Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్వారీల తవ్వకాలకు హద్దుల్లేవ్‌!

ఆవగింజంత అనుమతితో కొండలను కొల్లగొడుతున్న లీజుదారులు

. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
. బ్లాస్టింగ్‌ ధాటికి ఇళ్లు బీటలువారుతున్నాయని గ్రామస్తుల గగ్గోలు
. కాలపరిమితి మించినా యథేచ్ఛగా నల్లరాయి తరలింపు
. ప్రభుత్వ ఆదాయానికి గండి

ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో నిబంధనలకు పాతరేసి నల్లరాతి క్వారీలను లీజుదారులు కొల్లగొడుతున్నారు. ఆవగింజంత అనుమతి తీసుకుని కొండలను పిండి చేస్తున్నారు. హద్దులు దాటి మరీ నల్లరాయిని గుల్ల చేస్తున్నా అధికారులు మామూళ్లమత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదు. రిగ్‌ బ్లాస్టింగ్‌ ధాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. కాలపరిమితి మించినా రాజకీయ నాయకుల అండతో కొండను పిండి చేసి సామర్థ్యానికి మించి టిప్పర్లకు లోడ్‌చేసి దోచుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు బరితెగించి తవ్వుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వాదాయానికి గండికొడుతున్న కేటుగాళ్లపై ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

విశాలాంధ్ర-ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో నల్లరాతి క్వారీలను పిండి చేసేస్తున్నారు. ఆవగింజంత అనుమతులతో కొండలన్నింటినీ బరితెగించి మరీ తవ్వేస్తున్నారు. లీజుకు తీసుకున్న దానికంటే హద్దులు దాటి మరీ క్వారీలను కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. 100 అడుగులకు పైబడి రిగ్‌్‌ బ్లాస్టింగ్‌ చేస్తుండ డంతో ప్రత్తిపాడు మండలంలోని పెద్ద శంకర్ల పూడి చుట్టుపక్కల గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. నల్లరాతి క్వారీలు గ్రామానికి సమీపంలో ఉండడంతో పేలుళ్ల ధాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయి. అర్ధరాత్రి క్వారీల్లో బాంబులతో బ్లాస్టింగ్‌ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న శంకర్ల పూడి, పెద్ద శంకర్ల పూడి, రౌతులపూడి మండలం ఎస్‌ పైడిపాల, గుమ్మరేగాల, రాఘవపట్నం, ఉప్పంపాలెం, ములగపూడి తదితర గ్రామాల్లో నల్ల రాతి క్వారీలు ఉన్నాయి. గోరంత అనుమతులతో కొండలను భారీ ఎత్తున తవ్వేస్తున్నా గనుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. క్వారీ లీజుదారులకు రాజకీయ నాయకులు మద్దతు ఉండడంతో అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో ఇష్టానుసారంగా కొండలను కొల్లగొట్ట డంతో పాటు యథేచ్చగా రిగ్‌్‌ బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారు. 12 మంది లీజుదారుల్లో అనేకమంది కాలపరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. టిప్పర్లు పరిమితికి మించి నల్లరాయిని తరలించుకుపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా రవాణాశాఖ అధికారులు సైతం పట్టించుకున్న దాఖలు లేవు. చిన్న శంకర్ల పూడి, పెద్ద శంకర్ల పూడి సర్వే నెంబరు 53,160,160/1లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
నల్లరాతి క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేయాలంటే రెవెన్యూ, పోలీసు, గనులశాఖల అనుమతులు తీసుకోవాలి. చిన్న శంకర్ల పూడి, పెద్దశంకర్ల పూడి గ్రామాల్లోని నల్ల రాతి క్వారీ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా జిలెటిన్‌ స్టిక్‌లు వినియోగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా తవ్వేస్తున్నారు. కొండలపై తవ్వకాలకు తొలుత బెంచ్‌ కట్‌ చేయాల్సి ఉంటుంది. తక్కువ పరిమితిలో బ్లాస్టింగ్‌ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా 100 అడుగులు మించి రంధ్రాలు చేసి రిగ్‌ బ్లాస్టింగ్‌ చేయడంతో పరిసర గ్రామాల్లో ప్రకంపనలు ఏర్పడి గృహాలు బీటలు వారుతున్నాయి. ఇదేవిషయమై ఆయా గ్రామస్తులు కలెక్టర్‌కు, గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గనులశాఖ అధికారులు లీజు దారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయినా అక్రమార్కులు కొండలను పిప్పిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img