Monday, April 22, 2024
Monday, April 22, 2024

పోలవరం కోసం ఐక్య ఉద్యమం

. నిర్వాసితులను గోదావరిలో ముంచొద్దు
. ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలి
. ఏలూరు సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – ఏలూరు : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని, సత్వరమే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన సోమవారం బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 జిల్లాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని, ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని చెప్పారు. ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించడం వలన 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని, ఫలితంగా కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరాతో పాటు 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తితో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని రామకృష్ణ విమర్శించారు. పోలవరాన్ని గాలికి వదిలేశారని, నిధులు కేటాయించకపోయినా కేంద్రాన్ని అడిగే ధైర్యం సీఎం జగన్‌కు లేదన్నారు. మూలధనాన్ని ఖర్చుపెట్టిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ చివరిస్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయం, కొత్త పరిశ్రమలు రాకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉంచారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో విశాఖను రౌడీలకు నిలయంగా మార్చారని ఆరోపించారు. నిరుపేదలందరికీ అండగా నిలుస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కాలనీలు నిర్మించడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, మౌలిక సదుపాయాలు కల్పించి, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించి నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో మోదీ సర్కారు విఫలం చెందిందని విమర్శించారు. మోదీ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమేనన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి తక్షణం రూ.30వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం తగ్గించడానికే ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ కేసులకు భయపడకుండా కేంద్రం నుంచి నిధులు రాబట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. టీడీపీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తానే విజయం సాధిస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు, అమరావతి రాజధానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు పి.మధు మాట్లాడుతూ కాంటూరు లెక్కలన్నీ తప్పుడు తడకలని, శాస్త్రీయంగా సర్వే జరిపి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలు ముంపునకు గురికావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఇటువంటి అసమర్ధ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమన్నారు.
ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు కావాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శరణ్యమన్నారు. సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. 14 జాతీయ ప్రాజెక్టులలో 13 ప్రాజెక్టులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టును కూడా వాటి సరసన చేర్చడానికి సీఎం జగన్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గతేడాది వరదలకు నష్టపోయిన ప్రజలకు నేటికీ నష్టపరిహారం అందలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని జగన్‌ నిలదీయకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు, ప్రాజెక్టు నిర్మాణం సీపీఐకి రెండు కళ్లు లాంటివన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు మోదీ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు జీపు జాతా చేసి 40 వేల కరపత్రాలు పంపిణీ చేసి స్వయంగా సమస్యలు అధ్యయనం చేశామ న్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాల సాకుతో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదన్నారు. అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కాలనీలకు తరలించిన18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా మాజీ చైర్మన్‌ చందా లింగయ్య మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పెద్దఎత్తున ఉద్యమాలు చేయడం అభినందనీయ మన్నారు. కమ్యూనిస్టు పార్టీల వలనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జగన్‌ చేసిన వాగ్దానం ప్రకారం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తొలుత సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాడిస రాము స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి అర్‌.పిచ్చయ్య, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి. సభలో సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ, ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు అత్తిలి విమల, పోలవరం మండల కార్యదర్శి జేవీ నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, పెద్దసంఖ్యలో నిర్వాసితులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img