీ నిష్కారణంగా అరెస్టు చేయడానికి వీల్లేదని మరోసారి హితవు పలకడం చూస్తే మన అనేక వ్యవస్థలు ఎంత గందరగోళంగా ఉన్నాయో అర్థం అవుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారమైతే జుబేర్‌ లాంటి వారి మీద వచ్చిన ఆరోపణల ఆధారంగా ఎవరినీ అరెస్టు చేయవలసిన అవసరమే లేదు. అత్యుత్సాహంతో పోలీసులు అరెస్టు చేశారే అనుకుందాం మెజిస్ట్రేట్లు బెయిలు ఇవ్వకుండా పోలీసులు అడిగినట్టల్లా పోలీసు రిమాండుకో, జ్యుడీషియల్‌ రిమాండుకో ఏ ఆధా రంగా పంపిస్తారో తెలియదు. సుప్రీంకోర్టుతో సహా వివిధ స్థాయిల్లోని న్యాయస్థానాలు, వాటిలో పని చేసే న్యాయమూర్తులు ఏ లెక్కన నిర్ణయాలు తీసుకుంటున్నారో, తీర్పులు చెప్తున్నారో, బెయిలు మంజూరు చేస్తున్నారో, నిరాకరిస్తున్నారో అంతుపట్టడం లేదు. చిల్లరమల్లర కారణాలతో పోలీసులు కేసులు నమోదు చేయడమే హాస్యాస్పదం. చట్టాలు అందరికీ సులభంగా ఓ పట్టాన అర్థం కావనీ, శాసన పరిభాష సంక్లిష్టంగా ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిభాష సుశిక్షితులైన పోలీసు ఉన్నతాధికార్లకు, వివిధ స్థాయిల్లో తీర్పులు చెప్పే మేజిస్ట్రేట్లకు, జడ్జీలకు అర్థం కాని పరిస్థితి ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. జుబేర్‌ మీద మోపిన ఆరోపణే విచిత్రం అయింది. 1983లో హృషీకేశ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘‘కిసీసే నా కెహనా’’ సినిమాలోని హాస్యస్ఫోరకమైన ఓ భాగాన్ని జుబేర్‌ 2018లో ట్వీట్‌ చేశారట. దాని మీద నాలుగేళ్ల తరవాత హనుమాన్‌ భక్తుడినని చెప్పుకునే ఒక వ్యక్తి జుబేర్‌ ట్విట్టర్‌లో ఉంచిన ట్వీట్‌ వల్ల తన మతపరమైన భావనలకు విఘాతం కలిగిందని ఫిర్యాదు చేశారట. అంతే! జుబేర్‌ను అరెస్టు చేస్తారు. కోర్టులు బెయిలు నిరాకరిస్తూ పోతాయి. ఒకే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లోని వివిధ చోట్ల జుబేర్‌ మీద అరడజను ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదైనాయి. అన్నిం టికీ ఆధారం నాలుగేళ్ల నాటి హాస్యస్ఫోరకమైన ట్వీటే. ఒక కేసులో ఒక కోర్టు బెయిలు మంజూరు చేసేలోగా మరో ప్రాంతంలోని పోలీసులు జుబేర్‌ విడుదల కాకుండా చూడడానికి మరో ఎఫ్‌.ఐ.ఆర్‌. పట్టుకుని సిద్ధంగా ఉంటారు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని జుబేర్‌ బయటపెట్టకుండా ఉంటే ఆయనను ఇలాగే నిర్బంధించేవారా? న్యాయమూర్తులు భిన్న సందర్భాలలో విభిన్నమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అంతుచిక్కదు. అరెస్టు చేసే అధికారాన్ని చాలా జాగ్రత్తగా, అరుదుగా వినియోగించుకోవాలని సుప్రీం కోర్టు హితవు పలికింది. ఈ రకమైన కేసులు, అరెస్టులు, బెయిలు ఇవ్వడం, నిరాకరించడం ఇంతకు ముందూ లెక్కలేనన్ని సార్లు జరిగాయిగా! అప్పుడు చట్టం ఏం చెప్తోందో, భారత శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్‌ ఆధారంగా ఎవరి మీద దోషారోపణ చేయాలో, నేర విచారణా ప్రక్రియ (సి.ఆర్‌.పి.సి.) ప్రకారం విచారణ ఎలా కొనసాగాలో పదేపదే సుప్రీంకోర్టు గుర్తు చేయ వలసిన అవసరం ఎందుకొస్తుందో తెలియదు.
ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని ఏ సందర్భంలో అరెస్టు చేయాలో, ఎప్పుడు అరెస్టు చేయకూడదో కచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. సి.ఆర్‌.పి.సి.లోని సెక్షన్‌ 41(1)(బి) లోని నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించడానికి, లోతైన విచారణ అత్య వసరమైనప్పుడు, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న అనుమానం ఉన్న ప్పుడు, సాక్ష్యులని బెదిరిస్తారన్న అనుమానం ఉన్నప్పుడు, పారిపోతాడన్న భయం ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు చేయాలి. అదీకాక మూడేళ్ల కన్నా మించని శిక్ష పడే సందర్భాలలో, హేయమైన ఆరోపణలున్నప్పుడు ఏడేళ్లకు మించని శిక్ష పడే సందర్భాలలో నిందితులను అరెస్టు చేయవలసిన అవ సరమే లేదని అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో చెప్పింది. బెయిలు విషయంలో ఇదివరకే అనేక నిబంధనలు, చట్టాలు ఉన్నప్పటికీ బెయిలుకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రభుత్వానికి సూచించింది. 1994లో జోగీందర్‌ కుమార్‌కు ఉత్తరప్రదేశ్‌కు మధ్య కేసులోÑ 2014నాటి అర్నేశ్‌ కుమార్‌కు బిహార్‌ ప్రభుత్వానికి మధ్య కేసులో సుప్రీంకోర్టు అత్యవసరమైతే తప్ప అరెస్టు చేయకూడదనిÑ బెయిలు ఎవరికైనా హక్కు అనీ, అరెస్టు అరుదుగా జరగాల్సిందని చెప్పింది. అయినా హత్రస్‌ సంఘటనపై వార్త రాయడానికి హత్రస్‌ వెళ్తున్న సిద్దీఖ్‌ కప్పన్‌ను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు 2020లో అరెస్టు చేస్తే ఇంతవరకు బెయిలు ఎందుకు దొరకలేదో, కశ్మీర్‌లో ఫహీద్‌ షాను, జార్ఖండ్‌లో రూపేశ్‌ కుమార్‌ వంటి పత్రికా రచయితలతోపాటు కళాకారు లను, రచయితలను బెయిలు ఇవ్వకుండా, విచారణా జరపకుండా ఏళ్ల తరబడి ఎందుకు జైళ్లల్లో మగ్గేట్టు చేస్తున్నారో అన్న ప్రశ్నకు జుబేర్‌ విష యంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సమాధానం చెప్పడం లేదు. అందుకే 2021లో హత్యకు గురైన జర్నలిస్టులు మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. ముప్పు ఎదురవుతున్నది కేవలం పత్రికా స్వేచ్ఛకే కాదు. జాతీయ భద్రతా చట్టం, భారత్‌ శిక్షా స్మృతిలోని దేశ ద్రోహానికి వర్తించే సెక్షన్‌, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం మొదలైనవాటిని మోదీ ప్రభుత్వం ప్రత్రికా రచయితలతో సహా తమకు ప్రత్యర్థులైన వారి మీద విచ్చలవిడిగా వినియోగిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు అడ్డు పడిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టేన్ని కూడా లేవు. జుబేర్‌ను అరెస్టు చేసినప్పుడు దాఖలు చేసిన ఎఫ్‌.ఐ. ఆర్‌. ప్రకారం ఆయన మీద భిన్న వర్గాల మీద వైరం పెంచుతున్నారని భారత శిక్షాస్మృతిలోని 153(ఎ) సెక్షన్‌, 295 సెక్షన్‌ కింద కేసులు నమో దయ్యాయి. కాని జుబేర్‌ను రిమాండుకు పంపినప్పుడు మాత్రం 295 (ఎ) సెక్షన్‌ ప్రకారం అన్నారు. జుబేర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పదు. పోలీసు అధికారులు అధికార పక్షం ఆదేశాల ప్రకారం నడుచుకుంటారంటే నమ్మొచ్చు. కానీ విభిన్న మేజిస్ట్రేట్లు కూడా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాన్ని సమర్థిస్తున్నట్టుగా ఎందుకు వ్యవహరించవలసి వస్తోందో తెలియదు. న్యాయ వ్యవస్థకు ఉన్న స్వతంత్రతను మేజిస్ట్రేట్లు, జడ్జీలు ఎందుకు కాపాడ లేకపోతున్నట్టు? ప్రస్తుత రాజకీయ వాతావరణం మేజిస్ట్రేట్లను, న్యాయ మూర్తులనూ ప్రభావితం చేస్తోందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఉన్న చట్టాలు పౌరులకు రక్షణ కల్పించడానికి కాక రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికి వినియోగిస్తుంటే న్యాయ వ్యవస్థ అడ్డుపడిన సందర్భాలెన్ని? జుబేర్‌ విడుదలైనా శేషప్రశ్నలు అనేకం అలాగే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img