Monday, March 27, 2023
Monday, March 27, 2023

అలీకి ఎంపీ పదవి?

సీఎంతో కీలక భేటీ
మైనార్టీ కోటాలో బెర్తు !
త్వరలో మంచి శుభవార్త చెబుతామన్నారు: అలీ

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి: ప్రముఖ సినీ నటుడు అలీకి వైసీపీ కోటాలో త్వరలో రాజ్యసభ సీటు ఖరారవుతున్నట్లు తెలిసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ త్వరలో తనకు శుభవార్త వస్తుందని సీఎం చెప్పారన్నారు. దీంతో అలీకి దాదాపు రాజ్యసభ సీటు ఖరారైనట్లు సమాచారం. దానిపై వైసీపీ అధికారికంగా వెల్లడిరచాల్సి ఉంది. త్వరలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి అలీకి ఇస్తున్నట్లుగా ప్రచారముంది. వైసీపీలో అలీ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్టును వైసీపీ ఖరారు చేసినప్పటికీ, సమయం లేనందున నిరాకరించారు. ఆ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఖాళీల్లో అలీకి పదవి దక్కుతుందని భావించారు. సామాజిక సమీకరణల్లో భాగంగా అలీకి అది వైసీపీ ఇవ్వలేకపోయినట్లు తెలిసింది. ప్రస్తుత వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులలో మైనార్టీ వర్గాలకు చెందిన వారెవ్వరూ లేరు. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో రాబోయే రాజ్యసభ సీట్ల ఖాళీల్లో అలీకి దాదాపు బెర్తు ఖరారైనట్లుగా సమాచారముంది.
త్వరలో శుభవార్త ఉందన్నారు: అలీ
సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో అలీ మాట్లాడుతూ, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తనకు పిలుపు రావడంతోనే తాను కుటుంబ సమేతంగా జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశానని, త్వరలో తనకు శుభవార్త అందుతుందని చెప్పారన్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం కలిశానని తెలిపారు. రాజ్యసభ సీటు ఖరారుపై ఆయన స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించారు. తాను ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చానని, త్వరలోనే నా పదవిపై వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి రెండు వారాల్లో ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని చెప్పలేదని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు మొదటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖరెడ్డి పాదయాత్ర చేశాక ఆయనను కలిశానని వివరించారు. జగన్‌తో తనకు ముందు నుంచే పరిచయం ఉందని, ఇటీవల సినిమా ప్రముఖులను సీఎం పిలిపించిన సమయంలో అవమానించారనే ప్రచారం అవాస్తమని ఖండిరచారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నానని చెప్పారు. సామాన్యులకూ సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచనని, త్వరలో తెలుగు సినిమా కష్టాలు తీరుతాయన్నారు. చిన్న సినిమాకు లాభం ఉండాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img