Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

జగనన్న అడ్డుపుల్ల

వివేకా హత్యకేసులో ఆటంకాలన్నీ జగన్‌ సృష్టించినవే

సునీత న్యాయవాదుల ఆరోపణ

. అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పును తప్పుబట్టిన సుప్రీం
. స్టే ఇస్తూ 24న తుది విచారణ చేపడతామని వెల్లడి
. అప్పటివరకు అరెస్ట్‌ చేయొద్దని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. కేసు దర్యాప్తును మృతుడు వివేకా కుమార్తె సునీతారెడ్డి సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి మరో చిన్నాన్న భాస్కర్‌ రెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ అవినాశ్‌ రెడ్డితో పాటు వారి ముఖ్యఅనుచరులంతా నిందితులుగా ఉండడంతో సీబీఐ అధికారులకు సైతం ఈ కేసు ఒక సవాలుగా మారింది. వివేకాను హత్య చేసి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఈ నెల 30వ తేదీలోగా ఎట్టిపరిస్థితుల్లో కేసు విషయం తేల్చాలని, ఛార్జిషీట్‌ సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. అయితే ఈ కేసులో కీలక నిందితులుగా ముఖ్యమంత్రి బంధువులే ఉండడం, వారు దర్యాప్తునకు అడుగడుగునా ఆటంకాలు కల్పించే పరిస్థితి నెలకొని ఉండటంతో సునీత కూడా మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వారి ప్రయత్నాలకు ఎక్కడికక్కడ చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా అవినాశ్‌ రెడ్డిని హైకోర్టు ఈనెల 25 వరకు అరెస్ట్‌ చేయెద్దంటూ ఇచ్చిన ఆదేశాలపై సునీత సుప్రీంను ఆశ్రయించింది. ఎటువంటి ఆంక్షలూ లేకుండా సీబీఐని స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌, అందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. ఈసారి ఆమె తొలిసారి నేరుగా సీఎం జగన్‌పై ఎటాక్‌ చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఒక కొలిక్కి రాకముందే నవంబర్‌ 19వ తేదీ 2021న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ అసెంబ్లీలో అవినాశ్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితునికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ కేసులో అవినాశ్‌ రెడ్డి పేరు కీలకమని సీబీఐ అధికారులు గుర్తించి విచారణ ప్రారంభించిన తర్వాతే జగన్‌ క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. వివేకా హత్యకు సంబంధించిన ఛార్జిషీటులో అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది లూద్రా వాదనలు వినిపించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్‌ ప్రకారం లేవు. హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని, ఈనెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పని చేసేలా చూడాలి. కానీ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు అవరోధం కలిగించేలా ఉన్నాయని న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది.
ఆ ఉత్తర్వులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈనెల 24న దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, అప్పుడు అన్ని విషయాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు అవినాశ్‌ను అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈనెల 30లోపు కేసు విచారణ పూర్తి చేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తామని తెలిపింది.

మూడో రోజూ 6 గంటలపాటు అవినాశ్‌ రెడ్డి విచారణ
వివేకా హత్య కేసులో కడప వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అవినాశ్‌ రెడ్డిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో మూడవరోజు శుక్రవారం కూడా సుమారు 6 గంటల పాటు విచారించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని కూడా సుమారు 6 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ను సీబీఐ కార్యాలయం నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ను శనివారం మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ నెల 24 వరకు సీబీఐ కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img