Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

రేపు,ఎల్లుండి వైసీపీ ‘ప్లీనరీ’

ఏఎన్‌యూ ఎదుట ఖాళీ స్థలంలో భారీ ఏర్పాట్లు
లక్షల్లో కార్యకర్తలను సమీకరించడంపై దృష్టి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈనెల 8,9 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. పార్టీ యంత్రాంగం మొత్తం దీనిపైనే దృష్టి కేంద్రీకరించింది. లక్షల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు దీటుగా ప్లీనరీ జరగాలని నేతలు తలమునకలవుతున్నారు. మే 28వ తేదీ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడు నిర్వహిస్తుండగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జులై 8,9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తోంది. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కరోనా రావడంతో మూడేళ్ల తర్వాత ఇదే మొదటి ప్లీనరీ కావడం గమనార్హం. గతంలో 2011 జులై 8,9 తేదీల్లో పార్టీ తొలి ప్లీనరీ ఇడుపులపాయలో నిర్వహించగా, ఎన్నికల ముందు 2017లో ప్రస్తుతం జరిపే స్థలంలోనే ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీలోనే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాల పేరుతో అజెండా రూపొందించి అదే తమ ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవన్నీ అమలు చేస్తామని వాగ్ధానం చేశారు. ప్రస్తుతం జరుగనున్న మూడో ప్లీనరీ కూడా 2024 ఎన్నికల ముందు నిర్వహిస్తుండడంతో, ఈ సమావేశాల్లో చేసే తీర్మానాలు, రూపొందించే అజెండా కూడా రానున్న ఎన్నికలకు కీలకం కానున్నట్లు భావిస్తున్నారు. ప్లీనరీకి కనీసం ఆరు లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా భోజన ఏర్పాట్లు చేపడుతున్నారు. వర్షం పడినా ఇబ్బందుల్లేకుండా జర్మనీ టెక్నాలజీతో కూడిన ఆధునాతన షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ జాతీయ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ప్లీనరీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించడంతో రవాణాశాఖ ఏర్పాట్లలో తలమునకలైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో, దూర ప్రాంతాలకు చెందిన ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేలకు తగ్గకుండా ప్రజలను తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
పార్టీ నియమావళిలో సవరణలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియమావళిలో కొన్ని సవరణలు ఈ ప్లీనరీ ద్వారా తీసుకురానున్నట్లు పార్టీ నేతలు వెల్లడిరచారు. సీఎం జగన్‌ తల్లి విజయలక్ష్మి ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు వెన్నుదన్నుగా ఉంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ మరో రాష్ట్రంలో వేరే పార్టీకి అనుకూలంగా ఎలా పర్యటిస్తారని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అంశాలతో పాటు, సంస్థాగతంగా మరికొన్ని మార్పులపై కూడా సవరణలు తీసుకురానున్నారు.
తొలుత ఇడుపులపాయ, తర్వాత ప్లీనరీకి సీఎం జగన్‌ హాజరు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 7వ తేదీ ఉదయం పులివెందుల వెళుతున్నారు. అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్‌ చేరుకుంటారు. అక్కడ న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లి చేరుకుంటారు. 3.30 గంటలకు డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక పార్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తర్వాత నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img