Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

 కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ఇకలేరు. ఈ రోజు (గురువారం రాత్రి) ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం కె. విశ్వనాథ్‌ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్‌ ఇష్యూస్‌ సీరియస్‌ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. విశ్వనాథ్‌ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్‌. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్‌, ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్‌ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్‌ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు. సినిమాల్లో విశ్వనాథ్‌ కెరీర్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌ గా మొదలైంది. వాహిని స్టూడియోస్‌ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన ‘పాతాళ భైరవి’ చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.

‘శంకరాభరణం’తో జాతీయ పురస్కారం
విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు… జాతీయ అవార్డు కూడా వచ్చింది. ‘బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ ఫర్‌ ప్రోవైడిరగ్‌ హోల్‌ సమ్‌ ఎంటర్టైన్మెంట్‌’ విభాగంలో నేషనల్‌ అవార్డు అందుకుంది. ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’ సినిమాలకూ నేషనల్‌ అవార్డులు వచ్చాయి. ‘స్వాతి ముత్యం’ సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్‌ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.

తొలి సినిమాకు నంది
‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘చెల్లెలి కాపురం’, ‘శారదా’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’ చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.

పద్మశ్రీ విశ్వనాథ్‌
చిత్రసీమకు విశ్వనాథ్‌ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు. ‘శుభ సంకల్పం’ సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్‌ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్‌ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్‌ ఫేర్‌ సత్కరించింది. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.

చిరంజీవి భావోద్వేగం..
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. ట్విటర్ వేదికగా స్పందించారు. వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధమని, అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధమంటూ ఒక్క మాట ద్వారా ఇద్దరి అనుబంధాన్ని వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందని గుర్తుచేసుకున్నారు. ‘‘ ఇది అత్యంత విషాదకరమైన రోజు. కే.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగుజాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన మహా దర్శకుడు ఆయన. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిచిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావిదర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం ఆ మహానీయుడి ఐకానిక్ చిత్ర ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.’’

కళాతపస్వి మరణం తీవ్ర విచారకరం: బాలకృష్ణ
కళాతపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలన పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వకారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చి.. ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురి చేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img