Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

ఆ పెద్దలు ఎవరు?

విజయసాయిరెడ్డి, అదానీ కుటుంబానికి సీట్లు ఖరారు!

మరో ఇద్దరిపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ
బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అవకాశం
ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
జూన్‌ 10న రాజ్యసభ ఎన్నికలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేయడంతో అధికార వైసీపీలో ఉత్కంఠ ప్రారంభమైంది. పెద్దల సభకు ఎవరు వెళతారనే అంశంపై రాష్ట్రంలోని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు వైసీపీ అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం ఉండడంతో, ఆ పార్టీలో మరింత ఆతృత పెరిగింది. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీపార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి మరలా రాజ్యసభ సీటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదానీ కుటుంబానికి కూడా మరో సీటు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ప్రస్తుతం నాలుగు స్థానాల్లో గెలవాలంటే సగటున ఒక్కో సీటుకు 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్న ఎమ్మేల్యేల సంఖ్య చాలా తక్కువగా కావటంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. అందువల్ల వైసీపీలోనే రాజ్యసభ ఎన్నికల హడావుడి కనపడుతోంది. ఒకటి ఓసీ, రెండోది పారిశ్రామికవేత్తకు కేటాయించనున్నట్లు తేలిపోవడంతో మిగిలిన రెండు బీసీ, ఎస్సీ, మైనార్టీల నేతలకు ఇచ్చే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన నేతలు తమకున్న ప్లస్‌ పాయింట్లను అనుయాయుల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఆశావాహులు సీఎం జగన్‌ ఆశీస్సుల కోసం తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. 2020లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ (శెట్టి బలిజ), మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార)లను సీఎం జగన్‌ ఎంపిక చేసి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు కూడా కనీసం ఒక సీటు బీసీలకు ఖాయమని భావిస్తున్నారు. రెండు సీట్లు బీసీ వర్గాలకే కేటాయించినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని నేతల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే నెల్లూరుకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయిస్తే ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణికి అవకాశం దక్కవచ్చంటున్నారు. జగన్‌ కేసుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, రెడ్డి సామాజికవర్గం కోటాలో విజయసాయి రెడ్డి ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువేనని విశ్లేషిస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి, సినీరంగం నుంచి ఆలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మైనార్టీ వర్గానికి సీటు కేటాయించే అవకాశం ఉంటే తొలినుంచి జగన్‌కు వీరవిధేయుడైన ఆలీని ఎంపిక చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. అలాగే ఎస్సీ కోటా నుంచి కూడా కొందరు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే ఈ నాలుగు పేర్లపై ఒక నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఖరారు చేసిన పేర్లను వచ్చే వారం అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు జూన్‌ 10న జరుగుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img