Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

మసకబారుతున్న ‘ఆశా’జ్యోతులు

కనీసం మాస్కులు ఇవ్వని వైనం
బీహార్‌ సర్కార్‌ నిర్లక్ష్యానికి 15 మంది బలి
అంతకంతకూ పెరుగుతున్న మరణాలు

కొవిడ్‌ కాలంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా వ్యవహరించిన ‘ఆశా’ జ్యోతులు అనేకం అర్థాంతరంగా ఆరిపోయాయి. కొవిడ్‌ రక్షణ కవచాలు ఇవ్వకపోవడం, తక్కువ వేతనానికి ఎక్కువ పనిచేయించడం, వీరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆశావర్కర్ల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. తమ విషయంలో అధికారుల నిర్లక్ష్యధోరణిని ఆశావర్కర్లు ప్రతిఘటిస్తున్నారు. అధికారులు తమను కట్టుబానిసలుగా చూస్తారని, నెలకు 20 రోజులు పనిచేయాల్సి ఉండగా జీతం కావాలంటే 30 రోజులు పనిచేయక తప్పడం లేదని వాపోయారు. కొవిడ్‌ కాలంలో మాస్కులు` గ్లౌజులు ఇవ్వలేదన్నారు. తమను వాడిపడవేసే వస్తువులా చూస్తారని అవేదన వెళ్లగక్కారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నా సర్వేలకు పంపుతారని, ఇలా పనిచేసిన కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచారని తమ సహోద్యోగులను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీహార్‌కు చెందిన ఆశా వర్కర్లు 15 మంది మహమ్మారికి బలయ్యారు. ఆశా వర్కర్లకు సమయానికి వేతనాలు ఇవ్వరు, వారి శ్రమను దోచుకుంటారు, కనీస వసతులు కల్పించరు, రవాణా సౌకర్యం ఉండదు అని ఆశా వర్కర్ల యూనియన్‌ నేత యాదవ్‌ అన్నారు. ఇటీవల ఓ సర్వే జరిపేందుకు మున్నీఖాతూన్‌ ఐదు నిమిషాలు ఆలశ్యంగా రావడంతో ఆమెకు షోకాజ్‌ ఇవ్వడాన్ని నిరసించినట్లు తెలిపారు. రవాణా సౌకర్యం కల్పనకు డిమాండు చేశామన్నారు. తక్కువ వేతనాలు, శ్రమదోపిడీయే ఆశా వర్కర్ల మరణాలకు ప్రధాన కారణాలుగా తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నాగానీ సునితా కుమారిని సర్వేకు పంపగా ఆమె ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని దినకర్‌ ప్రసాద్‌ అనే వైద్యుడు వెల్లడిరచారు. కుమారికి నెలజీతంగా రూ.3వేల నుంచి రూ.4వేలు వచ్చేవని, ఆశావర్కర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.వెయ్యి ఇంక్రిమెంట్‌ చెల్లించలేదని చెప్పారు. ఇదే విషయమై బీహార్‌ ఆరోగ్యమంత్రికి మెమోరాండం ఇచ్చినా ఫలితం శూన్యమని అన్నారు.
దేశంలోని ఆశా వర్కర్లకు నెలకు రూ.18వేల కనీస వేతనం డిమాండుతో చాలా కాలం పాటు ఆందోళనలు జరిగాయి. అయితే వీరి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి ఆపద్కాలంలో మీ కష్టాలు మీరు పడండి అన్నట్లు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పర్యవసానంగా కొవిడ్‌ రెండవ దశలో చాలా మంది ఆశావర్కర్లు మహమ్మారి కోరల్లో చిక్కి ప్రాణాలు వదిలారు. పెరుగుతున్న ఆశా వర్కర్ల మరణాలపై కొందరు ఆందోళన వ్యక్తం చేసినా అధికారుల్లో చలనం లేదు. 2020లో ఆక్స్‌ఫామ్‌ నిర్వహించిన సర్వే ప్రకారం బీహార్‌తో పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 25శాతం మంది ఆశా వర్కర్లకు మాస్కులు, 62శాతం మంది గ్లౌజులు ఇవ్వలేదని వెల్లడైంది.
కట్టుబానిసలమా…!
సమస్యలపై గళమెత్తే తన లాంటి వారిని వ్యవస్థాగతంగా లక్ష్యంగా చేసుకొని ఆపదలో ఆదుకునే వారే లేకుండా చేస్తారని సమస్తిపూర్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సంగీతా సంగం వాపోయారు. కొవిడ్‌ సోకితే కనీస సాయం అందించకపోగా వేతనం నిరాకరించినట్లు తెలిపారు. అనారోగ్యంతో పనికి వెళ్లలేని పరిస్థితి ఉందని, బ్యాంకు ఖాతా ఖాళీ అయిందని, దాచుకున్న కొంతడబ్బును కొవిడ్‌ చికిత్స కోసం వాడానని చెప్పారు. నెలరోజులుగా జీతంలేక మనుగడే కష్టమైందన్నారు. తనలాంటి చాలా మంది ఆశావర్కర్ల స్థితి ఇదేనన్నారు.
ఏప్రిల్‌ చివరి వారంలో 42ఏళ్ల మధు దేవి పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని మాంజౌలియా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి సేవలు అందించారు. ఆ తర్వాత ఆమెలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. ఆపై శ్వాస అందక ఇబ్బంది పడ్డారు. ఇంట్లోనే స్థానిక మందులతో చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేక ఆమె చాలా ఏళ్లుగా పనిచేస్తున్న మంజౌలియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముక్కు నుంచి నమూనాను సేకరించిన సిబ్బంది 30 నిమిషాల్లోనే కొవిడ్‌ లేదని తేల్చేశారు. రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుల ఫలితాలు కచ్చితమైనవి కాదన్న విషయాన్ని పట్టించుకోలేదు. అయితే దేవి పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను అదే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచారు. బెట్టయ్య పట్టణానికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రి నుంచి బయటకు తెచ్చేలోపే ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదే ఆసుపత్రి అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా చనిపోవడంతో దేవి మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి గాథలు బీహార్‌లో కోకొల్లుగా ఉన్నాయి. రాపిడ్‌ యాంటీజెన్‌ టస్టుల్లో అవకతవకలు, నెగటివ్‌ టెస్టు రిపోర్టుల జారీ వంటి ఆరోపణలు ఉన్నాయి.
ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పరిగణించే ఆశావర్కర్ల పరిస్థితి బీహార్‌లో ఘోరంగా ఉందని, వారికి వైరస్‌ నుంచి రక్షణ కోసం కనీస పరికరాలు కల్పించలేదని ఆ రాష్ట్ర ఆశావర్కర్ల సంఘం అధ్యక్షులు శశియాదవ్‌ అన్నారు. చాలా మంది ఆశావర్కర్లకు ఒక్క డోసు వాక్సిన్‌ ఇచ్చినప్పటికీ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. ‘కొందరు రెండు టీకాలను కచ్చిత సమయానికి తీసుకోలేకపోయారు. మరికొందరు సరైన రవాణా లేక వాక్సిన్‌ కేంద్రాల వద్దకు చేరుకోవడమే గగనమైంది. వసతుల లేమి వీరి ప్రాణాలను హరిస్తోంది’ అని యాదవ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అయితే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు లేకుండా ఆశావర్కర్లు పనిచేయరని బీహార్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొవిడ్‌ రోగుల ఫీల్డ్‌ సర్వేలకు వెళ్లే ఆశా వర్కర్లకు ఇవేమీ కల్పించలేదని క్షేత్రస్థాయిలో స్పష్టమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img