Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

ప్రతిపక్షాల నిరాసక్తత

భావి రాష్ట్రపతి ఎవరు అన్న విషయం ఎన్నిక జరగక ముందే తేలిపోయింది. మోదీ సర్కారు నిలబెట్టిన ద్రౌపది ముర్ము విజయం ఖాయమని, ప్రతిపక్ష అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హా ఎంత పోరాడినా పరాజయం తప్పదనీ తెలుసు. అయితే ఓడిపోతానన్న వాస్తవం యశ్వంత్‌ సిన్హాకు తెలియక కాదు. ఆయనకన్నా ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన శరద్‌ పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ పోటీ చేయడానికి నిరాకరిస్తే చివరకు యశ్వంత్‌ సిన్హాను రంగంలోకి దింపారు. అయితే ఆయన ముందు నుంచీ ఇది సైద్ధాంతిక పోరాటం అని చెప్తూనే ఉన్నారు. ఈ లక్ష్యం ఎంత వరకు నెరవేరింది అన్నది చర్చనీయాంశమే. నిజానికి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా నిర్ధారించినప్పుడు ఏ సైద్ధాంతిక పోరాటం అన్నది ప్రతిపక్షాలకు కచ్చితమైన వైఖరి ఏమైనా ఉందా అన్నదీ అనుమానమే. అభ్యర్థులను నిర్ణయించక ముందు కూడా అధికారంలో ఉన్న బీజేపీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే వారే రాష్ట్రపతి అవుతారన్నదీ రహస్యం ఏమీ కాదు. ఒక్కసారి మినహా ఎప్పుడూ అధికార పక్షం నిలబెట్టిన అభ్యర్థే రాష్ట్రపతి అయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో మాత్రం కాంగ్రెస్‌ అధికారికంగా నిర్ణయించిన అభ్యర్థిని కాదని ఆమె వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడితే ఆయన గెలిచేశారు. దీనికి కారణం ఇందిరా గాంధీ చేతిలో అధికారం ఉండడమే. అంటే అధికారం ఎవరి చేతిలో ఉంటే వారు నిలబెట్టిన అభ్యర్థే గెలుస్తారు. ఎంతమంది పోటీ చేసినా గెలిచేది చివరకు ఒక్కరే కనక ఓటమి నిరాశ పరచనక్కర్లేదు. పోటీ చేయడానికి గెలుపుతో పాటు ఇతర లక్ష్యాలు, భవిష్యత్‌ ఆలోచనలు, ఊహలు, అవకాశాలూ ఉంటాయి. ఈ దృష్టితో చూస్తే యశ్వంత్‌ సిన్హా పోటీ చేయడానికి అంగీకరించడం నిజానికి ప్రతిపక్షానికి చాలా అనుకూలమైన అంశంగానే భావించాలి. ఆయన అంగీకరించకపోతే ప్రతిపక్షం ఏం చేసేదో ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారమే. ఓటమి తప్పదని తెలిసినా పోటీ చేయడానికి నిర్దిష్టమైన కారణాలుంటాయి. లక్ష్యాలూ ఉండాలి. ఒక రాజకీయ సందేశం ఇవ్వడం, భవిష్యత్‌ చిత్రపటాన్ని గీసే ప్రయత్నం చేయడం లాంటి ఉద్దేశాలు ఏవో ఉండవలసిందే. ఈ కోణం నుంచి చూస్తే యశ్వంత్‌ సిన్హా అభ్యర్థిత్వాన్ని నిర్ణయించిన దశలో ప్రతిపక్షాల ఐక్యతకు ఇది పునాదిగా ఉంటుందన్న ఆశ కలిగింది. చివరకు ఆ ప్రతిపక్ష ఐక్యత కూడా ప్రశ్నార్థకంగానే మిగిలి పోయింది. యశ్వంత్‌ సిన్హాను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన ప్రచారానికి చేసిందేమీ లేకపోగా ముర్ము విషయంలో సందేహాస్పదంగా మాట్లాడారు. ఇది ప్రతిపక్షాలను గందరగోళపరిచింది. ఇక దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతో కలిసి రాకపోవడం ప్రతిపక్షాల ఐక్యతపై సందేహాలను కలుగజేస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ.లో భాగస్వామ్యం లేని బిజూ జనతా దళ్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ, అన్నా డి.ఎం.కె., అకాలీ దళ్‌, శివసేనలోని రెండు వర్గాలు ఎన్‌.డి.ఎ. అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయించుకోవడంవల్ల మొత్తం ఓట్లలో అధికార పక్షానికి గెలవడానికి తగినంత బలం లేకపోయినా ముర్ము గెలుపు సునాయాసమైంది. ఊహించిన దానికన్నా ఎక్కువ మద్దతే ఆమెకు దక్కింది. రాష్ట్రపతి స్థానం అలంకార ప్రాయమైందే కావచ్చు. కానీ రాజ్యాంగ పరిరక్షణ ఆ పదవిలో ఉన్న వారి ప్రధాన బాధ్యత. అది ఎవరు ఏ మేరకు నిర్వహించారు, ఇక ముందు ముర్ము ఏ మేరకు నిర్వర్తిస్తారు అన్నది కచ్చితంగా చర్చనీయాంశమే. కానీ ప్రభుత్వ వైఖరి రాజ్యాంగబద్ధం కాదనుకున్నప్పుడు నిలువరించిన రాష్ట్రపతులూ గతంలో ఉన్నారు. లేదా ప్రభుత్వ పక్షానికి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉండకూడని అంశాలు ప్రస్ఫుటంగా కనిపించడమే అసలు సమస్య. అనుక్షణం ఎన్నికలలో విజయం ఎలా సాధించాలో మోదీ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. ఇదివరకు బీజేపీ కేవలం మతతత్వాన్ని వెనకేసుకొచ్చే పార్టీ, అగ్రవర్ణాల పార్టీ అన్న అభిప్రా యం ఉండేది. మోదీ నాయకత్వంలో మతంతో పాటు కుల సమీకరణలను, అందులోనూ అగ్ర, నిమ్న కులాలవల్ల కలిగే ప్రయోజనాలనూ బీజేపీ అద్భుతంగా వినియోగించుకోగలుగుతోంది. ప్రతి అంశంలోనూ రాజకీయ కోణాన్ని వెతకడంలో, ప్రయోజనాన్ని ఆశించడంలో మోదీని మించిన వారు లేరు. ఆయన అధికారంలోకి వచ్చిన తరవాత రాజకీయ క్రీడ నియమ నిబంధనలు మారిపోయాయి. ప్రతిపక్షాలు ఇంకా పాత నియమాల ప్రకారమే నడుచుకోవాలనుకోవడమే ముర్ముకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఓట్లు రావడానికి ప్రధాన కారణం. రాజకీయాల తీరు తెన్నులు, నియమాలు, భాష, సరిహద్దులు సమూలంగా మారిపోయిన వాస్తవాన్ని ప్రతిపక్షాలు ఎందుకు గుర్తించడంలేదో అంతుపట్టదు. కాంగ్రెస్‌ ఎంత నీరసించి పోయినా దేశమంతటా ఇప్పటికీ అస్తిత్వం పూర్తిగా చెరిగిపోని పార్టీ అదొక్కటే. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడం దగ్గర్నుంచి మొదలుకొని అన్ని దశల్లోనూ కాంగ్రెస్‌ నిరాసక్తంగానే వ్యవహరించింది. ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యత నిర్వర్తించనే లేదు. ప్రతిపక్షాల అగ్రనాయకులెవరూ రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు సమీకరించడానికి పెద్దగా చేసిందేమీ లేదు. యశ్వంత్‌ సిన్హా ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. దానికోసమైనా ఆయనను అభినందించవలసిందే. అదీగాక బి.ఎస్‌.పి.తో పాటు చాలా ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షంవేపే మొగ్గుతున్నాయి. కనీసం అధికార పక్షానికి సైద్ధాంతికంగా గట్టి సవాలు విసరడంలోగానీ, అభ్యర్థిని నిర్ణయించడంలో వివిధ సమీకరణలను దృష్టిలో ఉంచుకోవడంలో గానీ ప్రతిపక్షాలు శ్రద్ధ తీసుకున్న దాఖలాలే లేవు. యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి అయితే రాజ్యాంగ పరిరక్షణకు ఏ మేరకు కట్టుబడి ఉండేవారో చర్చించడం ఇప్పుడు అనవసరం. కానీ గిరిజన అభ్యర్థి అయిన ముర్ము రాష్ట్రపతి కావడంవల్ల కనీసం ఆ వర్గ ప్రయోజనాలన్నా పదిలంగా ఉంటాయన్న నమ్మకం ఇసుమంత కూడా లేదు. గిరిజన భూములు స్వాధీనం చేసుకోవడానికి గ్రామసభల ఆమోదం పొందాలన్న నియమాన్ని తొలగించేశారు. ఇది పూర్తిగా గిరిజన ప్రయోజనాలకు ప్రమాదకరం. దాన్నీ ముర్ము తిరగదోడలేరు అని మాత్రం కరాఖండీగా చెప్పొచ్చు. జల్‌, జంగిల్‌, జమీన్‌ అన్న గిరిజనుల ప్రధాన ఆకాంక్షలను ముర్ము నెరవేర్చగలరని కలలోనైనా ఊహించలేం. రాష్ట్రాల స్థాయిలో బీజేపీని ఎదుర్కునే శక్తి ఉన్న పార్టీలు ఇంకా ఉన్నాయి కానీ జాతీయ రాజకీయాలలో మోదీకి ఎదురే లేకుండా పోతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ప్రతిపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్‌ వైఫల్యం అత్యంత ఘోరంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నిక కుల మతాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక లక్ష్యాన్ని కూడా ఏ ప్రధాన రాజకీయ పార్టీ నొక్కి చెప్పలేక పోయింది. బీజేపీ ఆశీస్సులు ఎవరికి ఉంటే విజయం వారిదే అన్న స్థితికి దేశ రాజకీయాలు చేరుకున్నాయి. ఎంత అలంకార ప్రాయమైన పదవి అయినా దానికి ఉండే గౌరవం కూడా మోదీ ఓట్ల దాహానికి బలి అవుతోంది. ఇదే అసలు విషాదం. రాజకీయ దిశను మార్చడానికి వచ్చిన మరో అవకాశాన్ని ప్రతిపక్షాలు వదులుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img