Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మోదీ విషపు వ్యాఖ్యలు

అవినీతిని ప్రశ్నించిన విపక్షాలపై నిప్పులు
కుటుంబ పాలన`కేసీఆర్‌ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, మౌలిక ప్రాజెక్టులకు శ్రీకారం

విశాలాంధ్ర-హైదరాబాద్‌: నిజాయితీగా పనిచేసేవారంటే అవినీతిపరులకు భయమని, వారు చేసే అవినీతి ప్రశ్నించారదట అంటూ ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విపక్షాలపై ప్రధాని మోదీ వ్యంగాస్త్రాలు సంధించారు. తమ అవినీతిపై ఎవరూ దర్యాప్తు చేయకూడదని కొన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లి నిరాశపడ్డాయని ఎద్దేవా చేశారు. మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో సహా 14 ప్రతిపక్ష పార్టీలు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లడంపై విమర్శలు గుప్పించారు. ‘కొన్ని రోజుల కిందట రాజకీయ పార్టీల్లో కొన్ని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి అవినీతితో నిండిన మాపై ఎవరూ దర్యాప్తు జరపకుండా రక్షణ కల్పించండని వేడుకున్నాయి. కానీ కోర్టు వారికి షాక్‌ ఇచ్చింది’ అని మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన గురించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవద్దని రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదన్న ఆరోపణలు బాధించాయని, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎంతో చేశామని చెప్పుకున్నారు. కొందరు కుటుంబ పరిపాలనను ప్రోత్సహిస్తున్నారని ఎవరి పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేంద్రం అమలు చేసే ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ‘పరివార్‌వాద్‌’, ‘అవినీతి’ రెండు వేర్వేరు కాదని, కుటుంబ పాలన ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని, తెలంగాణలోనూ అలాంటి కుటుంబమే ఉందని, దాన్ని చట్టప్రకారం శిక్షించాలా వద్దా చెప్పండని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. కోవిడ్‌ మహమ్మారి, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురవుతున్నా మౌలికవసతులు, ఆధునికీకరణపై రికార్డుస్థాయిలో వెచ్చించిన దేశాల్లో భారత్‌ ఒకటని గొప్పలు పోయారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక వసతుల ఆధునికీకరణ కోసం రూ.10లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
మోదీ అంతకుముందు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్‌`తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 13 ఎంఎంటీఎస్‌ సేవలను ప్రారంభించారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆధునిక భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి అనేక మౌలికవసతుల ప్రాజెక్టులనూ ప్రారంభించారు. మోదీ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తుందని, కొందరి గుప్పిట్లో అధికారం ఉందని, కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలన్నారు. తమ హయాంలోనే తెలంగాణ బాగా అభివృద్ది చెందిందని తెలిపారు. కేంద్రం సహకరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ అరోపణలను మోదీ ఖండిరచారు. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావట్లేదన్నారు. నవ భారతంలో నలుమూలల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నవభారతంలో దేశ ప్రజల కలలను నిజం చేయడమే తమ ధ్యేయమన్నారు. కుటుంబ పార్టీ, మామ, అల్లుడు, కూతురు, కొడుకు ఉన్న పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. కుటుంబ పార్టీ అవినీతికి కేరాఫ్‌గా మారిందని, కుటుంబ పార్టీలు అందరినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తాయని విమర్శించారు. 2014 తర్వాత దేశానికి సంకెళ్ల నుంచి విముక్తి లభించిందన్నారు. తెలంగాణలో ఉన్నట్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ పార్టీలు సామాన్యుల రేషన్‌ కూడా దోచుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశంతో పాటు తెలంగాణకు మహర్దశ ఉంటుందని, తెలంగాణ ప్రజల కలల సాకారానికి కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. తన మొత్తం ప్రసంగంలో అధికార పార్టీ పేరు ఎత్తకుండా, ఎవరి పేరును ప్రస్తావించకుండా రాష్ట్రంలోని అధికార పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీలు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img