Monday, October 3, 2022
Monday, October 3, 2022

నేటి నుంచి జన ఆందోళన్‌

అనంతపురం, శ్రీకాకుళం నుంచి పాదయాత్రలు జయప్రదం చేయండి
ఓబులేశు, జల్లి విల్సన్‌, రావుల వెంకయ్య పిలుపు
‘సీపీఐ జన ఆందోళన్‌’ పోస్టరు విడుదల

అమరావతి : ప్రజల రక్త మాంసాలు, కష్టార్జితంతో నిర్మితమైన దేశ సంపదను తెగనమ్మే చర్యలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ ‘సీపీఐ జన ఆందోళన్‌’ పేరిట ఈనెల 14 నుంచి 21వరకు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్రలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం సీపీఐ జనఆందోళన్‌ పోస్టరును పార్టీ నేతలు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఓబులేశు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన అనంతపురం, శ్రీకాకుళాల నుంచి రెండు బృందాలుగా సీపీఐ పాదయాత్రలు ప్రారంభిస్తుందని, అనంతరం 21న విశాఖలో ముగింపు సభను నిర్వహించనుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్లచట్టాలను వ్యవతిరేకిస్తూ, రైతుసంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 27వ తేదీన తలపెట్టిన భారత్‌బంద్‌కు రాష్ట్రంలో పది వామపక్ష పార్టీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ ఆస్తులను, సంస్థలను కార్పొరేట్‌లకు కారుచౌకగా ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 100 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ రంగానికి అప్పజెప్పడానికి సిద్ధం చేసిందన్నారు. 75లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆస్తులను అదానీ, అంబానీలకు కారుచౌకగా తాకట్టు పెడుతోందని విమర్శించారు. ప్రజల సంపదను కొల్లగొట్టడానికి మోదీ ఈ చర్యలకు పాల్పడుతోందని తూర్పారబట్టారు. ఆరు నెలల కాలంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ మార్చేసిందని, కుల, మత రాజకీయాలే అజెండాతో అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.
జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా తెగనమ్మడం, ప్రజలపై పెనుభారాలు వేసే కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాల్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో సీపీఐ పాదయాత్రలు, నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. బీజేపీ విధానాలతో గ్రామీణ పేదల జీవనోపాధి, ఉద్యోగాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండు చేశారు.
రావుల వెంకయ్య మాట్లాడుతూ 13 జిల్లాల్లో జనఆందోళన్‌ పాదయాత్రలు కొనసాగుతాయని వివరించారు. విశాఖలో జరిగే ముగింపు సభకు సీపీఐ జాతీయ నేతలు బినయ్‌ విశ్వం, డాక్టర్‌ కె.నారాయణ హాజరవుతారన్నారు. మోదీ రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక చర్యల్ని నిరసిస్తూ సీపీఐ పాదయాత్రలు చేపట్టిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరముందని రావుల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img