Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

షర్మిల సేవలు ఏపీకా…తెలంగాణకా?

. కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధం
. టి.కాంగ్రెస్‌ నేతలతో భేటీలు
. బలం చేకూర్చిన కేవీపీ వ్యాఖ్యలు
. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ ఆహ్వానం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో షర్మిల వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. షర్మిల విధించిన షరతులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరిస్తే… చేరిక తథ్యమని తెలుస్తోంది. తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితమై ఉంటానని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని ట్విట్టర్‌ వేదికగా షర్మిల ఇటీవల స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితమంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ముడిపడి ఉంటుందని, తెలంగాణ కోసమే పని చేస్తానని తేల్చిచెప్పారు. షర్మిల తన రాజకీయ విమర్శలు బీజేపీ, టీఆర్‌ఎస్‌కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్‌పై ఎలాంటి విమర్శలూ చేయలేదు. ఇటీవల కాలంలో ఆమె తెలంగాణలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ చేపట్టలేదు. దీంతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంగానీ లేదా పొత్తుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. షర్మిల పార్టీ ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో పార్టీకి గుర్తింపు రాలేదు. కనీసం కూడా పార్టీ బలపడలేదు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఓట్ల చీలికతో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చే అవకాశముందని భావించిన షర్మిల… కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం షర్మిల చేరికపై ఆచితూచి వ్యవహరిస్తోంది.
వైఎస్‌ వర్గ నేతల ఆహ్వానం
తెలంగాణలో నాటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్గం కాంగ్రెస్‌ నేతలు షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తుండగా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం వ్యతిరేకిస్త్తోంది. తెలంగాణ కంటే ఆంధ్రలోనే షర్మిల సేవలు కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తాయనే సాకుతో ఆమె చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. టి.కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు షర్మిలకు మద్దతుగా ఉన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన వర్గంతో కలిసి రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. గతంలో షర్మిల, పొంగులేటి సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించిన విషయం విదితమే. పొంగులేటి చేరికతో షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆమె ఒక్కరికే టికెట్టు ఇస్తారా లేక ఆ పార్టీలోని ముఖ్యనేతలకు టికెట్లు ఇస్తారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. షర్మిల పార్టీలో ఆమె తప్ప మిగిలిన నేతలెవ్వరికీ ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా లేదు. షర్మిల కాంగ్రెస్‌లో చేరాలని ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఆహ్వానిస్తున్నారు. షర్మిల వస్తే తమ పార్టీకి ఎంతోకొంత బలం ఉంటుందని తులసిరెడ్డి తదితరులు వ్యాఖ్యానిస్తున్నారు.
షర్మిల సేవలు ఏపీకా…తెలంగాణకా?
షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఆమె సేవలు తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తారా లేక ఏపీకి పంపుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ సోదరి అయిన షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి నష్టమని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఏపీకి రాకుండా ఆమెను తెలంగాణకే పరిమితం చేసేలా వైఎస్‌ విజయమ్మతోను, షర్మిలతోనూ వైసీపీ సీనియర్‌ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. షర్మిల తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయానికి వెనుకాడే ప్రసక్తి లేదని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టవద్దని జగన్‌ సూచించినప్పటికీ ఆయన మాటను బేఖాతరు చేస్తూ షర్మిల పార్టీ పెట్టిన విషయం విదితమే. జులై 8న వైఎస్‌ జన్మదిన వేడుకల సందర్భంగా షర్మిల కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img