Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వం ప్రశ్నార్థకం

బీఐఎంఎస్‌టీఈసీ సమావేశంలో మోదీ
న్యూదిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారం, ముఖ్యంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం ముఖ్యమైన అంశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బీఐఎంఎస్‌టీఈసీ వర్చువల్‌ సమావేశంలో మోదీ బుధవారం మాట్లాడారు. బీఐఎంఎస్‌టీఈసీలో భారతదేశం, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, మైన్మార్‌, థాయ్‌లాండ్‌ ఉన్నాయి. ఈ దేశాల ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో మోదీ మాట్లాడుతూ యూరప్‌లో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయంగా సహకరించుకోవడానికి గొప్ప ప్రాధాన్యం ఏర్పడిరదన్నారు. మన ప్రాంతం ఆర్థిక, ఆరోగ్య భద్రత సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇప్పుడు అవసరమైనవి ఐకమత్యం, సహకారమని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రాంతీయ కూటమి సామర్థ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. బీఐఎంఎస్‌టీఈసీ దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని పెంచుకోవడం కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. అనుసంధానం, సౌభాగ్యం, భద్రతల వారధిగా బంగాళాఖాతాన్ని తీర్చిదిద్దవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. బీఐఎంఎస్‌టీఈసీ దేశాలన్నీ కలిసి 1997లో సాధించిన లక్ష్యాలను మళ్లీ సాధించడం కోసం నూతనోత్సాహంతో పని చేయడానికి అంకితమవ్వాలని పిలుపునిచ్చారు. బీఐఎంఎస్‌టీఈసీ ఆపరేటింగ్‌ బడ్జెట్‌ కోసం భారత దేశం మిలియన్‌ డాలర్లు అందజేస్తున్న విషయం విదితమే.
ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను
ఏప్రిల్‌ ఒకటిన జరగనున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి వస్తోన్న స్పందన అసాధారణమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీనికోసం ఇప్పటికే లక్షల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిరచారన్నారు. ‘ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం పట్ల చూపుతోన్న ఉత్సాహం అసాధారణంగా ఉంది. లక్షల్లో ప్రజలు తమ విలువైన అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. ఇందుకోసం ముందుకొచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. ఏప్రిల్‌ ఒకటిన జరగబోయే కార్యక్రమం కోసం వేచిచూస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని తల్కటోరా స్టేడియం వేదిక కానుంది. నాలుగేళ్లుగా విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది దీనిని వర్చువల్‌గానే నిర్వహించారు. ఇదివరకే ఈ కార్యక్రమం గురించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు. ‘పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయం వంటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రధాని నుంచి సలహాలు కోరండి. చిట్కాలు తెలుసుకోండి. ఎగ్జామ్‌ వారియర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సిద్ధంగా ఉండండి’ అంటూ ఆయన ట్విటర్‌లో కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img